ఎమ్మెల్సీ కవిత పిటిషన్లపై నేడు తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ ప్రత్యేక కోర్టు
ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ విచారణ.. అంతటా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది.
ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు.
కేవలం ఇతరుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు.
బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు..
ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment