న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ కేసులో కవిత కస్టడీని జులై 18 వరకు పొడగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది
రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జులై 18 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు.
అదే విధంగా ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఆప్ నేత మనిష్ సిసోడియా కస్టడీని జులై 25వ తేదీకి పొడిగిస్తూ బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.
కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరస్తూ న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment