బెయిల్‌ ఉత్తర్వుల కాపీల జారీలో ప్రత్యామ్నాయ యంత్రాంగం | An alternative mechanism in the issuance of copies of bail orders | Sakshi
Sakshi News home page

బెయిల్‌ ఉత్తర్వుల కాపీల జారీలో ప్రత్యామ్నాయ యంత్రాంగం

Published Fri, Jul 23 2021 2:42 AM | Last Updated on Fri, Jul 23 2021 2:42 AM

An alternative mechanism in the issuance of copies of bail orders - Sakshi

సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, ఆ ఉత్తర్వుల సర్టిఫై కాపీలు జైలు అధికారులకు సకాలంలో అందకపోవడంతో అండర్‌ ట్రయిల్‌ ఖైదీలు, నిందితులు ఇబ్బందిపడుతున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల కోర్టు ఉత్తర్వుల కాపీల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ ఏర్పాటు చేసింది. సకాలంలో ఉత్తర్వుల కాపీని అందజేయకుండా బెయిల్‌ పిటిషన్‌ను పరిష్కరించడం నిందితుడిని సౌకర్యవంతమైన స్థానంలో ఉంచదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కోర్టులు సరికొత్త పద్ధతులను అన్వయించుకుంటూ ఈ సమస్యపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ఇటీవల హైకోర్టులో కోర్టు మాస్టర్లు ఏ రోజు జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్‌ను, వెలువరించిన ఉత్తర్వులను, తీర్పులను ఆ రోజే నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారంది. 

► ఈ పరిస్థితుల్లో కక్షిదారులు, న్యాయవాదులు ఉత్తర్వుల కాపీలను హైకోర్టు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంది. నిందితుల తరఫున పూచీకత్తులు సమర్పించడానికి మెమో దాఖలు చేసే సమయంలో న్యాయవాది ఉత్తర్వుల కాపీని హైకోర్టు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న విషయాన్ని ప్రస్తావించాలి. 
► సంబంధిత కోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి లేదా చీఫ్‌ మినిస్టీరియల్‌ అధికారి హైకోర్టు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ ఉత్తర్వులను పరిశీలించాలి.
► కోర్టు ప్రిసైడింగ్‌ అధికారి అదే రోజు రిలీజ్‌ ఆర్డర్‌ను ఈ–మెయిల్‌ లేదా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో జైలు అధికారికి పంపాలి. ముందస్తు బెయిల్‌ విషయంలో కోర్టు ఉత్తర్వుల కాపీల పరిశీలన బాధ్యత సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌దే. 
► ఈ ఉత్తర్వుల కాపీని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్, అన్ని జిల్లాల ప్రిన్సిపల్‌ జడ్జిలకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)ను ఆదేశించింది. 
► జిల్లా జడ్జిల ద్వారా ఈ ఉత్తర్వుల కాపీని ఆయా న్యాయవాద సంఘాలకు కూడా పంపాలని సూచించింది. ఈ నెల 26 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంది. 
► న్యాయాధికారులు ఈ ఉత్తర్వుల అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటే.. రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) దృష్టికి తీసుకురావాలంది. ముందస్తు బెయిళ్ల విషయంలో ఎస్‌హెచ్‌వోలు తమ ఇబ్బందులను హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దృష్టికి తీసుకురావచ్చంది. ఆ ఇబ్బందులను రిజిస్ట్రార్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆగస్టు 31 నాటికి హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది. 
► ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు కావాలంటే తదుపరి విచారణ సమయంలో చూస్తామంటూ విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ కన్నెగంటి లలిత గురువారం ఉత్తర్వులిచ్చారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసేటప్పుడు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement