కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు
కౌంటర్‌లో పేర్కొన్న వైవీ విక్రాంత్‌రెడ్డి
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి
నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) రాజకీయ దురుద్దేశాలతోనే తనపై సీఐడీకి ఫిర్యాదు చేశారని వైవీ విక్రాంత్‌రెడ్డి హైకోర్టుకి నివేదించారు. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టి, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణను తోసిపుచ్చుతున్నట్టు విక్రాంత్‌రెడ్డి తెలిపారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీయాలన్న అజెండాతోనే కేవీ రావు నాపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా అనుచిత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు. నాపై చేసిన ఏ ఒక్క ఆరోపణకు కూడా ఆధారం చూపలేదు. తద్వారా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఈ కేసులో నిర్ణయం వెలువరించేందుకు అత్యావశ్యకమైన పలు కీలక విషయాలను ఆయన తొక్కిపెట్టారు. వాటాల బదిలీ జరిగిన నాలుగేళ్ల తరువాత సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో ఆయన ఎక్కడా చెప్పలేదు. వాటాల బదిలీ ప్రక్రియలో, మూల్యాంకనంలో, ఒప్పందాల తయారీలో కేవీ రావు క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంతో నాకున్న రాజకీయ సంబంధాల దృష్ట్యా నా ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ దురుద్దేశాలతో ఆయన ఫిర్యాదు చేశారు. కేవీ రావు తన స్వీయ చర్యల నుంచి దృష్టిని మరల్చేందుకే, తన తప్పులను కప్పించుకునేందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. తను బాధితుడినంటూ చెప్పుకుంటున్న కేవీరావు అందుకు ప్రాథమిక ఆధారాలను చూపడంలో విఫలమయ్యారు. న్యాయ సలహాదారులు, ఆడిటర్ల సమక్షంలోనే వాటాల బదిలీ జరిగింది’ అని విక్రాంత్‌రెడ్డి వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయదలచుకుంటే చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేయడంతో విక్రాంత్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ సోమవారం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. విక్రాంత్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment