శివుడు... గెలిచాడు! | Paper boy gets IIM seat | Sakshi
Sakshi News home page

శివుడు... గెలిచాడు!

Published Fri, Sep 20 2013 12:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

శివుడు... గెలిచాడు!

శివుడు... గెలిచాడు!

అతడొక పేపర్ బాయ్. ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి వేపర్ వేస్తున్నాడు. ఒకరోజు అతడి సక్సెస్ స్టోరీ అతడు డెలివరీ చేసే న్యూస్ పేపర్లలో ప్రచురితమైంది! అతన్నొక సెలబ్రిటీని చేసింది. అయితే అదొక అద్భుతంలా జరగలేదు. అతడు పడిన శ్రమకు  ప్రతిఫలంగా జరిగింది.
 
 ఎన్.శివకుమార్... ఈ యేడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ ఎంట్రన్స్ కోసం జరిగిన ‘క్యాట్’ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరిలోనూ ప్రత్యేకంగా వినిపించిన పేరు. ఎంతోమంది విద్యార్థులు ఐఐఎమ్‌లలో ఎంబిఏ చదివేందుకు అర్హత సాధించినా శివకుమార్ సాధించిన సక్సెస్ మాత్రం ప్రత్యేకమైనదిగా నిలిచింది. అతడి ప్రస్థానం ప్రముఖంగా నిలిచి అతడికొక సెలబ్రిటీ స్టేటస్‌ను ఇచ్చింది. పేపర్‌బాయ్, పేపర్‌సెల్లర్... ఐఐఎమ్‌లో సీటు సాధించక ముందు వరకు శివకుమార్‌కి ఉన్న హోదా అది! ఈ నేపథ్యమే అతడి విజయానికి మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతా అనుకూలమైన పరిస్థితుల మధ్య ర్యాంకును సాధించడం కాదు, చదువుతో పాటు శ్రమ, శ్రమతో పాటు చదువు ద్వారా శివకుమార్ నిజమైన విజేతగా నిలిచాడు.
 
 పేపర్‌బాయ్ నుంచి  పేపర్ సెల్లర్‌గా...


 ఐదోతరగతి నుంచి పదోతరగతి వరకు పేపర్ వేస్తూ వచ్చిన ఇతడు, ఆ తర్వాత సొంతంగా పేపర్ ఏజెన్సీ తీసుకున్నాడు. ఒక పేపర్ బాయ్ న్యూస్‌పేపర్ ఏజెంట్‌గా ఎదగడం అంటే విజయమే! అతడు చూసే ప్రపంచంలో ఉన్నతస్థాయికి ఎదగడమే. అయితే, దాన్నొక అల్పమైన సక్సెస్‌గా భావించాడు శివ. అది తన సంపాదనను కొంతమేర పెంచడానికి ఉపయోగపడుతుందే కానీ, అంతిమ విజయం మాత్రం కాదనుకున్నాడు. చదువు ద్వారానే దాన్ని సాధించవచ్చనుకున్నాడు.
 
 సన్నిహితుల సహకారం... స్కాలర్‌షిప్‌లే సాయంగా...


 మైసూర్ నుంచి బెంగుళూరు వలస వచ్చిన కుటుంబానికి చెందిన శివ ఇంజినీరింగ్ పూర్తిచేయడానికి అనేకమంది సన్నిహితులు సహకరించారు. వారికి తోడు నిమ్నవర్గాల వారికి ప్రభుత్వం ఏడాదికి 20 వేల చొప్పున ఇచ్చే స్కాలర్‌షిప్ కూడా తన చదువుకు తోడ్పాటును అందించిందని శివ చెప్పాడు. శివ తండ్రి ట్రక్ డ్రైవర్. వీరు గిరిజన వర్గానికి చెందినవారు. ‘నేను సాధించిన దానికి ఎంతమంది ఎంత అభినందిస్తున్నా, నేను వచ్చిన మూలాలను మాత్రం మరవను’ అని శివ చెబుతాడు.
 
 కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేయాలి, సివిల్స్ సాధించాలి...


 ఐఐఎమ్ సాధించగానే మీడియా... ఇంటర్వ్యూల కోసం శివ వెంట పడింది. ఆ సందర్భంలో మీడియా ద్వారా శివ కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేశాడు. ప్రైవేట్ విద్యాసంస్థలు భారీస్థాయిలో డొనేషన్లు కట్టించుకుంటున్నాయని, దీన్ని నివారించి అందరికీ విద్యను అందుబాటులో ఉంచాలని శివ సీఎం ను కోరాడు. డబ్బు లేకపోవడం వల్ల చదవలేకపోవడంలో ఉన్న బాధేంటో తనకు తెలుసని, తనలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని శివ విజ్ఞప్తి చేశాడు.


 ఐఐఎమ్ కోల్‌కతాలో ప్రవేశం పొందిన శివ ముందుగా కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు.  సివిల్స్ తన తదుపరి లక్ష్యమని శివకుమార్ చెప్పాడు. కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేస్తూ  ఐఏఎస్ హోదాలో పబ్లిక్‌సెక్టార్‌లోకి ప్రవేశించాలనే ప్రణాళికతో ఉన్నానని శివ వివరించాడు. పట్టుదలే ఆయుధంగా, శ్రమే సంకల్పంగా కలిగి ఉన్న ఇతడి ప్రణాళిక కార్యరూపం దాల్చడం చాలా సులభమే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement