న్యూఢిల్లీ: భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్‌సీలు భారత్‌లో వ్యాపారం చేశాయని, ఇక భారత్ ఎంఎన్‌సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు. భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
సృజనాత్మక ఆలోచనలతో అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కలసి కట్టుగా ముందుకు వెళ్లడమే నిర్వహణ రంగంలో ముఖ్య సూత్రమన్నారు. భారత్ తన కాళ్ల మీద తాను నిలబడడానికి అదే కావాలన్నారు. ప్రతీ విద్యార్థి తమ కెరీర్ లక్ష్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐఐఎం విద్యార్థులు కొత్త కాన్సెప్ట్‌లతో లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ వచ్చేలా కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి తోడ్పాటునందించాలన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మధ్య ఐఐఎం విద్యార్థులే వారధిగా ఉంటారని మోదీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment