
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–రోహ్‌తక్ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ఏం తేలిందంటే.. 100 కోట్ల మందికిగాపైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు.
41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం–రోహ్‌తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ చెప్పారు. మన్ కీ బాత్ 100వ ఎడిషన్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. ఎక్కువ మంది టీవీ చానళ్లలో, మొబైల్ ఫోన్లలో వీక్షించనున్నారు. కేవలం 17.6 శాతం మంది రేడియోల్లో వినబోతున్నట్లు సర్వేలో తేలింది. 22 భారతీయ భాషలు, 29 యాసలతోపాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవుతోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment