ఐఐఎం ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కడియం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్‌తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐఐఎం ఏర్పాటు వీలు పడదని, వచ్చే విద్యాసంవత్సరంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై కూడా పరిశీలిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.
దత్తాత్రేయతో కడియం భేటీ
కడియం శ్రీహరి శ్రమశక్తి భవన్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. ఐఐఎం ఏర్పాటు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, ఖాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్రంతో సంప్రదించాలని కోరారు. అందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీకి రెండు హైకోర్టులు ఉండాలని, ఆ దిశగా చర్యలు చేపడుతోందని దత్తాత్రేయ తెలిపారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలసి వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపై చర్చించారు. వారం రోజుల్లో అనుమతి ఉత్తర్వుల జారీకి హామీ ఇచ్చినట్లు కడియం తెలిపారు. ఆయన వెంట ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.