AU Campus
-
అడుగడుగునా అద్భుతమనేలా.. ‘హార్వర్డ్’ను మించేలా..
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 241.50 ఎకరాల్లో అడుగడుగునా అద్భుతమనేలా.. గ్రీన్బిల్డింగ్ రూపంలో, స్మార్ట్ భవనంగా ఐఐఎం రూపుదిద్దుకుంటోంది. క్యాంపస్ పరిధిలో 7,200 రకాల పూలు, పండ్ల మొక్కలు, వివిధ వృక్షజాతులు పెంచుతున్నారు. సౌరవిద్యుత్ వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను నియంత్రించేలా భవన నిర్మాణం సాగింది. పరిపాలన భవనం మినహా దాదాపు అన్ని బిల్డింగ్లు పూర్తి కావడంతో ఇప్పటికే తరగతుల నిర్వహణను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 100 సీట్లు అదనంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఐఐఎం ఒకటి. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 2015 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో శాశ్వత భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మొదటి దశలో నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు కేటాయించారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. విభిన్న ప్రత్యేకతల సమాహారం ► ఇప్పటికే హాస్టళ్లు, తరగతి గదులు, 4 స్టార్ కిచెన్ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. ఇది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ► 2022 ఆగస్ట్ నుంచి ఏయూ క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్‌కు తరగతులను తరలించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో భవనాల్ని అద్దెకు తీసుకుని హాస్టళ్లు నిర్వహించేవారు. వాటిని కూడా ఖాళీ చేసి.. కొత్త క్యాంపస్‌లో నిర్మించిన వసతి గృహాల్లోనే విద్యార్థులకు గదులు కేటాయించారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో గదిని పూర్తిస్థాయిలో కేటాయించడం విశేషం. హాస్టళ్లను కూడా తరలించడం వల్ల అద్దెల రూపంలో నెలకు రూ.5 లక్షల వరకూ ఆదా చేస్తున్నారు. ► ఓవైపు హరిత భవనంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంతో పాటు కర్బన ఉద్గారాల వినియోగాన్ని తగ్గించేలా క్యాంపస్ నిర్మాణం జరిగింది. ► క్యాంపస్ మొత్తానికి సౌర విద్యుత్ వినియోగించుకునేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పగలు వీలైనంత మేరకు సూర్యుని వెలుతురు వినియోగించుకుంటూ.. రాత్రి సౌరవిద్యుత్ వినియోగించేలా నిర్మాణాలు చేపట్టారు. అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చివరి దశకు చేరుకుంది. ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ► కోవిడ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్యాంపస్‌కు అదనపు హంగులు సమకూరుస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కొన్ని పరికరాలను వినియోగించడానికి చేతులతో స్విచ్‌లు నొక్కే అవసరం లేకుండా.. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► హార్వర్డ్ విశ్వవిద్యాలయం నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ‘యు’ ఆకారంలో కూర్చునేలా తరగతి గదులు నిర్మించారు. 50 మంది, 100 మంది కూర్చునేలా ఏసీ తరగతి గదులు సిద్ధం చేశారు. ► వందసీట్లతో 10 తరగతి గదులు, 50 సీట్లతో 10 తరగతి గదులు నిర్మించారు. వీటికి అదనంగా మరో 5 తరగతి గదులు కూడా నిర్మించారు. ప్రొఫెసర్లకు 117 గదులున్నాయి. ► ప్రత్యేక తరగతులు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 60 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ని పోలిన అతిథి గృహం నిర్మాణం కూడా పూర్తయింది. ► ప్రతి ప్రొఫెసర్ చెప్పే పాఠం రికార్డవుతుంది. ఇలా రికార్డు చేసిన పాఠాలను ఐఐఎం వెబ్సైట్లో విద్యార్థుల కోసం రెండువారాలు ఉంచుతున్నారు. ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ► విద్యార్థుల హాస్టళ్లలో ప్రతి గదిలో ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. ► దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఐఐఎం క్యాంపస్‌కు హరితహారంగా క్యాంపస్ భవనం చుట్టూ 7,200 రకాల చెట్లు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే కొంతమేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సీట్లు పెంచే ఆలోచన దిశగా.. ఈ విద్యా సంవత్సరం మరో 100 సీట్లు పెంచే దిశగా ఐఐఎంవీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు 300 మంది.. రెండో సంవత్సరం విద్యార్థులు 187 మంది ఉన్నారు. మొత్తం 487 సీట్లున్నాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం సీట్లను మరో 100కి పెంచి 400 అడ్మిషన్లు చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లో బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 100 సీట్లు పెంచుతూ మొత్తం 1170 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న క్యాంపస్‌గా అభివృద్ధి చేయనున్నారు. (క్లిక్ చేయండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ) ఫైవ్ స్టార్ రేటింగ్‌కు అనుగుణంగా.. గ్రీన్ బిల్డింగ్స్ రేటింగ్ సిస్టమ్ ద్వారా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకునేలా విశాఖపట్నంలో కొత్త ఐఐఎం క్యాంపస్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇతర చిన్న చిన్న పనులు మినహా దాదాపు క్యాంపస్ పూర్తయింది. ఇందుకోసం మొత్తం రూ.807.69 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 1,170 మంది విద్యార్థులకు సరిపడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 600 మందికి వీలుగా నిర్మాణాలు చేపట్టాం. 5 స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. శాశ్వత భవనంలో త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్ -
ఏయూలో అల్లూరి అధ్యయన కేంద్రం
ఏయూ క్యాంపస్: అల్లూరి సీతారామరాజుకు.. ఉమ్మడి విశాఖ జిల్లాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను ముందుకు నడిపించే విధంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర– ఆదివాసీ అధ్యయన కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సేవలందిస్తోంది. వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి సంపూర్ణ సహకారంతో న్యాయ కళాశాల ఆచార్య వి.విజయలక్ష్మి ఈ కేంద్రానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటుకు వీసీ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా అల్లూరి సీతారామరాజుపై లోతైన అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాతల సహకారం ఏయూ పాలక మండలి ఆమోదంతో ఏర్పాటైన అల్లూరి అధ్యయన కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నగరానికి చెందిన పలువురు దాతలు ముందుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె రాజు వర్సిటీ కోరిన విధంగా ఈ కేంద్రానికి సహాయం అందిస్తానని ప్రకటించారు. ఏయూ పాలక మండలి సభ్యుడు, హోబెల్ బెల్లోస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె.వి.ఎస్ ఆంజనేయవర్మ అల్లూరి సీతారామరాజు పేరుతో చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మారుతి కనస్ట్రక్షన్స్ అధినేత యు.రామకృష్ణరాజు కేంద్రం అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. దాతల సాయంతో ఏర్పాటు చేసిన అల్లూరి పాలరాతి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. (క్లిక్: ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్..) పూర్తిస్థాయిలో సేవలందిస్తాం అల్లూరి అధ్యయన కేంద్రం సేవలను విస్తరిస్తాం. విద్యార్థుల్లో అల్లూరిపై మరింత లోతైన అవగాహన కలిగించే విధంగా వక్తృత్వ, వ్యాసరచన, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించాం. గిరిజన విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. – ఆచార్య వి. విజయలక్ష్మి, సంచాలకులు, అల్లూరి అధ్యయన కేంద్రం అనుసంధానం చేస్తూ అభివృద్ధి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అరకు, పాడేరులో డిజిటల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో అల్లూరి అధ్యయన కేంద్రాన్ని అనుసంధానం చేస్తాం. తద్వారా అల్లూరి, ఆదివాసీ అంశాలపై అవగాహన, పరిశోధనలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, ఉపకులపతి -
ఏయూలో సందడిగా విదేశీ విద్యార్థుల వీడ్కోలు (ఫోటోలు)
-
‘యాత్ర’ను తిలకించిన ఏయూ ప్రొఫెసర్లు
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’సినిమాను ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తిలకించారు. ద్వారకానగర్‌లోని సంగం థియేటర్లో డాక్టర్ డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్ బి.సాంబరెడ్డి, డాక్టర్ ప్రేమానందం, డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఏయూ ఉద్యోగులు ఈ సినిమాను తిలకించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 1975 నుంచి 2003 వరకు సాధారణ నాయకుడిగా జీవించిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. పాదయాత్ర అనంతరం మహానేత అయ్యారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని కొనియాడారు. ఏయూలో ప్రస్తుతం 360 మంది ప్రొఫెసర్లు ఉన్నారని.. అందులో 240 మంది ఆయన హయాంలో నియమితులయ్యారని చెప్పారు. ఆయన వల్లే ఇప్పుడు ఏయూ ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంక్ గల యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందన్నారు. ప్రస్తుతం తామంత ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆ మహానేత పుణ్యమేనని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని, ప్రభుత్వ పాలన ప్రతి ఒక్కరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన ప్రతి అడుగు నవ శకానికి నాంది పలికిందన్నారు. ఈ విషయం నేటి తరానికి అర్థమయ్యే విధంగా ‘యాత్ర’ సినిమా అద్భుతంగా సాగిందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు లోనయ్యారన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశారని.. ఆయన చెప్పిన ‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను..ఇచ్చాక ఏముంది.. ముందుకు వెళ్లాల్సిందే’అనే డైలాగ్ చాలా బాగుందన్నారు. నేటి యువతరానికి ‘యాత్ర’ లాంటి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ మహి వి.రాఘవకు ధన్యవాదాలు తెలిపారు. -
‘జ్ఞాన’ బోరు!
సాక్షి, విశాఖపట్నం: దాదాపు పక్షం రోజుల నుంచి ఊదరగొట్టారు. ‘జ్ఞానభేరి’ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖీ ఉంటుందని మంత్రుల నుంచి అధికారుల వరకు ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను విధిగా తరలించాలని ఆయా యాజమాన్యాలకు హుకుం జారీ చేశారు. 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కానీ ఏం జరిగింది? జిల్లా నలుమూలల నుంచి తరలించినా ఈ కార్యక్రమానికి సగం మంది కూడా రాలేదు. విద్యార్థుల కోసం 24 బ్లాకులను ఏర్పాటు చేశారు. ఏవో కొన్ని బ్లాకులు తప్ప చాలా బ్లాకుల్లో అరకొరగానే నిండాయి. సదస్సు మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేదిక వద్దకు 4 గంటల వరకు రాలేదు. అప్పటిదాకా సాంస్కృతిక కార్యక్రమాలతోను, గరికపాటి నరసింహారావు ఉపన్యాసాలతోనూ నడిపించారు. విద్యార్థులు విసుగు చెందకుండా కొంతమంది ఎంపిక చేసిన విద్యార్థులతో వేదికపై నుంచి ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తేలా మాట్లాడించారు. తొలుత ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందే ముఖాముఖీ ఉంటుందని విద్యార్థులు భావించారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి 4.35 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి గంటన్నర పాటు కొనసాగించారు. ఇందులో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే వాటికంటే తాను చేపట్టిన పథకాలు, హైదరాబాద్‌కు చేసిన అభివృద్ధి, హైటెక్ సిటీ, సెల్ఫోన్లను తీసుకురావడం, రాష్ట్రంలో రోడ్లు వేయించడం, మరుగుదొడ్ల మంజూరు వంటి పొంతనలేని అంశాలకే ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు–లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై టూకీగా మాట్లాడారు. పరిశోధనలకు నిధులు ఇవ్వడం, సాంకేతిక కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారికి హామీలు గానీ ప్రకటించలేదు. జ్ఞానభేరి కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల తమకేం ఒరిగిందని విద్యార్థులు నిట్టూర్చారు. తాను మళ్లీ పుడితే ఏయూలో విద్యార్థిగా చేరే అవకాశం కల్పించాలని దేవుడిని అడుగుతానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మంది విద్యార్థులకు రుచించలేదు. అలాగే పిల్లలను అపరిమితంగా కనాలంటూ తమకు జ్ఞానభేరి వేదికపై హితబోధ చేయడమేమిటని విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగం అనంతరం ముఖాముఖి ఉంటుందనుకుని సర్దుబాటు చేసుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో అంతా నిరాశ చెందారు. పలువురు విద్యార్థులు సీఎంతో ఏఏ అంశాలు మాట్లాడాలన్న దానిపై సిద్ధమై వచ్చారు. కానీ విద్యార్థులు సంధించే ప్రశ్నలకు అందరి సమక్షంలో సరైన సమాధానం చెప్పకపోతే జ్ఞానభేరి అభాసు పాలవుతుందన్న ఉద్దేశంతో ముఖాముఖీ రద్దు చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ సదస్సుకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తామని కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో భోజనాలు పెట్టలేకపోయారు. దీంతో పలువురు ఉస్సూరుమనుకుంటూ మధ్యాహ్నానికే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆకట్టుకున్న స్టాల్స్ వేదిక వద్ద ప్రసంగాలు విద్యార్థులకు నీరసం తెప్పించాయి. ఇదాలా ఉంటే అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ మాత్రం జనాన్ని ఆకర్షించాయి. వినూత్నమైన ఆలోచనలతో విద్యార్థులు రూపొందించిన స్టాళ్లను చూసేందుకు అంతా క్యూ కట్టారు. -
టాపు లేచిపోతోంది!
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్‌హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. -
నేటి నుంచి పీజీ కోర్సుల స్పాట్ అడ్మిషన్లు
ఏయూక్యాంపస్(విశాఖతూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో మిగులు సీట్లను గురువారం నుంచి స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చని ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లు సంబంధిత కళాశాలల్లోనే జరుగుతాయని, ప్రవేశాల సంచాలకుల కార్యాలయానికి విద్యార్థులు రానవసరం లేదన్నారు. ఈ నెల 14న విశాఖపట్నం జిల్లా కళాశాలలకు, 15న విజయనగరం జిల్లాల కళాశాలలకు ర్యాటిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు కౌన్సెలింగ్‌ల్లో ఇప్పటివరకు ప్రవేశం పొందని వారికి మాత్రమే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామన్నారు. సంబంధిత డిగ్రీలో ఓసీ, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. 2017లో ఇనిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు సైతం ప్రవేశాలకు అర్హులన్నారు. ఆసెట్ రాసిన అభ్యర్థులు లేని పక్షంలో ఆసెట్ పరీక్ష రాయని వారితో భర్తీ చేయవచ్చునన్నారు. వీరు ప్రత్యేకంగా రూ. 1500 రిజిస్ట్రేషన్ చెల్లించాలి. ప్రవేశాలు పొందేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలను సంప్రదించాలని సూచించారు. 8న ఆఈట్ ప్రవేశాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగులు సీట్లను ఈ నెల 8వ తేదీన భర్తీ చేస్తామని సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఏయూ ఇఇటి పరీక్ష రాసిన 1–2315 ర్యాంకుల వారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మిగిలిన సీట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏపీ ఎంసెట్, జేఈఈ ర్యాంకులు సాధించిన వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన వారు స్క్రాచ్‌కార్డ్‌ను తీసుకురావాలని సూచించారు. కౌన్సెలింగ్ సమయంలో రుసుముగా ఎస్సీ, ఎస్టీలు రూ. 300, ఇతరులు రూ. 500, చెల్లించాలి. ప్రవేశం పొందిన వెంటనే నిర్ణీత ఫీజు రూ 1,50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళాల వివరాలను ఠీఠీఠీ.్చ uఛీ్చౌ.జీ n వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంటర్ ఎంపీసీలో 50 శాతం మార్కులు కలిగి ఆఈట్, ఏపీ ఎంసెట్, జేఈఈ(మెయిన్స్) ర్యాంక్ సాధించిన వారు దీనికి అర్హులు. ఆఈట్ పరీక్ష రాయని వారు అదనంగా రూ. 2,500 రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. నో టెస్ట్ కోర్సులకు 9న ప్రవేశాలు ప్రవేశ పరీక్ష నిర్వహించని కోర్సులకు ఈ నెల 9న ప్రవేశాలు కల్పిస్తారు. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ(బీఎస్సీ విభాగం), జాగ్రఫీ(బీఏ విభాగం), ఎంటెక్ అట్పాస్ఫియరిక్ సైన్స్, ఓషన్ సైన్స్, పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్, సమీకృత జియాలజీ కోర్సు, సమీకృత అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎంపీఈడీ కోర్సులకు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంఏ సంస్కృతం, ఎంఏ సోషల్‌వర్క్, పీజీ డిప్లమో ఇన్ కో ఆపరేషన్–రూరల్ స్టడీస్, ఎంఏ హిందీ, బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ, ఎంఏ డాన్స్, ఎంఏ మ్యూజిక్, ఎంఏ యోగా కాన్షియస్నెస్ కోర్సులలో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ప్రశేశాలకు హాజరయ్యేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి. ప్రవేశాలు పొందిన వారు వెంటనే సంబంధిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీలు రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించాలి. -
భవిష్యత్ నేతలుగా ఎదగాలి
భవిష్యత్ నేతలుగా ఎదగాలి you will be next generation leaders au campus, political science, future leaders, sarveypalli radha krishna ఏయూ క్యాంపస్, రాజనీతి శాస్త్రం, భవిష్యత్ నేతలు, సర్వేపల్లి రాధాకష్ణన్ ఏయూక్యాంపస్: విద్యార్థులు భవిష్యత్ తరం నేతలుగా ఎదగాలని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఏయూ రాజనీతి శాస్త్ర విభాగంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాల వద్ద సర్వేపల్లి రాధాకష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ సానుకూల దక్పధంతో దుకెళ్లాలన్నారు. ఈ విభాగం ఎందరో ప్రభుత్వ అధికారులను దేశానికి అందించిందన్నారు. వారి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈ దిశగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా విభాగ ప్రగతిని తెలియజేసే ఫొటోలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విభాగాధిపతి పి.ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం !
-
మహాత్మా..మహర్షీ
►చెదిరిన బాపూజీ కలలు ►గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వి.కల్యాణం ఆవేదన ►బాపూజీ చివరి క్షణాల ప్రత్యక్షసాక్షి గాంధీజీ వ్యక్తిగత సహాయకుడు వి.కల్యాణం (బాపూజీ చివరి క్షణాల ప్రత్యక్షసాక్షి) అది భారతదేశ చరిత్రలో చీకటి రోజు.. జనవరి 30, 1948.. సాయంత్రం 5 గం.17 నిమిషాలు..ఢిల్లీలోని బిర్లాహౌస్ ప్రాంగణం.. ప్రార్థనా మందిరానికి వెళ్తున్న 78 సంవత్సరాల మహాత్మాగాంధీ తుపాకీగుళ్లకు నేలకొరిగారు. నాధూరాం గాడ్సే జరిపిన ఈ కాల్పుల ఘటనతో అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో గాంధీజీ వెన్నంటే ఉన్న మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం వెంటనే ఈ వార్తను నాటి ప్రధాని నెహ్రూకు ఫోన్ ద్వారాను, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు స్వయంగా తెలియజేశారు. 1943-48 మధ్యకాలంలో మహాత్మునికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి, గాంధీజీ చివరి క్షణాల వరకూ ఆయనతో సన్నిహితంగా మెలిగిన కల్యాణం మహాత్మునితో తనకున్న అనుభవాలను-జ్ఞాపకాలను పంచుకున్నారు. జయప్రకాశ్‌నారాయణ, సి.రాజగోపాలాచారి సెక్రటరీగా కూడా కల్యాణం పని చేశారు. విశాఖపట్నం ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నయ్ నుంచి వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. గాంధీ మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శిగా నాకు ఆ మహనీయునితో ఐదేళ్ల సాన్నిహిత్యం ఉందని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వి.కల్యాణం చెప్పారు. ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నయ్ నుంచి వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే.. - ఏయూ క్యాంపస్ మహరాష్ట్రలోని వార్థా సేవాశ్రమంలో నేను చేరే నాటికి బాపూజీకి అంత సన్నిహితుణ్ణి అవుతానని అనుకోలేదు. సేవాశ్రమానికి జమ్నాలాల్ బజాజ్ ఇచ్చిన వ్యవసాయక్షేత్రంలో కూరగాయలు పండిస్తూ, అక్కడ పండిన వరి, గోధుమ ఆశ్రమ అవసరాలకు వినియోగించేవాళ్లం. సోప్స్, ఆయిల్ సొంతంగా తయారు చేసుకునే వారం. దుస్తులు కూడా మేమే రాట్నంపై తయారు చేసుకుని ధరించేవాళ్లం. ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచటంతో అద్దంలా కనిపించేంది. ఇప్పుడు స్వచ్ఛభారత్ పేరుతో ప్రధాని మోడీ ఆచరించమంటున్న పరిశుభ్రతా కార్యక్రమాన్ని నేను 80 ఏళ్ల నుంచే ఆచరిస్తున్నాను. ఇప్పటికీ రోజులో 11 నుంచి 12 గంటల వరకూ ఎవరి సహాయం లేకుండా అన్ని పనులు చేసుకుంటున్నాను. గాంధీజీకి దేశంలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చే ఉత్తరాలను ఏ భాషకాభాషగా విభజించి ఆయనకు అందులో ముఖ్యాంశాలు చేరవేయటం ఆశ్రమంలో నా పాత్ర. మహాత్ముని మార్గం పట్టదా.. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎలా అభివద్ధి చెందాలో మహాత్ముడు కన్న స్వప్నాలు చెదిరిపోయాయి. కాంగ్రెస్ స్థానంలో లోక్ సేవక్ సంఘ్ ఆవిర్భవించాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. చెడు వినవద్దు..కనవద్దు..చూడవద్దు..అన్న ప్రబోధంకాంగ్రెస్ రాజకీయ పార్టీగా అవతరించి నెహ్రూతో సహా అందరూ గాంధీ విలువలకు తిలోదకాలిచ్చారు. అవినీతిపరులైన ఎంపీలను సైతం అప్పటి పాలకులు వత్తాసు పలికారు. దేశంలో ఉన్న పల్లెలన్నీ విద్య, వైద్యపరంగా వెనుకపడ్డాయి. హార్స్‌రేడింగ్, లాటరీలు, మద్యాన్ని నిషేధించాలని గాంధీజీ పదేపదే చెప్పేవారు. అవేవీ నేటికీ ఆచరణ కాలేదు. 67 సంవత్సరాల స్వాతంత్య్ర భారతం గాంధీ ఆలోచనలు పట్టించుకోకపోవటం దురదష్టకరం. నా దృష్టిలో బ్రిటిష్ పాలనలోనే భారతదేశం చక్కగా ఉండేది. ఇప్పుడూ అడ్మినిస్ట్రేషన్‌లో అధ్వాన పరిస్థితి అదే విధంగా అపరిశుభ్రతలో మాత్రమే మనం ముందున్నాం. ఇది విచారకరవిషయం. ఆంగ్లేయుల పాలనలో ‘లా’ కచ్చితంగా అమలయ్యేది. చివరికి సైకిల్‌కు లైట్ లేకపోయినా అప్పట్లో జరిమానా వేసేవారు. ఇప్పుడంతా లంచాల మయమైపోయింది. ఎవరు తప్పు చేసినా ధనం ముసుగులో అది చెల్లిపోతుంది. 1922-47 మధ్య కాలంలో ఈవ్‌టీజింగ్, దోపిడీలు, అత్యాచారాలవంటి కేసులు అసలు కనిపించేవి కావు. అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టి దేశంలో జీవించటమే సామాన్యుడికి శాపంగా మారింది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంకెగాంధీ.ఇన్ వెబ్సైట్ కు రోజూ 3వేల క్లిక్కులు వస్తే .. అందులో 90 శాతానికి పైగా యువతవే. ఆత్మకథ, సత్యశోధన (మై ఎక్సపెర్‌మెంట్ విత్ ట్రూత్) ఇప్పటి దాకా అన్ని భాషలు కలిపి 50 లక్షలకు పైగా ప్రతులు విక్రయించారు. ఏటా రెండు లక్షల కాపీలు అమ్ముడవుతున్నాయి. అది ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథంగా యువత ఆదరిస్తోంది. నేడు మహాత్మునిపై ప్రత్యేక ప్రసంగం గురువారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న వి. కల్యాణంకు ఏయూలోని గాంధీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఏబీఎస్‌వీ రంగారావు, ఏపీ సర్వోదయ మండలి రావిప్రోలు సుబ్రహ్మణ్యం గాంధీ స్టడీ సెంటర్ నిర్వాహకులు, పలువురు గాంధీ అభిమానులు స్వాగతం పలికారు. సక్రవారం ఉదయం 8 గంటలకు ఏయూ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 9గంటలకు ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించే గాంధీ వర్థంతి సభలో ఆయన ప్రధాన ప్రసంగం చేస్తారు. విశిష్ట అతిథిగా ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజు పాల్గొంటారని ప్రొఫెసర్ రంగారావు తెలిపారు. -
క్యాంపస్‌లో కార్ల రేసింగ్‌ను అడ్డుకున్న విద్యార్థులు
-
నేటి తరం ‘ప్రకాశ’వంతం కావాలి
కష్టపడి రాజకీయాల్లో రాణించారు నెల రోజుల్లో పార్టీలోకి వచ్చి పదవులు పొందలేదు టంగుటూరి జయంత్యుత్సవంలో మంత్రి అయ్యన్న ఏయూ క్యాంపస్ : దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధపడిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు నేడు రాష్ట్రానికి, దేశానికి అవసరమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్. అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఆంధ్రకేశరి ప్రకాశం పం తులు జయంత్యుత్సవంలో ముఖ్య అతి థిగా ప్రసంగించారు. ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. మంచి వ్యక్తులు రాజకీయాలలోకి రావలసిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సైమన్ కమిషన్‌కు ఎదురొడ్డి నిలచిన ధీశాలి టంగుటూరి నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ కష్టపడి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా ప్రకాశం పంతులు నిలిచారన్నారు. జేసీ ప్రవీణ్‌కుమార్, ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తోట నగేష్, ప్రభుత్వ అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వెల్లివిరిసిన తెలుగు దనం ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. స్వచ్ఛమైన నాయకుడు టంగుటూరి సిరిపురం : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. టంగుటూరి జ యంతి సందర్భంగా ఆశీల్‌మెట్ట వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి రాజకీయ నాయకుల్లా నెలరోజులు ముం దు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించలేదని, ప్రజ ల్లోంచి కష్టపడి పైకొచ్చిన రాజకీయనేత అని కొనియాడారు. కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ జయరామిరెడ్డి, జోన్-3 కమిషనర్ వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట
నగర విద్యార్థుల హవా వరుసగా 3, 4, 5 ర్యాంకులు ఏయూ క్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్2014లో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. గురువారం సా యంత్రం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. గణితం విభాగంలో ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన వై.లక్ష్మీ అనసూయ 104 మార్కులతో తృతీయ స్థానంలో నిలి చారు. బయాలాజికల్ సెన్సైస్స్లో బుచ్చిరాజుపాలేనికి చెందిన బి.పవనకీర్తి 105 మార్కులతో నాల్గవ స్థానాన్ని, పెదబొడ్డేపల్లికి చెందిన సీహెచ్.గౌతమ్ 104 మార్కులతో ఐదవ ర్యాంక్‌ను కైవ సం చేసుకున్నారు. విశాఖ జిల్లా పరిధిలో మొ త్తం 5,791 మంది దరఖాస్తు చేయగా 4,965 మంది పరీక్షకు హాజరై 4,911 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 98.91 శాతం విద్యార్థు లు అర్హత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఫలితాల సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సిం హాచల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకం గా మెడికల్, ఇంజినీరింగ్ తరహా విద్యాసంస్థలను నిర్వహించే ఆలోచన ఉందన్నారు. టీటీడీ తరహాలో విద్యారంగాన్ని సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. ఏయూకు సెంట్రల్ హోదా కల్పనపై చర్చ జరుగుతుందని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి 11 జాతీయ విద్యా సంస్థలను మూడు ప్రాంతాలకు సమానంగా అందిస్తామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రాంతానికి, ముఖ్యంగా ఏయూ పూర్వ విద్యార్థిగా మంత్రి గంటాపై వర్సిటీ ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షత వహించారు. వీసీ మాట్లాడుతూ ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలను ఏయూ సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఎటువంటి బాధ్యతనైనా నిర్వహించడానికి తా ము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మా వెంకటరావు పరీక్ష నిర్వహణ తీరును వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు సీహెచ్.వి.రామచంద్రమూర్తి, ఆర్.సత్యరాజు, డీన్ టి.కోటేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మి, ఆచార్య జి.నాగేశ్వరరావు, వి.వల్లీకుమారి, కె.రాంజీ, రాఘవరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. చదివించి రాశానంతే... గోపాలపట్నం : చదివింది రాశానంతే... పదవర్యాంకు లోపు వస్తుందని ఆశిస్తే మూడవ ర్యాంకు వచ్చిందని బీఈడీ(మేథ్స్)లో మూడో ర్యాంకు సాధించిన వై.లక్ష్మీఅనసూయ సంతోషం వ్యక్తం చేసింది. తన తండ్రి వై.ఎల్.ఎన్.శర్మ రిటైర్డు ఉపాధ్యాయునిగా సేవలందించారని, తానూ ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకుంటున్నట్టు చెప్పింది. భవిష్యత్తులో లెక్చరర్ని కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. -
నేడే ఎంసెట్
హాజరుకానున్న విద్యార్థులు 25,355 మంది నిమిషం ఆలస్యమైనా అనుమతించరు బాల్‌పాయింట్ పెన్‌తోనే సమాధానాలు పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు నగరంలో 25,355 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నగరంలో ఇంజినీరింగ్‌కు 36 కేంద్రాల్లో 18,976 మంది, మెడిసిన్‌కు 13 కేంద్రాల్లో 6,379 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రాంతీయ సమన్వయకర్త ఆచా ర్య కె.వెంకట సుబ్బయ్య తెలిపా రు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్‌కు పరీక్ష జరగనుంది. నిరంతర పరిశీలన పరీక్షలకు నిరంతర పర్యవేక్షణ జరపనున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడు, నగరానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేస్తున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలకు అదనంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉంటారు. ప్రతి 500 విద్యార్థులకు ఒక పరిశీలకుడిని, ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందుగా అనుమతిస్తారు. దరఖాస్తులో ఎటువంటి పొరపాట్లు దొర్లినా పరీక్ష కేంద్రంలో ఉండే నామినల్ రోల్స్‌లో సరిచేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఆన్లైన్ దరఖాస్తు పత్రం కాపీని తీసుకురావాలి. పరీక్ష కేంద్రాలివే... నగరంలో ఇంజినీరింగ్‌కు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల న్యూ క్లాస్రూమ్ కాంప్లెక్స్, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ సైన్స్ కళాశాల, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం, ఏయూ సోషల్ సెన్సైస్ భవనం, ఏయూ ఆర్ట్స్ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-4( ఆర్ట్స్ అండ్ కామర్స్) డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-5 ( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-6( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-2, ఎస్ఎఫ్ఎస్ పాఠశాల, ప్రిజమ్ డిగ్రీ, పీజీ కళాశాల, బీవీకే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పైడా కళాశాల, రెడ్నం గార్డెన్స్, శ్రీగౌరి డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ మేరీస్ సెంటినరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెయింట్ జోసఫ్స్ అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బుద్ద రమేష్ బాబు డిగ్రీ, పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్, వి.వి.ఆర్. కె.ఎం.ఎల్ డిగ్రీ కళాశాల, తాటిచెట్టపాలెం, డాక్టర్ వి.ఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సమతా కళాశాల, జీవీపీ డిగ్రీ కళాశాల, ఎస్.వి.వి.పి.వి.ఎం.సి.కళాశాల, విశాఖ వేలీ పాఠశాల, ఎస్వీపీ ఇంజినీరింగ్ కళాశాల, సాంకేతిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మెడిసిన్‌కు... మెడిసిన్‌కు పైన పేర్కొన్న ఏయూలోని పది కేంద్రాలతో పాటు లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రెండు కేంద్రాలు, వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కళాశాలలో ఒక కేంద్రంలో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులూ ఇవి పాటించండి : పరీక్ష సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. విద్యార్థులు ఓఎంఆర్ పత్రంపై సమాధానాలు గుర్తించే సమయంలో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్ల్ తీసుకు రాకూడదు. ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు ఉన్నాయి. పూర్తి నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు మానసిక బలాన్ని అందించే విధంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయి. -ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, ఉపకులపతి -
చిత్ర విశాఖ
విస్తరిస్తున్న శిక్షణ తరగతులు నటన, దర్శకత్వ శాఖల్లో నిపుణత కోరుతున్న ఔత్సాహికులు ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: లఘు చిత్రాల హవా.. టీవీ సీరియల్స్ జోరు.. సినీ నిర్మాణ కేంద్రంగా విశాఖ ఎదుగుతున్న తీరు.. ఇవీ ప్రస్తుతం ఔత్సాహిక కళాకారులను ఊరిస్తున్న అంశాలు. ఇటీవల కాలంలో నగరంలో శిక్షణ తరగతులు విరివిగా జరుగుతున్నాయి. తమలో దాగివున్న కళాకారుడిని బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యాలని, సృజనాత్మకతను ప్రదర్శించాలని, వెండి తెరపై వెలిగిపోవాలని ఎందరో తపన పడుతున్నారు. ఈ కలలు నెరవేరాలంటే ఒక్క చాన్స్ కావాలి. ఇందుకోసం ఎంతో నిపుణత, పరిణతి సాధించాలి. బంగారానికి మెరుగుపెట్టినట్టు వీరి ప్రతిభకు శిక్షణ కూడా తోడైతే మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సహజసిద్ధమైన ప్రకృతి సోయగాలు, ఎత్తయిన పచ్చని కొండలు, లోయలు, అందాలొలికే అనంత సాగరం.. విశాఖ జిల్లాకు దేవుడిచ్చిన వరాలు. చూడచక్కని లొకేషన్లతో అనేక ప్రాంతాలు చిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయి. చిత్ర పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతున్న ఈ సుందర నగరంపై వర్ధమాన నటీనటుల ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో దర్శకత్వం, నటన తదితర అంశాలలో శిక్షణ అందించే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. నగరం నుంచే కాకుండా గిరిజన ప్రాంతమైన పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలవాసులు సైతం ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. కాలానుగుణంగా కోర్సులు ప్రారంభిస్తాం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డిజిటల్ ఫిల్మ్ మేకింగ్‌పై సర్టిఫికేట్ కోర్సును అందిస్తున్నాము. త్వరలో దర్శకత్వం, నటన అంశాలపై కూడా కోర్సులను ప్రారంభించే ఆలోచన ఉంది. - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఉప కులపతి ప్రొడక్షన్ రంగంలో అడుగుపెడతా.. భవిష్యత్తులో ప్రొడక్షన్ రంగంలో రాణిం చాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. అవగాహన కోసం శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. - ఎం.చేతన్ వారధిగా నిలిచే సంస్థలు కావాలి విశాఖ కేంద్రంగా నిపుణులను తీర్చిదిద్దే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సినీ అవకాశాల గురించి ఆర్టిస్టులకు, స్థానిక కళాకారుల ప్రతిభ గురించి చిత్ర పరిశ్రమకు సమాచారం అందిస్తూ వారధిగా నిలిచే సంస్థలు ఏర్పాటు కావాలి. - మీగడ శివశ్రీ, దర్శకుడు అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం.. భాగ్యనగరంలో మూడు సంవత్సరాల శిక్షణలో చెప్పే విషయాలను ఇలాంటి శిబిరాల్లో కేవలం ఐదారు రోజులలో వివరించాల్సి వస్తోం ది. దీంతో వీరికి స్థూలంగా అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం. ఇది పునాదిగా ప్రతిభను మెరుగుపరచుకోవాలి. - నటరాజమూర్తి, ప్రిన్సిపాల్, మధు ఫిలిం ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ ఈ శిబిరాల్లో పాల్గొంటున్న ఔత్సాహికులు నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి, లోతైన అధ్యయనానికి శిక్షణ సంస్థలు శాస్వత ప్రాతిపదికన ఏర్పాటైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రముఖ శిక్షకుడు సత్యానంద్ ఒక్కరే చాలాకాలంగా విశాఖలో నటులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పూర్తిస్థాయిలో శిక్షణ అందించే కేంద్రాలు నగరంలో ఏర్పడలేదు. మినీ థియేటర్ నిర్మించాలి ప్రభుత్వం తరపున లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. మినీ థియేటర్ నిర్మించి, నగరంలో చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించాలి. తద్వారా మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది. - ఆచార్య పి.బాబీవర్ధన్, ఏయూ జర్నలిజం విభాగం