యాత్ర మూవీ చూసిన అనంతరం «థియేటర్ బయట ఏయూ ప్రొఫెసర్లు డాక్టర్ రామకోటిరెడ్డి, డాక్టర్ సాంబరెడ్డి,డాక్టర్ ప్రేమానందం, డాక్టర్ నాయుడు తదితరులు
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’సినిమాను ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తిలకించారు. ద్వారకానగర్‌లోని సంగం థియేటర్‌లో డాక్టర్ డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్ బి.సాంబరెడ్డి, డాక్టర్ ప్రేమానందం, డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఏయూ ఉద్యోగులు ఈ సినిమాను తిలకించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 1975 నుంచి 2003 వరకు సాధారణ నాయకుడిగా జీవించిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. పాదయాత్ర అనంతరం మహానేత అయ్యారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని కొనియాడారు.
ఏయూలో ప్రస్తుతం 360 మంది ప్రొఫెసర్లు ఉన్నారని.. అందులో 240 మంది ఆయన హయాంలో నియమితులయ్యారని చెప్పారు. ఆయన వల్లే ఇప్పుడు ఏయూ ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంక్ గల యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందన్నారు. ప్రస్తుతం తామంత ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆ మహానేత పుణ్యమేనని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని, ప్రభుత్వ పాలన ప్రతి ఒక్కరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన ప్రతి అడుగు నవ శకానికి నాంది పలికిందన్నారు. ఈ విషయం నేటి తరానికి అర్థమయ్యే విధంగా ‘యాత్ర’ సినిమా అద్భుతంగా సాగిందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు లోనయ్యారన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశారని.. ఆయన చెప్పిన ‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను..ఇచ్చాక ఏముంది.. ముందుకు వెళ్లాల్సిందే’అనే డైలాగ్ చాలా బాగుందన్నారు. నేటి యువతరానికి ‘యాత్ర’ లాంటి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ మహి వి.రాఘవకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment