అల్లూరి అధ్యయన కేంద్రం భవనం
ఏయూ క్యాంపస్: అల్లూరి సీతారామరాజుకు.. ఉమ్మడి విశాఖ జిల్లాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను ముందుకు నడిపించే విధంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర– ఆదివాసీ అధ్యయన కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సేవలందిస్తోంది.
వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి సంపూర్ణ సహకారంతో న్యాయ కళాశాల ఆచార్య వి.విజయలక్ష్మి ఈ కేంద్రానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటుకు వీసీ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా అల్లూరి సీతారామరాజుపై లోతైన అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దాతల సహకారం
ఏయూ పాలక మండలి ఆమోదంతో ఏర్పాటైన అల్లూరి అధ్యయన కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నగరానికి చెందిన పలువురు దాతలు ముందుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె రాజు వర్సిటీ కోరిన విధంగా ఈ కేంద్రానికి సహాయం అందిస్తానని ప్రకటించారు. ఏయూ పాలక మండలి సభ్యుడు, హోబెల్ బెల్లోస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె.వి.ఎస్ ఆంజనేయవర్మ అల్లూరి సీతారామరాజు పేరుతో చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మారుతి కనస్ట్రక్షన్స్ అధినేత యు.రామకృష్ణరాజు కేంద్రం అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. దాతల సాయంతో ఏర్పాటు చేసిన అల్లూరి పాలరాతి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. (క్లిక్: ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్..)
పూర్తిస్థాయిలో సేవలందిస్తాం
అల్లూరి అధ్యయన కేంద్రం సేవలను విస్తరిస్తాం. విద్యార్థుల్లో అల్లూరిపై మరింత లోతైన అవగాహన కలిగించే విధంగా వక్తృత్వ, వ్యాసరచన, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించాం. గిరిజన విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– ఆచార్య వి. విజయలక్ష్మి, సంచాలకులు, అల్లూరి అధ్యయన కేంద్రం
అనుసంధానం చేస్తూ అభివృద్ధి
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అరకు, పాడేరులో డిజిటల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో అల్లూరి అధ్యయన కేంద్రాన్ని అనుసంధానం చేస్తాం. తద్వారా అల్లూరి, ఆదివాసీ అంశాలపై అవగాహన, పరిశోధనలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, ఉపకులపతి
Comments
Please login to add a commentAdd a comment