ఏయూక్యాంపస్(విశాఖతూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో మిగులు సీట్లను గురువారం నుంచి స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చని ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లు సంబంధిత కళాశాలల్లోనే జరుగుతాయని, ప్రవేశాల సంచాలకుల కార్యాలయానికి విద్యార్థులు రానవసరం లేదన్నారు. ఈ నెల 14న విశాఖపట్నం జిల్లా కళాశాలలకు, 15న విజయనగరం జిల్లాల కళాశాలలకు ర్యాటిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు కౌన్సెలింగ్‌ల్లో ఇప్పటివరకు ప్రవేశం పొందని వారికి మాత్రమే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామన్నారు. సంబంధిత డిగ్రీలో ఓసీ, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. 2017లో ఇనిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు సైతం ప్రవేశాలకు అర్హులన్నారు. ఆసెట్ రాసిన అభ్యర్థులు లేని పక్షంలో ఆసెట్ పరీక్ష రాయని వారితో భర్తీ చేయవచ్చునన్నారు. వీరు ప్రత్యేకంగా రూ. 1500 రిజిస్ట్రేషన్ చెల్లించాలి. ప్రవేశాలు పొందేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలను సంప్రదించాలని సూచించారు.
8న ఆఈట్ ప్రవేశాలు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగులు సీట్లను ఈ నెల 8వ తేదీన భర్తీ చేస్తామని సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఏయూ ఇఇటి పరీక్ష రాసిన 1–2315 ర్యాంకుల వారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మిగిలిన సీట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏపీ ఎంసెట్, జేఈఈ ర్యాంకులు సాధించిన వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన వారు స్క్రాచ్‌కార్డ్‌ను తీసుకురావాలని సూచించారు. కౌన్సెలింగ్ సమయంలో రుసుముగా ఎస్సీ, ఎస్టీలు రూ. 300, ఇతరులు రూ. 500, చెల్లించాలి. ప్రవేశం పొందిన వెంటనే నిర్ణీత ఫీజు రూ 1,50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళాల వివరాలను ఠీఠీఠీ.్చ uఛీ్చౌ.జీ n వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇంటర్ ఎంపీసీలో 50 శాతం మార్కులు కలిగి ఆఈట్, ఏపీ ఎంసెట్, జేఈఈ(మెయిన్స్) ర్యాంక్ సాధించిన వారు దీనికి అర్హులు. ఆఈట్ పరీక్ష రాయని వారు అదనంగా రూ. 2,500 రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
నో టెస్ట్ కోర్సులకు 9న ప్రవేశాలు
ప్రవేశ పరీక్ష నిర్వహించని కోర్సులకు ఈ నెల 9న ప్రవేశాలు కల్పిస్తారు. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ(బీఎస్సీ విభాగం), జాగ్రఫీ(బీఏ విభాగం), ఎంటెక్ అట్పాస్ఫియరిక్ సైన్స్, ఓషన్ సైన్స్, పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్, సమీకృత జియాలజీ కోర్సు, సమీకృత అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎంపీఈడీ కోర్సులకు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంఏ సంస్కృతం, ఎంఏ సోషల్‌వర్క్, పీజీ డిప్లమో ఇన్ కో ఆపరేషన్–రూరల్ స్టడీస్, ఎంఏ హిందీ, బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ, ఎంఏ డాన్స్, ఎంఏ మ్యూజిక్, ఎంఏ యోగా కాన్షియస్‌నెస్ కోర్సులలో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ప్రశేశాలకు హాజరయ్యేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి. ప్రవేశాలు పొందిన వారు వెంటనే సంబంధిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీలు రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించాలి.
నేటి నుంచి పీజీ కోర్సుల స్పాట్ అడ్మిషన్లు
Published Thu, Jul 6 2017 3:09 AM | Last Updated on Fri, May 25 2018 3:26 PM
Advertisement
Advertisement