ఆగమేఘాలపై అందాల తోట
విలాసవంతమైన ఇంటిని నిర్మించుకునే క్రమంలో కావల్సినవన్నీ కొనేయవచ్చు కాని నిండైన ఉద్యానవనాన్ని నిమిషాల మీద తేలేం కదా! సరిపడా స్థలం వదలాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని చేస్తే కాని డ్రీమ్ గార్డెన్ తయారవదు. అయితే గృహప్రవేశం వేళకే అన్నీ సిద్ధమైపోవాలంటే సాధ్యమా? ఊటీకో, కొడెకైనాల్‌కో వెళ్లొచ్చారు. ఆ పచ్చని ప్రాంతాలు తిరిగొచ్చాక లంకంత కొంప ఉన్నా లక్షణమైన తోట లేదు కదా అని బాధేసింది. ఆఘమేఘాలపై ఇంటిని గ్రీన్ బిల్డింగ్‌గా మార్చేయాలనుకున్నారు. కాని అది సాధ్యమా?
ఏ టు జెడ్... రెడీమేడ్..
‘గతంలో ఏమో కానీ ఇప్పుడది సాధ్యమే’ అంటున్నారు బంజారాహిల్స్‌లోని యూనిక్ ట్రీస్ యజమాని రామ్‌దేవ్. ఖరీదును పట్టించుకోకపోతే చాలు.. సిద్ధంగా ఉన్నాయి రెడీమేడ్ ఉద్యానవనాలు అంటున్నారాయన. ఇంపోర్టెడ్ ట్రీస్‌తో దేశంలోనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన రామ్‌దేవ్.. పూర్తిస్థాయి ఇన్‌స్టంట్ గార్డెన్స్‌ను వారంలోనే అమర్చుకోవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో 20కిపైగా భవంతులకు ఆయన ఈ తరహాలో రెడీమేడ్ పచ్చదనాన్ని అందించారు. ఇంటి ముందు పచ్చదనాన్ని ‘పార్క్’ చేయాలంటే ఒకటో రెండో మొక్కలుంటే సరిపోవుగా! ‘గచ్చు’గుద్దినట్టు ఉండే గడ్డి నుంచి గగనాన్ని తాకే వృక్షాల దాకా ఎన్నో కావాలి. ‘ఏపుగా పెరిగిన వృక్షాలు, విభిన్న రకాల గ్రాస్..ఇలా ఒక పూర్తిస్థాయి గార్డెన్‌కు వారంలోనే రూపమివ్వొచ్చు’ అన్నారు రామ్‌దేవ్. అయితే, ఇందుకోసం రూ.10 లక్షలు మొదలుకుని రూ. కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించాలి.
ఇన్‌స్టంట్...ఇన్వెస్ట్‌మెంట్ కూడా..
జూబ్లీహిల్స్‌లో ఒకాయన కొనేళ్ల క్రితం రూ.లక్ష ఖర్చుతో గార్డెన్ అమర్చుకున్నారు. అందులోని కొన్ని వృక్షాల విలువ పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు పెరిగింది. రూ.కోట్లు పలుకుతున్నాయి. ‘ఇప్పుడు వృక్షాలు కొనడం మంచి పెట్టుబడి సాధనం కూడా. ఒక ఇంటిని మనం నిర్మించుకుంటే తర్వాతి కాలంలో స్థలం తప్ప అన్నింటి విలువా తగ్గిపోతాయి. కాని మొక్కలు మాత్రమే తమ విలువను ఏ యేటికాయేడు పెంచుకుంటాయి’ అని సదరు ఇంటి యజమాని ఆనందం వ్యక్తం చేశారు. సిటీలో ఇన్‌స్టంట్ గ్రీనరీకి పెరిగిన డిమాండ్ పుణ్యమా అని వీటిని పెట్టుబడి సాధనంగా కూడా పలువురు చూస్తున్నారు.
థీమ్‌గార్డెన్‌లూ షురూ..
ఇన్‌స్టంట్ రాకతో ఇంటి గార్డెన్స్ ఏర్పాటులో బోలెడన్ని మార్పులు వచ్చేశాయి. ఒక కాన్సెప్ట్ తీసుకుని ఏర్పాటు చేసే థీమ్ గార్డెన్స్ కూడా సిద్ధమైపోయాయి. తెల్ల ఇసుక, మెరిసే రాళ్లతో వైవిధ్యంగా కనిపించే జపనీస్ గార్డెన్స్, కోకోనట్, పామ్ ట్రీస్ వంటివి విరివిగా వినియోగించే ట్రోపికల్ స్టైల్ గార్డెన్, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల నుంచి తెచ్చిన మొక్కలతో రూపొందే మెడిటేరియన్ థీమ్ గార్డెన్, రాళ్లే ఆధారంగా అల్లుకునే స్టోన్ గార్డెన్... ఇలా విభిన్న రకాలున్నాయి. వీటిలో ట్రోపికల్‌కు సిటిజనుల నుంచి ఆదరణ లభిస్తోంది.
ఇండియన్ మొక్కలూ రానున్నాయ్..
ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా, మెక్సికో, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, జపాన్, అమెరికా, ఉరుగ్వే, సౌత్ ఈస్ట్ ఏసియా దేశాలు, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ప్రస్తుతం ఎదిగిన మొక్కల్ని దిగుమతి చేసుకుంటున్న సిటిజనులకు భవిష్యత్తులో ఇండియన్ మొక్కలు సైతం ఇన్‌స్టంట్‌గా అందుబాటులోకి రానున్నాయి. ‘ఎలాంటి వాతావరణంలోనైనా పెరిగే కొన్ని ప్రత్యేకమైన వృక్షాలనే ఈ ఇన్‌స్టంట్ గార్డెన్స్‌కు వినియోగిస్తున్నారు. అయితే ఇవన్నీ విదేశీవే. ఇకపై దేశీయంగా పరిచయం ఉన్నవి కూడా అందించనున్నాం. జమ్మి, నాగమల్లి, వేప వంటి కొన్ని రకాలను పరిశీలిస్తున్నాం. అలాగే నాటిన పదేళ్లకు గాని పండు ఇవ్వని పనస వంటి చెట్లనూ రెడీమేడ్‌గా అందించాలనుకుంటున్నాం’ అని రామ్‌దేవ్ వివరించారు.