jalamandali
-
బీజేపీ కార్పొరేటర్ల ధర్నా
-
బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్.. జలమండలి సీరియస్
సాక్షి, హైదరాబాద్: బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లా కనెక్షన్లను తొలగించనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ హెచ్చరించారు. బిల్లులు చెల్లించని కమర్షియల్ కనెక్షన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. 6 నెలలు, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని, చెల్లించకపోతే కనెక్షన్లను తొలగించాలని చెప్పారు. ఈ మేరకు రెవెన్యూ వసూలు బృందాలకు తోడుగా విజిలెన్స్ విభాగాన్ని సైతం రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, సింగిల్ విండో సెల్, తదితర అంశాలపైన ఆయన అధికారులతో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా రెవెన్యూ పెంపుపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందని, ఇది సత్ఫలితాన్ని ఇచి్చందని తెలిపారు. కొన్ని మొండి బకాయిలు వసూలయ్యాయని, ఆదాయం క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు మరింతగా దృష్టి సారించాలని అన్నారు. 6 నెలల కంటే ఎక్కువ రోజులుగా బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్లు 1095 ఉన్నట్లు గుర్తించారు.ఈ కనెక్షన్ల నుంచి నుంచి రూ.8.31 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. నాన్ ఫ్రీ వాటర్ స్కీమ్ కనెక్షన్లపైనా... నాన్ ఫ్రీ వాటర్ స్కీమ్ (నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోని) పరిధిలో ఉన్న కనెక్షన్ల బకాయిలపైన కూడా దృష్టి సారించాలని, ఈ బకాయిలను సైతం వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే వీరికి 13 నెలల బిల్లులను ప్రభుత్వం రద్దు చేసిందని, ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. వీరు ఇప్పటికైనా ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి నుంచి పథకం వర్తిస్తుందని, బకాయిలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఓఆండ్ఎం డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
ఒక రూపాయి కూడా ఆశించకుండా పనిచేయాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్ ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా, సుమారు లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని అన్నారు. ప్రైవేటు రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉందని.. ప్రజలకు సేవ చేయడంలో తమదైన మార్కు చూపించాలని విజ్జప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఒకరూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించారో.. అలాగే ఒక రూపాయి తీసుకోకుండా నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జలమండలిని మరింత అభివృద్ది పథాన తీసుకెళ్లేలా కొత్త ఆలోచనలతో పనిచేయాలని సూచించారు. చదవండి: కొంగొత్త అంగడి.. నగరంలో ఇక ప్రతిరోజు మార్కెటే! -
గ్రేటర్ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది తొలి వారంలోనే హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణపైన మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల తాగు నీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితంగా అందించాలన్నారు. ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. -
అందని ద్రాక్షగా వీడీఎస్
చింతల్: అక్రమ నీటి కనెక్షన్లను సక్రమంగా చేసుకునేందుకు జలమండలి (వాలంటరీ డిస్పోజల్ స్కీమ్) ప్రవేశపెట్టిన వీడీఎస్ పథకం నెల రోజులు కావస్తున్నా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ డివిజన్ పరిధిలో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో వినియోగదారులు వాటర్ వర్క్స్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కనెక్షన్లను గతంలో సంవత్సరం పాటు నీటి బిల్లుల వేసి వీడీఎస్‌కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే కనెక్షన్లను మార్పు చేసేందుకు వీలు కల్పిస్తున్నా ఏ ఒక్క కనెక్షన్ ఇంత వరకు వీడీఎస్‌కు బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం అసలు అమలు అవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో పనికి.. ఒక్కో రేటు.. వాలంటరీ డిస్పోజల్ స్కీమ్‌తో ప్రతి రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెండు కనెక్షన్లు ఉన్న వారు సైతం వీడీఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారు. కాగా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బదలాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు తమ సిబ్బంది తెచ్చిన వాటినే స్వీకరిస్తూ మిగతా వాటిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడపనిదే ఫైల్ ముందుకు కదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో కనెక్షన్‌కు ఒక్కో రేటు చొప్పున ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫైల్ రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీడీఎస్ దరఖాస్తులు అధికారుల వద్దకు చేరినా క్రమబద్ధీకరణకు గడువు ముంచుకొస్తుండటంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. చివరి నిమిషంలో ఫైల్ నాట్ సబ్మిటెడ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారని కొంతమంది వినియోగదారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు అప్లోడ్ చేసినా నేటికీ ఆర్డర్ కాపీ/ఫీజుబులిటీ కాపీలు రావడం లేదు. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటు న్నాయి. సిబ్బందే మీడియేటర్లు.. వీడీఎస్ స్కీమ్ దరఖాస్తులను సిబ్బందే మీడియేటర్లుగా మారినట్లు సమాచారం ఒక్కో కనెక్షన్‌కు రేట్లు మాట్లాడుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బందికి ఎటువంటి పనులు లేకపోయినా ఆ పని.. ఈç పని అంటూ ఉదయం రావడంతో పైరవీలు చేయడం వారి దినచర్యగా మారినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వసూళ్ల పేరుతో ఉద్యోగం చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. కొత్త కనెక్షన్ల విషయంలోనూ వారే అధికారులకు వెన్నుదన్నుగా ఉండి నూతన భవనానికి గోతులు తీయగానే గద్దల్లా వాలిపోయి కనెక్షన్ల పైరవీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు నేరుగా కార్యాలయానికి వచ్చే వారిని మధ్యవర్తుల వద్దకు పంపుతున్నట్లు కోడై కూస్తోంది. అధికారులు ఎక్కడా నేరుగా వినియోగదారులతో సంప్రదింపులు జరుపకుండా మధ్యవర్తులనే ముందు నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా త్రిబుల్ టైమ్ బిల్లులు.. డివిజన్ పరిధిలోని వివిధ సెక్షన్లలో అధికారులు ఇష్టారాజ్యంగా ఫీజుబులిటీలు ఇచ్చినట్లు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 600 గజాలు దాటిన వాటికి బిల్డింగ్‌లకు పోర్షన్ల వారీగా నమోదు చేయాల్సి ఉండగా 100 నుంచి 200 వందల గజాలకు సైతం పోర్షన్లు యాడ్ చేశారు. రూ.650 రావాల్సిన నీటి బిల్లుకు పోర్షన్లు యాడ్ చేయడంతో రూ.3,600కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా కొన్ని భవనాలకు పోర్షన్ల వారీగా నమోదు చేయడంతో వినియోగదారులు డివిజన్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న జీఎం శ్రీధర్‌రెడ్డి వాటిని సాధారణ కనెక్షన్లుగా మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
హే‘కృష్ణా’.. పానీ పరేషానీ
సాక్షి, హైదరాబాద్: మండువేసవిలో నాగార్జున సాగర్(కృష్ణా) నీటిమట్టాలు శరవేగంగా పడిపోతుండటంతో అత్యవసర పంపింగ్ చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. మరో నెలరోజుల్లో నీటినిల్వలు 510 అడుగుల దిగువకు చేరుకున్న పక్షంలో అత్యవసర పంపింగ్ చేయక తప్పదని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో జూన్ నెలాఖరువరకు సాగర్‌లో 510 అడుగుల మేర నీటినిల్వలను నిర్వహిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పినప్పటికీ..ప్రస్తుతం మండుటెండలకు నీటిమట్టాలు శరవేగంగా పడిపోతుండటంతో అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలికి తాజాగా లేఖ రాయడంతో అధికారులు పంపింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.2.8 కోట్ల అంచనా వ్యయంతో పుట్టంగండి (సాగర్‌బ్యాక్‌వాటర్)వద్ద పది భారీ మోటార్లు, షెడ్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసే పనులు మొదలు పెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. ఈ మేరకు త్వరలో పంపింగ్ ఏర్పాట్లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం నీటి సరఫరా పరిస్థితి ఇదీ ప్రస్తుతం కృష్ణా మూడుదశల నుంచి 250 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటిదశ ద్వారా 172 ఎంజీడీలతోపాటు గండిపేట్(ఉస్మాన్‌సాగర్) నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 18 ఎంజీడీలు మొత్తంగా 465 ఎంజీడీల నీటిని నిత్యం జలమండలి నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అయితే సింగూరు సరఫరా వ్యవస్థ నుంచి నీటిసరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో గోదావరి రింగ్‌మెయిన్–3 పైపులైన్ ద్వారా సింగూరు సరఫరా వ్యవస్థ నెలకొన్న పటాన్చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను అందిస్తున్నారు. రివర్స్పంపింగ్కావడంతో ఆయా ప్రాంతాలకు తాగునీటి సమస్య తప్పడంలేదు. కాగా ప్రస్తుతం జంటజలాశయాల నీటిని వినియోగిస్తున్నప్పటికీ మరింత నీటిని తోడి పాతనగరంతోపాటు నారాయణగూడ,రెడ్‌హిల్స్ తదితర డివిజన్లకు నీటిసరఫరా పెంచే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ వేసవిలో గోదావరి జలాలకు ఎలాంటి ఇబ్బందుల్లేవని..ఎల్లంపల్లి జలాశయంలో గరిష్ట నీటిమట్టం 485 అడుగులకు ప్రస్తుతం 468 అడుగుల మేర నీటినిల్వలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
అది అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుంది
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లుల తగ్గింపు అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. గురువారం జలమండలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనం, మొహరం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రూపాయి కనెక్షన్లు 35వేలు ఇచ్చామని, కనెక్షన్లు ఇవ్వటం ప్రస్తుతం ఆపేశామని తెలిపారు. పైపులైన్ వేయడానికి జీహెచ్ఎంసీ పర్మీషన్ అపేసిందని అన్నారు. అక్టోబర్ నుంచి మళ్లీ కనెక్షన్లను ఇస్తామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న183 గ్రామాలకు జలమండలి ద్వారా నిరందిస్తామని చెప్పారు. తద్వారా జలమండలికి 128 లక్షల రూపాయలు ఆదాయం వస్తోందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల భూవివాదాలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అక్రమ నల్లా కనెక్షన్లపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే కేసులు బుక్ చేశామని తెలిపారు. కమర్షియల్ కనెక్షన్లపై దృష్టి పెట్టామని అన్నారు. 30 నుంచి 40 శాతానికి ట్యాంకర్లను తగ్గించామన్నారు. కేశవ పూర్ రిజర్వాయర్ టెండర్ పూర్తయిందని తెలిపారు. -
ఈసీ ముందస్తు కసరత్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగించేందుకు కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో బుధవారం రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం తీరిక లేకుండా కార్యక్రమాలు నిర్వహించింది. జలమండలిలో 31 జిల్లాల ఉన్నతాధికారులతో సీఈసీ అధికారులు భేటీ అయ్యారు. ఆలస్యంగా వచ్చిన కలెక్టర్లపై.. సీనియర్ డిప్యూటీ ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఐజీలు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కలెక్టర్లను సీఎస్ మందలించారు.కలెక్టర్లు రాజీవ్ హనుమంతు, దివ్య, శ్వేత మహంతి, భారతి హూలికెరి, అమేయ కుమార్‌లు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. కాగా సాయంత్రం 4.30కు సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, ఆర్థిక, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులతో సీఈసీ సభ్యులు సమావేశం కానున్నారు. అధికారులతో సమావేశాలు ముగిసిన అనంతరం సాయంత్రం సీఈసీ బృందం మీడియా సమావేశంలో పాల్గొంటుంది. -
మ్యాన్‌హోల్స్ కోసం అధునాతన వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్ : కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఉప్పల్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరు మృతి చెందారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన సోమవారం జలమండలిలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం నగరంలో 143 మినీ జెట్టింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ముందస్తు రక్షణ లేకుండా, కాంట్రాక్ట్ సంస్థ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఉప్పల్ ప్రమాదం సంభవించింది. మ్యాన్హాల్స్ కోసం దిగే ముందు విష వాయువులు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించే ఆధునిక వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేస్తున్నాం. ఏ పైపులైన్ ఎప్పుడు వేశారో గత ప్రభుత్వాల వద్ద సమాచారం లేదు. ఉన్న పైపులు తవ్వకుండా.. మరమ్మతులు చేసే విధంగా అధునాతన సాంకేతిక చర్యలు చేపడుతున్నాం. మురుగు నీరును మళ్ళీ వాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో మ్యాన్ హోల్ మూతలను ఎవరు పడితే వారు తెరవద్దు. ఏమైనా సమస్యలుంటే జీహెచ్ఎంసీకి తెలియజేస్తే వెనువెంటనే చర్యలు చేపడతారు. విలువైన మానవ ప్రాణాలు పోకుండా సాంకేతిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతాం. కార్మికుల సంక్షేమం - భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామ’ని కేటీఆర్ వెల్లడించారు. -
కదం తొక్కిన కర్షకులు
కేసీకి నీరు ఇవ్వాలని జల మండలి ముట్టడి – ప్రధాన గేటుకు తాళం వేసి ఎస్ఈ కారును అడ్డుకున్న రైతులు – కాల్వకు నీరు ఇవ్వకపోతే జల మండలి ఎదుటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిక కర్నూలు సిటీ: రైతన్నలు ప్రభుత్వంపై కన్నెర్ర జేశారు. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోతుంటే పట్టదా?అంటూ నిలదీశారు. తక్షణమే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని సోమవారం జల మండలి కార్యాలయాన్ని ముట్టడించారు. స్పందించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని అధికారులకు హెచ్చరించారు. పగిడ్యాల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈముట్టడిలో కేసీ ఆయకట్టుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ కేసీ కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలు వేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్విజయమోహన్ కెనాల్‌కు నీరు కూడా వదిలారు. దీంతో అప్పులు చేసి పంటలు సాగు చేశాం. కెనాల్ నీరు ఆయకట్టుకు కాదు..తాగు నీరుకే ఇస్తామని ఏ ఒక్క అధికారి అప్పట్లో చెప్పలేదు. కనీసం ప్రకటన కూడా జారీ చేయలేదు. పైగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మీరు పంటలు వేసుకోండి..మీ పంటలు కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఇప్పుడు 0 నుంచి 120 కి.మీ వరకు కేసీకి చుక్క నీరు రావడం లేదు. పంటలు వేసుకోమని చెప్పిన వారు నోరు మెదపడం లేదు. గట్టిగా అడిగితే సీఎం దష్టికి తీసుకుపోయాం...సమస్య పరిష్కారం చేస్తామని చెబుతున్నారే తప్ప ఆయకట్టుదారుల పక్షాన నిలవడం లేదు. ఎండుతున్న పంటలను చూసి ఆకలి కూడా కావడం లేదు. నిద్ర పట్టడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గోడు పట్టించుకోకపోతే జల మండలి ఎదుటే ఆత్మహత్యలు చేసుకుంటా’మని వాపోయారు. కేసీ వాటా నీరు అనంతకు తరలించేందుకు ఇచ్చిన జీఓను రద్దు చేసి తాత్కలికంగా తమ పంటలు కాపాడేందుకు హంద్రీనీవా కాలువ నుంచి రెండు పైపులు మళ్లించాలని డిమాండ్ చేశారు. ఎస్ఈ కారును అడ్డుకున్న రైతులు జలమండలి ఎదుట ఆందోళన చేసే సమయంలో జల వనరుల శాఖ ఎస్ఈ చంద్ర శేఖర్ రావు బయటకు వచ్చారు. గమనించిన రైతులు ప్రధాన గేటుకు తాళం వేసి ఆయన కారును అడ్డుకున్నారు. పంటలకు నీరిచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. దీంతో ఎస్ఈ మాట్లాడుతూ సాగునీటి ఇబ్బందులపై కలెక్టర్‌తో చర్చించేందుకు వెళ్లుతున్నాననిS కాల్వకు నీరు ఎప్పుడు ఇస్తామే అక్కడి నుంచి వచ్చాక చెబుతామని వెల్లడించారు. 4 ఎకరాల్లో వరికి సాగుకు నారు పెంచాను – గోవింద్, కేసీ ఆయకట్టు రైతు కేసీ కాలువకు ఈ ఏడాది నీరు వస్తుందనే ఆశతో 4 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారు మళ్లు వేశాను. నారు నాట్లు వేసే దశలో కాల్వకు నీరు బంద్ కావడంతో నారు మళ్లు ఎండుతున్నాయి. గతేడాది వచ్చిన నష్టమే ఇంత వరకు పూడ్చలేకపోయాం. మళ్లీ ఈ ఏడాది కూడా నీరు రాకుంటే తిండి గింజలు చిక్కవు. పశువులకు మేత ఎక్కడ నుంచి తీసుకరావాలో అర్థం కావడం లేదు. -
ఇక కాకి లెక్కలు చెల్లవ్!
సాక్షి,సిటీబ్యూరో: పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు దండుకుంటున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు జలమండలి సామాజిక తనిఖీలు చేయించాలని నిర్ణయించింది. మహానగరం పరిధిలో ఏటా సుమారు రూ.50 నుంచి రూ.75 కోట్ల విలువ చేసే పైప్లైన్ల లీకేజీల నివారణ, మ్యాన్‌హోళ్లు, స్టోరేజీ రిజర్వాయర్ల నిర్వహణ, మరమ్మతు పనులు జరుగుతుంటాయి. వీటిని తనిఖీ చేసేందుకు జలమండలి.. విజిలెన్స్ విభాగాన్ని త్వరలో రంగంలోకి దింపనుంది. సదరు విభాగం అధికారులు కాంట్రాక్టర్ పూర్తిచేసిన పనుల నాణ్యత, మన్నికను పరిశీలించడంతో పాటు స్థానికంగా ప్రజల నుంచి సదరు పని జరిగిన తీరు, సమస్య పరిష్కారమైందో లేదో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాకే బిల్లులు మంజూరు చేయాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. గతేడాది జరిగిన నిర్వహణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో తనిఖీలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. అంతా గోప్యమే... జలమండలి పరిధిలో రోజూ పలుప్రాంతాల్లో జరిగే కలుషిత జలాల సరఫరా నివారణ, మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లకు ఏర్పడే లీకేజీలకు మరమ్మతులు, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ, స్టోరేజీ రిజర్వాయర్లకు మరమ్మతు పనులను నిర్వహణ, మరమ్మతు పనులుగా పరిగణిస్తారు. నిర్వహణ పనుల్లో సింహభాగం భూమిలోపల జరిగేవి, రాత్రి పూట జరిగేవే ఉంటాయి. దీంతో ఎక్కడ ఏ పైప్‌లైన్‌కు ఎంతమేర మరమ్మతులు చేశారో తెలుసుకోవడం బ్రహ్మరహస్యమే. ఇక క్షేత్రస్థాయి అధికారులతో మిలాఖత్ అవుతున్న కాంట్రాక్టర్లు కొన్నిసార్లు భూమిలోపల జరిగే పైప్‌లైన్ లీకేజీల నివారణ, మ్యాన్‌హోల్ పునరుద్ధరణ వంటి పనులు చేయకుండానే బిల్లులు సమర్పించి బోర్డు ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. కాగితాలపై కాంట్రాక్టర్లు చూపే కాకిలెక్కలకు క్షేత్రస్థాయి మేనేజర్లు తమ వాటా దండుకొని బిల్లులను ధ్రువీకరిస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి చేరవేయడం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు అనివార్యమని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అక్రమాలకు చెక్ ఇలా.. నిర్వహణ పనులు చేపట్టిన ప్రతిసారి కాంట్రాక్టర్ స్థానికుల నుంచి ఈ పనులు చేసినట్టుగా విధిగా సంతకాలు తీసుకోవాలి. పనిని పూర్తి చేయకముందున్న పరిస్థితిని, పూర్తై తరవాత పరిస్థితిని క్షేత్రస్థాయి అధికారులు ఫొటోలు తీసి వాట్సప్‌లో అధికారులకు పంపాలి. నిర్వహణ, మరమ్మతు పనులు పూర్తయ్యాక విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి వాస్తవంగా పని జరిగిందీ లేనిదీ నిర్ధారిస్తారు. ఈ విషయంలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. సామాజిక తనిఖీలో సదరు పని జరగనట్టు తేలితే సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతారు. బోర్డుకు సమర్పించిన బిల్లును తిరస్కరిస్తారు. అక్రమాలు పెద్ద ఎత్తున జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. -
సీఎం సొంత శాఖలో అవినీతి
ముఖ్యమంత్రి సొంత శాఖలో అధికారుల ఇష్టారాజ్యం పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల్లో అక్రమాల జాతర తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు 11 పురపాలికల్లో నిధుల దుర్వినియోగం 47 మంది అధికారులు, ఉద్యోగుల పాత్ర కాగ్, స్టేట్ ఆడిట్ శాఖ విచారణల్లో వెల్లడి అధికారులు, అకౌంటెంట్లు కుమ్మక్కై కోట్లు స్వాహా.. కొందరిపైనే చర్యలు, కొందరికి మినహాయింపులు జలమండలిలోనూ కోట్లలో గోల్మాల్ సాక్షి, హైదరాబాద్: అవినీతిని సహించేది లేదు.. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా వదిలిపెట్టబోం.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరచుగా చెప్పే మాటలివీ! అయితే సాక్షాత్తూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలన, పట్టణాభివృద్ధి శాఖలే అవినీతి కంపు కొడుతున్నాయి!! పురపాలికలు, జల మండలిలో జలగలు తిష్టవేశాయి. ప్రజా ధనాన్ని స్వాహా చేస్తున్నాయి. ఈ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నా, స్కాంలు వెలుగు చూస్తున్నా.. సర్కారు మిన్నకుండిపోతోంది. కాగ్, స్టేట్ ఆడిట్ తనిఖీలతో పాటు శాఖాపరమైన విచారణల్లో కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు తేలినా.. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల వ్యవహార శైలి కూడా ఇటీవల చర్చనీయాంశమైంది. అక్రమాల జల మండలి హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థను పర్యవేక్షిస్తున్న జల మండలి(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) అవినీతితో మురికిమయమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై గతంలో జైలు పాలై మళ్లీ పైరవీలతో విధుల్లో చేరిన కొందరు అధికారుల గుప్పిట్లో జల మండలి చిక్కుకుంది. ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా ఈ సంస్థలో తాజాగా అక్రమాలు బయటకు పొక్కాయి. సంస్థ ఎండీ జగదీశ్వర్ వ్యవహారంపైనా ఆరోపణలు వచ్చాయి. రూ.53.98 కోట్ల అంచనాలతో కొత్త ప్రాజెక్టుల పనుల కోసం ఇటీవల జలమండలి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైంది. ఈ అంచనాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్‌రావు రంగంలో దిగి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖతో రహస్య విచారణ జరిపించారు. వాస్తవానికి రూ.37.02 కోట్ల అంచనా విలువ గల పనులకు రూ.53.98 కోట్లతో టెండర్లు పిలిచేందుకు ప్రయత్నించారని, ఏకంగా రూ.16.96 కోట్లను అదనంగా అంచనాల్లో వేశారని ఈ విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా స్పందించ లేదు. ఈ అంచనాలపై టెండర్ కమిటీలోని కొందరు అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కనపెట్టేసి.. ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించడం గమనార్హం. జల మండలి ఆధ్వర్యంలో ఏటా రూ.3 వేల కోట్లకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నా.. ఎలాంటి తనిఖీలు లేవు. కాగ్, స్టేట్ ఆడిట్ శాఖలు తనిఖీలకు వచ్చినా, రికార్డులను అందించడం లేదు. గత నాలుగేళ్లుగా అంతర్గత ఆడిట్‌ను నిలిపివేశారు. పురపాలికల్లో ‘కట్ట’ల పాములు.. పురపాలికల్లో కూడా అవినీతి పెచ్చరిల్లుతోంది. మున్సిపల్ కమిషనర్లు, అకౌంటెంట్లు, ఇతర ఉద్యోగులు కుమ్మక్కై కోట్లాది రూపాయల నిధులను కైంకర్యం చేస్తున్నారు. చివరకు ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్నులనూ సొంత జేబుల్లో వేసుకుంటున్నారు. కాగ్, స్టేట్ ఆడిట్, శాఖాపరమైన తనిఖీల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో అక్రమాలు వెలుగుచూశాయి. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీల్లో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ చర్యల వివరాలను ‘సాక్షి’ సేకరించింది. 11 మున్సిపాలిటీల పరిధిలో ఏకంగా 47 మంది అధికారులు, ఉద్యోగులు రూ.5 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలగా, ఇటీవల వారిలో 13 మందిని సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మిగిలిన వారిపై చర్యల సంగతిని పక్కనపెట్టేశారు. అవినీతికి మచ్చుకు కొన్ని.. - సూర్యాపేటలో జూనియర్ అసిస్టెంట్ జి.దయాకర్ రెడ్డి రూ.23.80లక్షలు, ఎస్సై డి.శ్రీనివాస్ రూ.19,700 స్వాహా చేయగా.. రికవరీతోపాటు వారిపై సస్పెన్షన్ విధించారు. - వనపర్తిలో జూనియర్ అసిస్టెంట్ జి.శ్రీనివాసులు రూ.94 వేల అవినీతికి పాల్పడగా రికవరీతో సరిపెట్టారు. - నల్లగొండలో ఏకంగా 19 మంది బిల్ కలెక్టర్లు రూ.3.32 కోట్ల ఆస్తి పన్నులను స్వాహా చేసినట్లు తేలినా.. ఇంకా చర్యలు తీసుకోలేదు. రికవరీలు లేవు. - సంగారెడ్డిలో గత కమిషనర్లు కేవీవీఆర్ రాజు, వీరారెడ్డి, మేనేజర్ రమేశ్, విక్రమ్‌సింహారెడ్డి, లత తదితరులు రూ.86 లక్షలను దుర్వినియోగం చేశారని కాగ్ బయటపెట్టింది. అక్రమార్కులను తప్పించేందుకు ఏకంగా కాగ్ నివేదికనే తప్పని తేల్చేశారు. నిధులను దారి మళ్లించిన ఆరోపణలపై ముగ్గురిపై కేసు పెట్టి ముగించారు. - కామారెడ్డిలో అకౌంటెంట్ కె.లత రూ.3.36 కోట్లు, అటెండర్ జి.భాస్కర్ రూ.5.93 కోట్లు స్వాహా చేయగా.. రికవరీతో సరిపెట్టారు. - గజ్వేల్‌లో బిల్ కలెక్టర్ నాగేందర్ రెడ్డి రూ.14.99 కోట్లు కాజేస్తే రికవరీతో సరిపెట్టారు. - జగిత్యాలలో ఆర్ఓ డి.రాజన్న రూ.9 లక్షల అవినీతికి పాల్పడగా.. సొమ్ము రికవరీ చేసి సస్పెన్షన్ వేటు వేశారు. - కొత్తగూడెంలో కేవీ లక్ష్మణ్ రావు, తదితరులు రూ.2 లక్షలకు పైగా దుర్వినియోగం చేయగా.. ఒకరిని సస్పెండ్ చేశారు. - జనగాంలో జూనియర్ అసిస్టెంట్ పి.విజయలక్ష్మి రూ.5.99 లక్షలు, యాకుబ్ రూ.56 వేలు, కృష్ణవాస్ రూ.5.51 లక్షలు స్వాహా చేస్తే రికవరీ, సస్పెన్షన్ విధించారు. - బెల్లంపల్లిలో ఎన్.రాజ్‌కుమార్ రూ.1.85లక్షలు స్వాహా చేస్తే రికవరీతో సరిపెట్టారు. - పాల్వంచలో శానిటరీ ఇన్స్పెక్టర్ గెలాం ముర్తుజా, టీపీబీవో శ్రీనివాసులు, బిల్ కలెక్టర్లు రాములు, సారయ్య, జ్ఞానేశ్వర్, నర్సింహారావులు రూ.3 లక్షలకు పైగా సొమ్ము కాజేయగా.. రికవరీతో సరిపెట్టారు. -
అపార్ట్మెంట్లలో మినీ ఎస్టీపీలు..!
50 ఫ్లాట్లు దాటినవి, గేటెడ్ కమ్యూనిటీలపై జలమండలి దృష్టి ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్‌లో ఏర్పాటు రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ పద్ధతులపై ఆసక్తి తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు వాడుకునే వీలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో బహుళ అంతస్తుల భవనాల్లో (అపార్ట్మెంట్స్) మురుగు శుద్ధి కేంద్రాల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్-ఎస్టీపీ) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. భూగర్భజలాలు అడుగంటి పోతుండటం, జలాశయాల నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో మురుగునీటిని మంచినీటిగా మార్చి గార్డెనింగ్, టాయిలెట్ ఫ్లష్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే విధానాలపై దృష్టి సారించింది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరం పరిధిలో 50 ఫ్లాట్లు మించి ఉన్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వద్ద స్థానికుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వాటర్‌బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాన్ని (మినీ ఎస్టీపీ) మరో మూడు నెలల్లో ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. తద్వారా మినీ ఎస్టీపీల పనితీరుపై అన్ని వర్గాలకు అవగాహన పెంపొందించవచ్చని పేర్కొన్నాయి. నగరంలో 50 ఫ్లాట్స్‌కు మించి ఉన్న అపార్ట్మెంట్లు సుమారు 12 వేల వరకు ఉన్నట్లు బోర్డు వర్గాలు గుర్తించాయన్నారు. భూగర్భజలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నెలకొన్న అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు ముందుకొస్తే ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం (రెడ్యూస్), వినియోగించిన నీటిని శుద్ధి చేయడం (రీసైకిల్), తిరిగి వినియోగించడం (రీ యూజ్) పద్ధతులను అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని మూడు ‘ఆర్’ల (3 ఆర్) విధానంగా పిలుస్తారన్నారు. రూ.కోటి ఖర్చుతో మినీ ఎస్టీపీ..! అపార్ట్మెంట్ల వద్ద రోజువారీగా రెండు మిలియన్ లీటర్ల మురుగు నీటిని, వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసే చిన్నపాటి ఎస్టీపీ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చవుతుందని అం చనా. ఈ ఎస్టీపీ వద్ద ఏరియేషన్, రివర్స్ ఆస్మోసిస్ విధానాల ద్వారా మురుగు నీటిలోని బీఓడీ, సీఓడీ, నురుగు, ఇతరత్రా కలుషిత అనుఘటకాలను తొలగించి మురుగు నీటిలో సుమారు 60 శాతం నీరు తిరిగి వినియోగించుకునేలా శుద్ధి చేస్తారు. అంటే వందలీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తే 60 లీటర్లను తిరిగి వినియోగించుకోవచ్చన్నమాట. కాగా ఈ నీరు తాగడానికి పనికి రాదు. కానీ గార్డెనింగ్, బాత్రూం ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం, ఫ్లోర్ క్లీనింగ్, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. మన నగరంలో థర్మాక్స్ వంటి కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి జలమండలి ముందు మినీ ఎస్టీపీల ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. వినియోగదారుల సహకారమే కీలకం..! ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి సాంకేతిక సహకారమే అందిస్తుంది. నిర్మాణానికయ్యే వ్యయాన్ని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వినియోగదారులే భరించాలి. ఇప్పటికే నీటి బిల్లులు, ఇంటి పన్నులు, కరెంట్ బిల్లుల మోతతో సతమతమౌతున్న వినియోగదారులు ఎస్టీపీల నిర్మాణానికి ఏమేర ముందుకొస్తారన్నది సందేహాస్పదంగా మారింది. వీటి నిర్మాణానికయ్యే వ్యయంలో జలమండలి సగం వ్యయాన్ని సమకూరిస్తే మిగతా మొత్తాన్ని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు భరించే ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్టీపీలతో ఉపయోగాలివే... ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కే రూ.1000 చెల్లించాల్సిన దుస్థితి తప్పుతుంది. భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎస్టీపీల నిర్మాణంతో నీటిఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. వాడుకునే నీటికి కొరత ఉండదు. మినీ ఎస్టీపీల్లో శుద్ధి చేయగా మిగిలిన నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భజల నిల్వలు పెంచవచ్చు. జలమండలి ట్యాంకర్ నీటి కోసం ఎదురుచూసే అవస్థలు తప్పుతాయి. గార్డెనింగ్, గ్రీన్‌బిల్డింగ్‌లు, చిన్నపార్కుల నిర్వహణకు నీటికొరత ఉండదు. పచ్చదనానికి కొదవుండదు. పెద్దపెద్ద అపార్ట్మెంట్లలో మినీ ఎస్టీపీల నిర్మాణంతో నగరంలో మురుగునీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుం ది. మూసీలోకి ప్రవహించే మురుగు ప్రవాహం తగ్గుతుంది. మూసీ ప్రక్షాళన మరింత సులువు అవుతుంది. చారిత్రక నదిని పరిరక్షించినవారవుతాం. లోతట్టు ప్రాంతాల్లో భూమి లోపల సుమారు 1500 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి డీప్ ట్యూబ్‌వెల్స్‌ను ఏర్పాటుచేసి ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వీటిల్లోకి మళ్లిస్తే భూగర్భ జలాల రీఛార్జీ సులువు అవుతుంది. మండువేసవిలో బోరుబావులు ఎండిపోయే దుస్థితి తప్పుతుంది.