
జలమండలి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఉప్పల్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరు మృతి చెందారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన సోమవారం జలమండలిలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం నగరంలో 143 మినీ జెట్టింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ముందస్తు రక్షణ లేకుండా, కాంట్రాక్ట్ సంస్థ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఉప్పల్ ప్రమాదం సంభవించింది. మ్యాన్‌హాల్స్ కోసం దిగే ముందు విష వాయువులు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించే ఆధునిక వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేస్తున్నాం. ఏ పైపులైన్ ఎప్పుడు వేశారో గత ప్రభుత్వాల వద్ద సమాచారం లేదు. ఉన్న పైపులు తవ్వకుండా.. మరమ్మతులు చేసే విధంగా అధునాతన సాంకేతిక చర్యలు చేపడుతున్నాం.
మురుగు నీరును మళ్ళీ వాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలంలో మ్యాన్ హోల్ మూతలను ఎవరు పడితే వారు తెరవద్దు. ఏమైనా సమస్యలుంటే జీహెచ్‌ఎంసీకి తెలియజేస్తే వెనువెంటనే చర్యలు చేపడతారు. విలువైన మానవ ప్రాణాలు పోకుండా సాంకేతిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతాం. కార్మికుల సంక్షేమం - భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామ’ని కేటీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment