కదం తొక్కిన కర్షకులు
కదం తొక్కిన కర్షకులు
Published Mon, Aug 29 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
కేసీకి నీరు ఇవ్వాలని జల మండలి ముట్టడి
– ప్రధాన గేటుకు తాళం వేసి ఎస్‌ఈ కారును అడ్డుకున్న రైతులు
– కాల్వకు నీరు ఇవ్వకపోతే జల మండలి ఎదుటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిక
కర్నూలు సిటీ: రైతన్నలు ప్రభుత్వంపై కన్నెర్ర జేశారు. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోతుంటే పట్టదా?అంటూ నిలదీశారు. తక్షణమే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని సోమవారం జల మండలి కార్యాలయాన్ని ముట్టడించారు. స్పందించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని అధికారులకు హెచ్చరించారు.
పగిడ్యాల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈముట్టడిలో కేసీ ఆయకట్టుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ కేసీ కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలు వేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్‌విజయమోహన్ కెనాల్‌కు నీరు కూడా వదిలారు. దీంతో అప్పులు చేసి పంటలు సాగు చేశాం. కెనాల్ నీరు ఆయకట్టుకు కాదు..తాగు నీరుకే ఇస్తామని ఏ ఒక్క అధికారి అప్పట్లో చెప్పలేదు. కనీసం ప్రకటన కూడా జారీ చేయలేదు. పైగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మీరు పంటలు వేసుకోండి..మీ పంటలు కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఇప్పుడు 0 నుంచి 120 కి.మీ వరకు కేసీకి చుక్క నీరు రావడం లేదు. పంటలు వేసుకోమని చెప్పిన వారు నోరు మెదపడం లేదు. గట్టిగా అడిగితే సీఎం దష్టికి తీసుకుపోయాం...సమస్య పరిష్కారం చేస్తామని చెబుతున్నారే తప్ప ఆయకట్టుదారుల పక్షాన నిలవడం లేదు. ఎండుతున్న పంటలను చూసి ఆకలి కూడా కావడం లేదు. నిద్ర పట్టడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గోడు పట్టించుకోకపోతే జల మండలి ఎదుటే ఆత్మహత్యలు చేసుకుంటా’మని వాపోయారు. కేసీ వాటా నీరు అనంతకు తరలించేందుకు ఇచ్చిన జీఓను రద్దు చేసి తాత్కలికంగా తమ పంటలు కాపాడేందుకు హంద్రీనీవా కాలువ నుంచి రెండు పైపులు మళ్లించాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఈ కారును అడ్డుకున్న రైతులు
జలమండలి ఎదుట ఆందోళన చేసే సమయంలో జల వనరుల శాఖ ఎస్‌ఈ చంద్ర శేఖర్ రావు బయటకు వచ్చారు. గమనించిన రైతులు ప్రధాన గేటుకు తాళం వేసి ఆయన కారును అడ్డుకున్నారు. పంటలకు నీరిచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. దీంతో ఎస్‌ఈ మాట్లాడుతూ సాగునీటి ఇబ్బందులపై కలెక్టర్‌తో చర్చించేందుకు వెళ్లుతున్నాననిS కాల్వకు నీరు ఎప్పుడు ఇస్తామే అక్కడి నుంచి వచ్చాక చెబుతామని వెల్లడించారు.
4 ఎకరాల్లో వరికి సాగుకు నారు పెంచాను – గోవింద్, కేసీ ఆయకట్టు రైతు
కేసీ కాలువకు ఈ ఏడాది నీరు వస్తుందనే ఆశతో 4 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారు మళ్లు వేశాను. నారు నాట్లు వేసే దశలో కాల్వకు నీరు బంద్ కావడంతో నారు మళ్లు ఎండుతున్నాయి. గతేడాది వచ్చిన నష్టమే ఇంత వరకు పూడ్చలేకపోయాం. మళ్లీ ఈ ఏడాది కూడా నీరు రాకుంటే తిండి గింజలు చిక్కవు. పశువులకు మేత ఎక్కడ నుంచి తీసుకరావాలో అర్థం కావడం లేదు.
Advertisement
Advertisement