kc cenal
-
చిన్నారుల కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది – లభించని ఆచూకీ కర్నూలు (రాజ్‌విహార్): కేసీ కెనాల్లో తప్పిపోయిన చిన్నారుల కోసం వివిధ శాఖల అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సప్తగిరి నగర్లో నివాసముంటున్న మోనేశాచారి, పద్మవతి దంపతుల కవల పిల్లలు ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. పన్నెండేళ్ల చిన్నారులు ప్రకాష్, మురళి మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా కేసీ కెనాల్లో ఈతకు వెళ్లి అదృశ్యం కాగా సోమవారం మధ్యాహ్నం వినాయక్ ఘాట్ వెనుక కేసీ కెనాల్ ఒడ్డున పిల్లలకు సంబంధించిన దుస్తులు కన్పించడంతో వెలుగులోకి వచ్చింది. వాటిని గుర్తించిన తల్లిదండ్రులు పిల్లలు కేసీ కెనాల్లో కొట్టుకుపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమివ్వడంతో దుస్తులను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే మంగళవారం కర్నూలు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం. భూపాల్‌రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమారెడ్డి ఆధ్వర్యంలో రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు కర్నూలు వినాయక ఘాట్ నుంచి జూపాడుబంగ్లా వరకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సిబ్బంది ఉధృతంగా ప్రవహిస్తున్న కేసీ కెనాల్లో లైఫ్ జాకెట్లు, తాళ్ల సాయంతో వెతికారు. వీరికి పోలీసు, రెవెన్యూ సిబ్బందిలోపాటు నీటి పారుదల శాఖ లస్కర్లు సహకారం అందించారు. రోజంతా గాలించినప్పటికీ చిన్నారుల ఆచూకీ లభించలేదని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కూడా గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
– మంత్రితో ఇండోర్ సబ్ స్టేషన్‌కు భూమి పూజ చేయించాలని అధికారపార్టీ నేతల యత్నం – అడ్డుకున్న కేసీ కెనాల్ అధికారులు, స్థానికులు నంద్యాల: పొన్నాపురంలో ఇళ్ల మధ్య, పంచాయతీ అనుమతి లేకుండా కేసీ కెనాల్ పాత భవనాన్ని కూల్చి ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలనే మంత్రి భూమా అఖిలప్రియ వర్గం ప్రయత్నం బెడిసికొట్టింది. మంత్రి అఖిలప్రియతో భూమిపూజ చేయించాలని ఆమె వర్గీయులు యత్నించగా సోమవారం స్థానికులు, కేసీ కెనాల్ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో మంత్రి అఖిలప్రియ నంద్యాలపై దృష్టి పెట్టి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రారంభోత్సవాలు, భూమి పూజలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బైపాస్‌రోడ్డు ప్రారంభం, నాబార్డు నిధుల కింద మంజూరైన అబాండంతాండ–పెద్దకొట్టాల–అయ్యలూరు మెట్ట వరకు నిర్మించే బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్ సోదరుడికి పొన్నాపురంలో రూ.13 కోట్లతో 33/11 కేవీ సామర్థ్యం గల ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సబ్ కాంట్రాక్ట్ దక్కింది. ఉప ఎన్నిక దృష్ట్యా ఈ నేత మంత్రి అఖిలప్రియతో భూమిపూజ చేయించాలని యత్నించి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చారు. స్థానికుల్లో వ్యతిరేకత... పొన్నాపురంలోని ప్రభుత్వ స్థలంలో లస్కర్ల కోసం కేసీ కెనాల్ అధికారులు గదులను నిర్మించారు. ఈ గదులు శిథిలావస్థకు చేరినందున గ్రామ సచివాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పంచాయతీ చేసిన తీర్మానం పెండింగ్‌లో ఉంది. అయితే, రెవెన్యూ అధికారులు దీనికి అనుమతి ఇవ్వకుండా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఇండోర్ విదు్యత్ సబ్ స్టేషన్నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. రెవెన్యూ అధికారుల మౌఖికి ఆదేశాలతో కేసీ కెనాల్ గదులను ప్రొక్లైన్‌తో కూల్చడానికి వెళ్లిన ట్రాన్స్‌కో అధికారులను కేసీ కెనాల్ అధికారులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. చివరకు కేసీ కెనాల్పాత భవన కూల్చివేత పనులు మధ్య ఆపేసి వెళ్లిపోయారు. కాగా అందరికీ అనుకూలంగా, ఎలాంటి వివాదం లేని స్థలంలో ఇండోర్ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
మహాప్రభో పంటలను కాపాడండి
- కలెక్టర్‌ను కోరిన ప్రాతకోట గ్రామస్తులు - నెలన్నర తర్వాత మీకోసం - తరలివచ్చిన బాధితులు కల్లూరు (రూరల్): ముచ్చుమర్రి ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కేసీ కెనాల్‌కు రెండు పంపుల ద్వారా సాగునీటిని అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామ పెద్దలు అంబటి శివశంకర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాములు, చిన్న కిష్టన్న, రైతులు శంకర్, పక్కీరప్ప, జలీల్ అహ్మద్, లింగారెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోఉండడంతో నెలన్నరపాటు మీకోసం కార్యక్రమం వాయిదా పడి సోమవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో సునయన ఆడిటోరియం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్, జేసీ సి హరికిరణ్, జేసీ 2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతి పత్రాలు స్వీకరించి ఆయా విభాగాలకు రెఫర్ చేశారు. వినతుల్లో కొన్ని – డోన్ మున్సిపల్ టెండర్లను ఏకపక్షంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకుడు కేశన్నగౌడుతో పాటు అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్‌కు బీసీ జన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి శేషఫణి యాదవ్ ఫిర్యాదు చేశారు. కల్లూరు మండలం ఉలిందకొండ మజరా గ్రామమైన కొల్లంపల్లి తండాలో రెండు నెలలుగా చుక్క మంచినీరు లేదని ఉన్న రెండు బోర్లలో ఒక్క బోరు పూర్తిగా ఎండిపోయిందని మరోబోరులో చుక్కనీరు రావడం లేదని, పొలాల వెంట వెళ్లి తాగునీటిని ఎత్తుకొచ్చుకుంటున్నామని జేసీ2 రామస్వామితో మొరపెట్టుకున్నారు. మద్దికెర మండలం బూర్జుల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు రామనాయక్, లక్కీ నాయక్, లక్ష్మీనాయక్, సుగాలి రెడ్డమ్మ, సుబ్బరాయుడు వినతి పత్రం అందజేశారు. గూడూరు మండలం ఆర్ ఖానాపురం గ్రామంలోని 2వేల ఎకరాల్లోని పొలాలకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను పరిష్కరించాలంటూ రైతులు శ్రీనివాసులు, పెద్ద హనుమన్న, సోలోమాన్ కలెక్టర్‌కు విన్నవించారు. మంత్రాలయం ప్రభుత్వ సర్వేయర్ రాజేశ్వరి ప్రైవేట్ సర్వేయర్లను రానివ్వడం లేదని ప్రైవేట్ సర్వేయర్లు జేసీ హరికిరిణ్కు విన్నవించడంతో హాజరు పట్టిక వివరాలను తీసుకురావాలని సమస్యను రాకుండా సమన్వయంతో పని చేయాలని జేసీ సూచించారు. -
క్రాస్ రెగ్యులేటర్ గేట్లు తెరచిన ఎమ్మెల్యే
అప్రోచ్ చానెల్లోని అడ్డుకట్ట పరిశీలన ముచ్చుమర్రి(పగిడ్యాల): ముచ్చుమర్రి వద్ద కేసీ కాలువలో ఉండే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బుధవారం నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య తెరచి దిగువకు నీటిని విడుదల చేయించారు. పంప్‌హౌస్‌లోని సీపేజీ వాటర్‌ను ఒక మోటర్ ద్వారా కేసీకి తరలిస్తున్నారు. ఈనీరు దిగువ ప్రాంతమైన పగిడ్యాల, పాములపాడు, జూపాడుబంగ్లా మండలాల వైపునకు తరలించకుండా క్రాస్ రెగ్యులేటర్ గేట్లను బంద్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం ముచ్చుమర్రికి చేరుకున్నారు. దీంతో పగిడ్యాల, బీరవోలు, ప్రాతకోట, ముచ్చుమర్రి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమ సమస్యను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. అనంతరం పంప్‌హౌస్ నుంచి నది లో లెవెల్ నీరు నిలచిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉండే అడ్డుకట్టను పరిశీలించారు. మూడు అడుగుల లోతు వరకు ఉండే బండరాళ్లను తొలగించుకుంటే పుష్కలంగా నీరు పంప్‌హౌస్‌లోకి చేరుకుంటుందని రైతులతో చర్చించారు. గడ్డపారలతో బండరాళ్లను తొలగిద్దామని చెప్పారు. దీనిపై అన్ని గ్రామాలలో దండోరా వేయిస్తామని, తమకు అండగా ఉండాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. రైతుల కోసం ఎన్ని కష్టాలైన ఎదుర్కొంటానని సీఎం, అధికారులు, టీడీపీ ఇన్చార్జిలు మోసగించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి, నాయకులు వెంకటరెడ్డి, బోయ తిరుపాలు, నరసింహులు, పి. మధు పాల్గొన్నారు. -
కడపకు నీరివ్వండి
– జిల్లా కలెక్టర్‌కు కడప కలెక్టర్ లేఖ కర్నూలు సిటీ: వైఎస్ఆర్ కడప జిల్లాకు కేసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్‌కు ఆదివారం లేఖ రాశారు. రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున అలగనూరు నుంచి కాని, వెలుగోడు రిజర్వాయర్ నుంచి కాని నీరు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. లేఖకు స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్.. నీరు ఇచ్చేందుకు సాధ్యమవుతుందో లేదో తెలియజేసేందుకు నోట్ పెట్టాలని కేసీ ఈఈ మల్లికార్జునను ఆదేశించారు. ఎస్ఈ చంద్రశేఖర్ రావుతో చర్చించిన అనంతరం.. అలగనూరు నుంచే కేసీకి నీరు ఇవ్వవచ్చని నివేదిక సమర్పిచారు. ప్రస్తుతం అలగనూరులో 2.256 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రోజుకు 400 క్యూసెక్కుల ప్రకారం ఇచ్చేందుకు సాధ్యమవుతుందని కలెక్టర్‌కు పంపిన నోట్లో పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో రెండు రోజుల్లో కడపకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్ వర్గాలు చెబుతున్నారు. తాగు నీటికి అనుమతి ఇవ్వాలని వినతి.... అలగనూరు రిజర్వాయర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, నీరు ఇచ్చి ఆదుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు ఎస్ఈ చంద్రశేఖర్ రావుకు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు పరిశీలిస్తామని ఎస్ఈ వారికి హామీ ఇచ్చారు. -
కేసీకి 41 క్యూసెక్కుల నీరు విడుదల
సుంకేసుల(గూడూరు రూరల్): సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు శనివారం 41 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి తెలిపారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కేసీ కెనాల్ ద్వారా 41 క్యూసెక్కుల నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు వదిలామనా్నరు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.235 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని ఆయన తెలిపారు. -
ఒట్టి సీమ..ముచ్చుమర్రి
- మరో కోన సీమ అంటూ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి - పంప్‌హౌస్‌లో అడుగంటిన నీటి నిల్వలు - ఒక మోటర్‌కు కూడా సరఫరా కాని వైనం - అప్రోచ్ చానెల్ మధ్యలో అడ్డుకట్ట(తండ్) - అడ్డుకట్ట తొలగిస్తేనే పంప్‌హౌస్‌లోకి సరఫరా కానున్న బ్యాక్‌వాటర్ - ఆందోళనలో కేసీ రైతులు పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో రాయలసీమ మరో కోనసీమగా మారనుందని మూడు పంటలు పండించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మరో సారి మోసం చేశారు. కోస్తాకు పట్టిసీమ అయితే రాయలసీమకు మరో పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల అంటూ నమ్మబలకడంతో రైతులు కేసీ కాలువ కింద మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగు చేసి నిలువునా నష్టపోయారు. ఒక్క పంటకు కూడా నీరివ్వలేని దుస్థితికి చేరుకున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం భవిష్యత్‌లో ఒట్టి సీమగా మారుతుందని అన్నదాత ఆవేదన చెందుతున్నారు. జనవరి 2న జాతికి అంకితమైన ఈ ప్రాజెక్ట్ రైతుల ఆశలకు గండికొట్టింది. నెల రోజులు తిరగక ముందే పంప్‌హౌస్ అడుగంటిపోయి ఒక మోటర్‌కు కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆగమేఘాలపై కేసీ కాలువకు సాగునీరు ఇవ్వాలని, రబీ పంటలను కాపాడాలని రెండు పంప్‌లను సిద్ధం చేయించినా విమర్శకుల నోళ్లలో నానాల్సి వస్తోంది. శ్రీశైలం డ్యాంలోని నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో ముఖ్యమంత్రి దిగువన ఉండే నాగార్జునసాగర్‌కు తరలించి జలదోపిడీకి పాల్పడి రాయలసీమ ప్రాంత భూములను ఎడారిగా మార్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నది లో లెవెల్ నీరు పంప్‌హౌస్‌లోకి రావాలంటే అప్రోచ్ చానెల్ మధ్యలో ఉండే అడ్డుకట్ట(తండ్)కు అడుగున్నర దిగువకు ఉన్నాయి. ఈ అడ్డుకట్టను తొలగించకపోతే బ్యాక్‌వాటర్ పంప్‌హౌస్ దరికి చేరదు. ఇప్పటికే నీటి తడులు అందక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు రేయింబవళ్లు స్లూయిస్ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. పంప్‌హౌస్ నుంచి కేసీలోకి సరఫరా చేసిన నీటిని స్థానిక క్రాస్ రెగ్యులేటర్లను బంద్ చేసి ఎగువన అల్లూరు వైపుకు మళ్లించి అక్కడి నుంచి కర్నూలు పట్టణానికి తాగునీటికి తరలించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో దిగువకు నీటిని బంద్ చేశారు. దీంతో ముచ్చుమర్రి క్రాస్రెగ్యులేటర్ల వద్ద రైతులు నీటిపారుదల శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగి ఆందోళనలు చేశారు. ఎమ్మెల్యే చొరవతోనీటి విడుదల కేసీకి నీటి విడుదల నిలిచిన ప్రతిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వై. ఐజయ్య రైతుల పక్షాన అధికారులతో పోరాడాల్సి వస్తోంది. అందులో భాగంగానే సోమవారం రైతులతో కలిసి ఎమ్మెల్యే వై. ఐజయ్య ముచ్చుమర్రికి చేరుకుని కేసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిపించారు. కృష్ణా జలాలను దిగువకు తరలిస్తున్నందున శ్రీశైలంలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయి. పంప్‌హౌస్ నుంచి సిద్ధేశ్వరం వరకు చేపట్టిన అప్రోచ్ చానెల్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయి నీటి సరఫరాకు అడ్డంకిగా తయారైంది. దీంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. గోదావరి జలాలలను పట్టిసీమ ద్వారా శ్రీశైలం డ్యాంకు మళ్లిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీశైలం డ్యాం నీటిని దిగువకు ఎందకు పంపిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లివ్వలేమని చెప్పి ఉంటే పంటలను వేసుకునే వాళ్లం కాదు: రాంబాబు, ముచ్చుమర్రి రబీ సాగుకు నీళ్లివ్వలేమని చెప్పి ఉంటే పంటలను వేసుకునే వాళ్లం కాదు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రోజున మూడు పంటలకు నీరిస్తామని, ఇప్పుడు రబీలో వేసిన పంటలు చేతికి వచ్చే వరకు నీరిస్తామని చెప్పడంతో మోసపోయాం. నీటి తడులు అందక పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేశాం. వాటిని ఎలా తీర్చాలి. కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నాం: నాగలక్ష్మమ్మ, కొత్తముచ్చుమర్రి పంప్‌హౌస్‌లో నీరు అడుగంటిపోయిందని చెబుతున్నారు. మోటార్లకు నీరందడం లేదని మరో గంటకల్లా మోటార్లు బంద్ చేస్తారని తెలిసింది. పంటలకు నీరిందక రేయింబవళ్లు కాలువల వద్ద మడువలు వేసుకోవడానికి పడిగాపులు కాస్తున్నాం. ప్రస్తుతం పైర్లు నెల రోజులకు పైగా అవుతోంది. మినుములు పూత దశలో ఉండి సట్ట పడుతున్నాయి. నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. అడ్డుకట్ట పనులను వెంటనే చేపడతాం: రెడ్డిశేఖర్‌రెడ్డి, జలవనురులశాఖ ఈఈ పంప్‌హౌస్‌లోకి బ్యాక్‌వాటర్ రావడం నిలిచిపోయాయి. అప్రోచ్ చానెల్ కాలువ మధ్యలో అడ్డుకట్ట ఉంది. ఆ పనులను వెంటనే చేపట్టి బ్యాక్‌వాటర్ పంప్‌హౌస్‌లోకి సరఫరా అయ్యేలా చూస్తాం. -
కేసీ ఆయకట్టు రైతుల ధర్నా
నంద్యాల: కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాలని బండిఆత్మకూరు మండలం ఏ.కోడూరు గ్రామానికి చెందిన రైతులు స్థానిక తెలుగుగంగ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో నంద్యాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయమోహన్, అధికారులు మార్చి నెలాఖరు వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇస్తామని ప్రకటించి తమను మోసం చేశారన్నారు. వారి మాటలు నమ్మి పంటలు సాగు చేశామని, ప్రస్తుతం కాల్వకు నీటి విడుదల నిలిచిపోయిందన్నారు. కాల్వకు నీళ్లు రాకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్‌తో మాట్లాడి రెండుమూడు రోజుల్లో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
‘నీరు’గారిన ఆశలు!
దిగువకే శ్రీశైలం నీరు - కేసీ కెనాల్‌కు నేటి నుంచి మళ్లీ నీటి సరఫరా నిలిపివేత – శ్రీశైలం నీటి విడుదలలో జిల్లాకు తీరని అన్యాయం – 48 టీఎంసీలల్లో జిల్లాకు ఇచ్చింది 3 టీఎంసీలే – రోజురోజుకు తగ్గిపోతున్న నీటి మట్టం – ఏపీ జెన్కో జల విద్యుత్ ప్లాంట్లలో విద్యుతుత్పత్తితో దిగువకు నీటి విడుదల సాక్షి ప్రతినిధి, కర్నూలు: పట్టిసీమ నీటిని రాయలసీమకు ఇస్తామంటున్న ప్రభుత్వం.. ఇందుకు భిన్నంగా కనీసం శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని కూడా కర్నూలు జిల్లాకు ఇవ్వడంలో మొండిచేయి చూపుతోంది. గడిచిన రెండు నెలల కాలంలో శ్రీశైలం నుంచి నీరు తరలిపోతున్నా జిల్లాకు మాత్రం నీటి కేటాయింపులో వివక్ష కొనసాగుతోంది. గత 60 రోజుల కాలంలో ఏకంగా 48 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలిపోయింది. అయితే, ఇందులో కర్నూలు జిల్లాకు ఇచ్చిన నీరు 3 టీఎంసీలు మాత్రమే. అంటే మిగిలిన 45 టీఎంసీల నీరు ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా డెల్టా అవసరాలకు శ్రీశైలం నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కేసీ కెనాల్‌కు మళ్లించేందుకు ఉద్దేశించిన ముచ్చుమర్రి ప్రాజెక్టును స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించి 40 రోజులకు పైబడింది. అయితే, ఇక్కడి నుంచి కేసీ కెనాల్‌కు నీటిని మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా 50వేల ఎకరాల కేసీ ఆయకట్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నీటిని విడుదల చేస్తున్నామని ప్రకటించి 48 గంటలు గడిచిందో లేదో వెంటనే నీటి విడుదలను నిలిపేశారు. మొత్తం మీద శ్రీశైలం నీటిలో జిల్లాకు దక్కాల్సిన న్యాయమైన వాటా మనకు దక్కకుండా పోతోంది. 20 అడుగులు తగ్గినా.. శ్రీశైలం రిజర్వాయర్‌లో రెండు నెలల క్రితం 862 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం నీటి మట్టం కాస్తా 842 అడుగులకు పడిపోయింది. గతంలో 862 అడుగుల నీటి మట్టం వద్ద రిజర్వాయర్‌లో 112 టీఎంసీల నీరు నిల్వ ఉండింది. అయితే, ప్రస్తుతం నీటి మట్టం 842 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న నీరు 64 టీఎంసీలు మాత్రమే. అంటే ఏకంగా 48 టీఎంసీల నీరు తగ్గిపోయింది. ఈ మొత్తం నీటిలో కర్నూలుకు ఇచ్చింది 3 టీఎంసీలు మాత్రమే. మిగిలిన నీటిని మొత్తం విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కిందకు తరలిస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరగకపోయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లు మాత్రం రాత్రిపగలు ఎడతెరపి లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. తద్వారా శ్రీశైలం నీరు కిందకు తరలిపోతోంది. పట్టిసీమ నీళ్లు రాయలసీమకు మళ్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇందుకు భిన్నంగా శ్రీశైలంలోని నీటినే కింది డెల్టా అవసరాలకు మళ్లిస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది. మొదటి నుంచీ ఇదే తీరు వాస్తవానికి హంద్రీనీవా కాలువల ద్వారా కేసీ కెనాల్‌తో పాటు గాజులదిన్నె ప్రాజెక్టుకు కూడా నీళ్లు సరఫరా చేసే అవకాశం ఉండింది. అంతేకాకుండా పందికోన ప్రాజెక్టును కూడా నింపే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఇవేవీ చేయలేదు. ఫలితంగా కేసీ కెనాల్ కింద ఉన్న 50వేల ఎకరాల ఆయకట్టుతో పాటు గాజులదిన్నె కింద ఉన్న 7వేల ఎకరాల ఆయకట్టుకు కూడా ప్రస్తుతం నీరు అందని పరిస్థితి. ఇప్పటికే పంట వేసుకున్న రైతులకు రెండు తడుల నీరు అందింది. మరో రెండు తడుల నీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీరు రోజురోజుకు తగ్గిపోతోంది. మరో పది రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గిపోయి.. హంద్రీనీవా ద్వారా నీటిని మళ్లించే అవకాశం లేకుండా పోనుంది. ఇదే జరిగితే పంటలు వేసుకున్న రైతులకు తిప్పలు తప్పేలా లేవు. తమకు నీరు విడుదల చేయాలంటూ గాజులదిన్నె ప్రాజెక్టు ఆయకట్టు రైతులు జల మండలిని శుక్రవారం ముట్టడించారు. అయితే, తామేమీ చేయలేమని.. కలెక్టర్ నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడు నీరు వస్తుందో తెలియక.. కేసీ, గాజులదిన్నె ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా మారింది. -
ప్రాణం తీసిన సరదా
కేసీ కెనాల్లో ఈతకు వెళ్లి యువకుడి మృతి నందికొట్కూరు: సరదాగా స్నేహితులతో కలిసి ఈత కెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం నాగటూరు గ్రామం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని లింగం వీధికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మౌలాలి కుమారుడు మౌలిబాషా(22) అదేవీధికి చెందిన అమ్మాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే శనివారం రాత్రి నాగటూరు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆదివారం ఉదయం నలుగురు స్నేహితులతో కలిసి కేసీ కెనాల్‌కు సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, ఈతకొడుతూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలాడు. తోటి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడి మృత దేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల
జూపాడుబంగ్లా: కర్నూలు–కడప కాల్వకు 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగు చేసిన పంటలకు మరో తడి నీరు అందితేనే పండుతాయని రైతుల విజ్ఞప్తి మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణాబోర్డు కేసీకి 3 టీఎంసీల నీటి విడుదలకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నీరు వచ్చే వరకు తొందరపడి వరినాట్లు వేసుకోవద్దని మెట్టపంటలను మాత్రమే సాగు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. -
హామీలతో ముంచారు!
– సాగునీటి కాల్వలకు నీరు బంద్ చేసిన ఇంజినీర్లు – రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ నేతల హామీలు – దీంతో పంటలు సాగు చేసిన రైతులు – మల్యాల, ముచ్చుమర్రి నుంచి కేసీకి నీరు బంద్ – నీటి కోసం కార్యాలయల చుట్టూ తిరుగుతున్న ఆయకట్టుదారులు ‘శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉంది. ఒక పంటకే కాదు రెండు పంటలకు సాగునీరు ఇస్తాం. శ్రీశైలం నీటిని ముచ్చుమర్రి, మాల్యాల ఎత్తిపోతల పథ«కం ద్వారా కర్నూలు–కడప కాలువకు అందిస్తాం’ అంటూ సీఎం చంద్రబాబునాయుడు నుంచి కిందిస్థాయి టీడీపీ నేత వరకూ హామీలిచ్చారు. దీంతో అన్నదాతలు రబీలో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అయితే పంట కాల్వలకు నీటి విడుదల ఆగిపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు సిటీ : సాగునీటి కాల్వలకు నీరు బంద్ చేయడంతో ఆయకట్టుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం రెండు తడులకు అయినా నీరు ఇవ్వాలని జలమండలి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నీటి విడుదల విషయంలో తాము ఏ నిర్ణయం తీసుకోలేమని, నీరు ఇస్తామని తాము చెప్పలేదని ఎవరైతై హామీ ఇచ్చారో వారి దగ్గరకే వెళ్లాలని ఇంజినీర్లు చెబుతుండడంతో ఆయకట్టుదారులు ఎక్కడికెళ్లాలో తెలియక సతమతమవతున్నారు. ఈ విషయంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ దృష్టికి తీసుకపోయినా ప్రయోజనం లేకపోవడంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాగా హెచ్ఎన్ఎస్ఎస్ నీటి కోసం ప్రతిపాదనలు కోరిన సమయంలో ఇంజినీర్లు తమ జిల్లాకు అవసరం లేదనే «నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంతోనే నేడు ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు ఉన్నాయి. కృష్ణా జలాలు బంద్ శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాలను హంద్రీనీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాకు అందిస్తున్నారు. మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంపుల ద్వారా, సీఎం ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కేసీకి మళ్లించేందుకు చేపట్టిన పథకాల నుంచి కూడా వారం క్రితం నుంచి కృష్ణా జలాలను బంద్ చేశారు. దీంతో కేసీ కాలువ 120 కిమీ వరకు సాగు చేసిన 20 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రశ్నార్థంగా మారింది. అలాగే తెలుగుగంగ కాలువకు నీటిని బంద్ చేయడంతో అక్కడక్కడ వేసిన ఆరుతడి పంటలకు సాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నీటి క్రమబద్దీకరణ ప్రభుత్వం చేతుల్లోకి.. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నీటి క్రమబద్ధీకరణ ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షక ఇంజినీర్లు ప్రభుత్వ అనుమతి తీసుకుని చేసేవారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి ప్రాజెక్టులు, కాల్వలకు నీటిని విడుదల చేసే అధికారాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. కేసీకి నీరు ఇవ్వాలని కోరినా పెద్దలు, అధికారుల చుట్టూ ఆయకట్టుదారులు తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారులెవరూ చెప్పలేదు శ్రీశైలంలో నీరున్నా కూడా ఆయకట్టుకు మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా రబీకి నీరు ఇస్తామని చెప్పలేదు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలకు మాకెలాంటి సంబంధం లేదు. అవసరమయిన సమయంలో తాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్ఈ -
కేసీ సబ్ ఛానల్ గండి పూడ్చివేత
నంద్యాలరూరల్: మండల పరిధిలోని కానాల గ్రామం వద్ద పొన్నాపురం కేసీ కెనాల్ సబ్‌చానెల్‌కు ఆదివారం తెల్లవారుజామున పడిన గండిని మంగళవారం నాటికి పూడ్చివేశారు. నీటి ప్రవాహం సబ్ చానెల్లో పెరగడం, కాల్వ గట్లు బలహీనంగా ఉండటంతో మిట్నాల బ్రిడ్జి 11కి.మీ. వద్ద కేసీ సబ్ చానెల్‌కు గండి పడింది. దీంతో సుమారు 157ఎకరాల ఆవాల పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందుకు స్పందించిన కేసీ కెనాల్ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే నంద్యాల కేసీ కెనాల్ ఏఈ చంద్రుడిని అప్రమత్తం చేశారు. దీంతో మంగళవారం కాల్వకు పడిన గండిని పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఏఈ చంద్రుడు మాట్లాడుతూ ఆదివారం తెల్లవారుజామున కేసీ సబ్‌చానెల్‌కు గండి పడటంతో నీరు పంట పొలాలను పట్టుకుందన్నారు. రైతుల సమాచారం మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేయడంతో సోమ, మంగళవారాల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు, లస్కర్లు శ్రమించి ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్ల ద్వారా మట్టి, ఇసుక, సిమెంట్, రాళ్లు వేసి గండి పూడ్చివేశామని తెలిపారు. వర్క్ ఇన్స్పెక్టర్ నూర్‌బాషా లస్కర్లు రాజు, ఉమామహేశ్వరరెడ్డి, మద్దిలేటి, రాజమల్లయ్య గండి పూడ్చివేత పనుల్లో పాల్గొన్నారని తెలిపారు. -
కేసీకెనాల్ సబ్ చానల్‌కు గండి
– 157 ఎకరాల పంట నష్టం – అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న రైతులు కానాల(నంద్యాలరూరల్): మండల పరిధిలోని కానాల గ్రామ సమీపంలోని మిట్నాల మోరి పొన్నాపురం సబ్ చానెల్ 11వ కి.మీ వద్ద ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. సబ్‌చానెల్‌కు గండి పడటంతో సమీపంలోని మద్దెల చిన్న చెన్నప్ప, పెద్దచెన్నప్ప, గజ్జెల చిన్న హుసేని, గుర్రప్ప, బంక వెంకటరామిరెడ్డి, కిరణ్, నెరవాటి బాబు, డీసీ హుసేన్, కల్లూరు మాబువలి, అసన్, హుసేన్, తదితరులకు చెందిన సుమారు 157 ఎకరాల ఆవాలు, జొన్న, కంది పంటలు నీటి మునిగాయి. నీటి ప్రవాహ ఉద్ధృతికి కొని్నచోట్ల భూమి కోతకు గురైంది. రబీ పంటకు సాగునీరు అందదు.. ఆరుతడి పంటలు వేసుకోండి అని కేసీకెనాల్ అధికారులు చెప్పారు. వారు చెప్పినట్టు తాము ఆరుతడి పంటలు వేసుకున్నామని, మరి ఉన్నట్టుండి సబ్‌చానెల్‌కు ఎక్కువ నీరు ఎందుకు వదిలారని రైతులు, అధికారులను నిలదీస్తున్నారు. అనధికారికంగీఆ కుందూనదికి నీటి ప్రవాహం పెంచి నెల్లూరుకు నీరు అందించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. కేసీ కాల్వ గట్లు బలహీనంగా ఉన్నాయని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వాపోయారు. ప్రస్తుతం కాలువ గట్లు తెగి పంటకు భారీ నష్టం జరిగిందని, తమకు పరిహారం చెల్లించాలని కానాల రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే సబ్‌చానల్‌కు నీటి విడుదలను ఆపేసి తాత్కాలికంగా గండిని పూడ్చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేసీ కెనాల్ ఏఈ చంద్రుడు వెల్లడించారు. -
అంతా బూటకమే!
– సీఎం ముచ్చుమర్రిని ప్రారంభించిన మరుసటి రోజే కేసీకి నీరు బంద్ – ముచ్చుమర్రి, మల్యాల నుంచి నీటి విడుదల నిలిపేసిన ఇంజినీర్లు – ప్రతిపక్ష నేత రాకతో మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ముచ్చుమర్రి నుంచి నీటి విడుదల – కరెంటు బిల్లుల చెల్లింపుల్లో కొరవడిన సమన్వయం – ఏ సర్కిల్ నుంచి బిల్లులు చెల్లించాలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని ప్రభుత్వం కర్నూలు (సిటీ): రాయలసీమకు ముచ్చుమర్రి ఆయువుపట్టు లాంటిదని, ఈ స్కీముతో సీమను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ ఈనెల 2న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఆయన పథకాన్ని ప్రారంభించి 24 గంటలు కూడా గడవక ముందే నీటి విడుదల నిలిచిపోయింది. బాబు చెప్పేదంతా బూటకమని కేసీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు – కడప (కేసీ)కాల్వకు సాగునీరు ఇచ్చేందుకు పగిడ్యాల మండలం, ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. పనులు పూర్తికాకపోయినా కూడా నీటిని ఎత్తిపోసేందుకు మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సీజన్ మొత్తం రెండు మోటార్ల ద్వారా నీరు విడుదల చేసి పంటలు ఎండకుండా చూస్తామని సీఎం ప్రకటించారు. అయన హామీచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కేసీకి 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. ఈ స్కీమ్ ద్వారా కేసీకి 500 క్యూసెక్కులు, హంద్రీనీవా మొదటి లిఫ్ట్ మల్యాల దగ్గర నుంచి కేసీకి రెండు పంపుల ద్వారా మళ్లించిన నీటిని సైతం బంద్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ నేతలు నోరు మెదపక పోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత రాకతో... రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కేసీకి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీరు బంద్ చేశారని గుర్తు చేయడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో దడ పుట్టింది. వెంటనే ముచ్చుమర్రి స్కీము నుంచి గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు మోటార్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. మోటార్లు బంద్ చేసిన విషయాన్ని ప్రతిపక్ష నేత ఎత్తి చూపే వరకు జిల్లా అధికార పార్టీ నేతలు టీడీపీ పెద్దలను ఎదిరించలేక గమ్మున ఉండటంపై రైతులు భగ్గుమంటున్నారు. బాబూ.. ముందుచూపు ఏదీ? రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరిలో తనకున్నంత ముందుచూపు ఏ నేతకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు లేదని పదే పదే గొప్పగా చెబుతుంటారు. ఏ ప్రాజెక్టుకు, ఏ సర్కిల్‌కు అప్పగించాలి, దానిని ఎవరు నిర్వహించాలి అనే విషయంపై ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో కేసీ ఆయకట్టుకు ఒక వైపు మల్యాల నుంచి, మరోవైపు ముచ్చుమర్రి నుంచి నీటి విడుదల బంద్ అయింది. ఈ రెండు స్కీములకు రోజుకు సుమారు రూ.21 లక్షలు కరెంటు బిల్లు వస్తుండటం, ఆ బిల్లు ఏ సర్కిల్ చెల్లించాలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే కాల్వకు నీరు బంద్ చేసినట్లు కొందరు ఇంజినీర్లు చెబుతున్నారు. -
నీటి ఇక్కట్లకు చంద్రబాబే కారణం
- ముచ్చుమర్రి పేరుతో జనాన్ని మభ్యపెడుతున్నారు - విలేకరుల సమావేశంలో బైరెడ్డి కర్నూలు సిటీ: కర్నూలు- కడప కాలువ పరిధిలో సాగునీటి కష్టాలకు సీఎం చంద్రబాబే కారణమని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. దీనివల్ల తుంగభద్ర డ్యాంకు నీటి సరఫరా తగ్గిపోయి కేసీ ఆయకట్టుకు ఇక్కట్లు మొదలయ్యాయన్నారు. పట్టిసీమను నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సీఎం చుక్కనీరు ఇవ్వకపోగా ప్రస్తుతం ముచ్చుమర్రి ఎత్తిపోతలను తెరపైకి తెచ్చి సీమ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీకి 39.9 టీఎంసీల నికర జలాల వాటాను వదులుకునే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. 35 వేల ఎకరాల కోసం ఏర్పాటు చేసిన పథకంతో రాయల సీమనే సస్యశ్యామలం చేస్తామని చెప్పడం దురదృష్టకరమన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే 69జీఓను రద్దు చేసి, శ్రీశైలంలో 854 అడుగుల కనీన నీటి మట్టాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయల సీమకు కృష్ణా జలాలు, కోస్తాంద్రకు గోదావరి జలాలను ఇవ్వాలని, కృష్ణ పుష్కరాలను ముచ్చుమర్రిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టని సీఎం, కలెక్టర్‌కు ముచ్చుమర్రిలో పర్యటించే అర్హతనే లేదన్నారు. -
జనవరి 2న సీఎం రాక
కర్నూలు సిటీ: కేసీ కాలువకు కృష్ణా జలాలను మళ్లించేందుకు నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసేందుకు జనవరి 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. కేసీకి తుంగభద్ర జలాలు సక్రమంగా రాకపోవడంతో ఏటా సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు పూర్తయింది. ఇటీవల రెండు మోటార్లు ఏర్పాటు చేసి ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పథకాన్ని జాతికి అంకితం చేసేందుకు సీఎం జిల్లాకు రానున్నట్లు జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. -
అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదల
మిడుతూరు: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ రామ్మూర్తి తెలిపారు. బుధవారం అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీ కెనాల్ లాకెన్స్లో నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ 2.965 సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2.41 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈ సెల్వరాజ్ పాల్గొన్నారు. -
ముచ్చుమర్రి నుంచి రబీకి నీరు
నందికొట్కూరు: కేసీ కెనాల్‌కు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పైపుల ద్వారా రబీకి సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15వ తేదీలోపు ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు మూడు పంపుల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. భూ సమస్యలు ఉన్నా రైతులతో చర్చించి పరిష్కరించామన్నరు. డిసెంబర్ లోపు విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కేసీకి అందించేందుకు రెండు పైపులైన్ల పనులు పూర్తి చేసి ట్రై యిల్రన్ చేసినట్లు తెలిపారు. మరో రెండు పైపులైన్ల పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చాయని.. 20 రోజులలోపు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. సిద్ధాపురం, గురురాఘవేంద్ర, పులికనుమ పనులు డిసెంబర్‌లోపు పూర్తి చేసి రబీకి సాగునీరు ఇవ్వనునట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల
జూపాడుబంగ్లా: సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సుంకేసుల జలాశయంలోకి 2,800క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోందన్నారు. అందులో 2,600క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కాల్వకు సరఫరా అయ్యే నీటిలో అలగనూరు రిజర్వాయర్‌కు 900, నిప్పులవాగుకు 700, తూడిచెర్ల సబ్‌చానల్‌కు 200క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేSసీ కాల్వకు కేటాయించిన 3టీఎంసీల నీటిలో ఇప్పటిదాకా3000 క్యూసెక్కులు మాత్రమే వాడుకున్నట్లు ఆయన తెలిపారు. -
కేసీ ఆయకట్టుకు నీటి కొరత లేదు
కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టుకు నీటి కొరత రానివ్వబోమని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున తెలిపారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కర్నూలు–కడప జిల్లాల్లో మొత్తం కేసీ ఆయకట్టు 2.65లక్షల ఎకరాలు ఉండగా.. 2.05లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారన్నారు. తుంగభద్ర డ్యాం కేసీకి నీటివాటా రావడం లేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇప్పటికే కేసీ కెనాల్‌కు 8 టీఎంసీల నీటిని విడుదలకు చర్యలు చేపట్టామన్నారు. రబీలో ఆయకట్టు రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారుల సమన్వయంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. -
మితిమీరిన జల దోపిడీ
– ఎగువ రాష్ట్రాల తీరుపై రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఆరోపణ – నియంత్రనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ నంద్యాలరూరల్: తుంగభద్ర నదిపై కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జలదోపిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల మాజీ ఎంపీ బొజ్జా వెంకటరెడ్డి స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సంఘాల ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదిపై కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసీ కెనాల్‌కు రావాల్సిన నీరు కూడా తుంగభద్ర నుంచి రాలేదని, ఈ కారణంగా ఆయకట్టులో సాగైన ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల దగ్గర మరో ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటికీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈయన తీరువల్లే ఎగువ రాష్ట్రాలు మరింత రెచ్చిపోతున్నాయన్నారు. తక్షణమే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరిపి అక్రమంగా చేపడుతున్న ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి జనవరి నెలాఖరునాటికి కేసీ కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలన్నారు. శ్రీశైలం జలాశయంలోని 854అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. శంకుస్థాపన దశలో ఉండిపోయిన రాజోళి బండ, జోళదరాశి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కుందూ పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్‌రెడ్డి, సిద్ధేశ్వరం జలసాధన సమితి కన్వీనర్ వైఎన్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విరుద్ధ ప్రకటనలతో అయోమయం
నంద్యాలరూరల్: జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు.. విరుద్ధ ప్రకటనలు చేస్తూ కేసీ కెనాల్ ఆయకట్టు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, సకాలంలో నీరు వచ్చే అవకాశం లేదు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, కేసీ కెనాల్ అధికారులు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎం చేయాలో అర్థం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశమై నెల రోజులు కావస్తున్నా నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పది టీఎంసీలను విడతల వారిగా విడదల చేసి ఆయకట్టు రైతులను కాపాడాలన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854అడుగులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిద్దేశ్వరం అలుగు సాధన కన్వీనర్ వైఎన్‌రెడ్డి, కుందూ పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జల సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీ కింద వరి సాగు వద్దు
నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టు రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని కేసీ కెనాల్ సబ్ డివిజనల్ అధికారి ఎంజే రాజశేఖర్ కోరారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ డీఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదికి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదని, దీంతో సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేయడం కష్ట సాధ్యమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుంగభద్ర బోర్డు ద్వారా మూడు టీఎంసీల నీరు కేసీకి విడుదల చేస్తామని, ఆ నీరు తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసులకు చేరుకునేందుకు రెండు రోజులు పడుతుందన్నారు. అక్కడి నుండి కేసీ కెనాల్‌కు వచ్చేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. -
కేసీ ఆయకట్టు పంటలను కాపాడండి
– ముచ్చమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయాలి – కలెక్టర్‌ను కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే – సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ రైతు విభాగం ప్రతినిధులు, రైతులతో వచ్చి కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిశారు. కేసి కెనాల్‌కు నీటి విడుదలపై చర్చించారు. కేసీ కెనాల్ కింద 75 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, నీరివ్వకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 2016 జూలై 30 నాటికే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే పనులు ఇప్పటికి పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు ఇచ్చిన 2.5 టీఎంసీల నీరుSనెలకు కూడా సరిపోదన్నారు. గత ఏడాది కూడా నీరు విడుదల చేయకపోవడంతో పూర్తిగా నష్టపోయామని, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా చూడాలన్నారు. దీనిపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ...15 రోజుల్లో మల్యాల లిప్ట్ నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రెండు పైపులు మంజూరు చేస్తామని, వాటిని 15రోజుల్లోగా అమర్చి నీటిని విడుదల చేస్తామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిచడం పట్ల ఎమ్మెల్యే సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.