ముచ్చుమర్రి, మల్యాల నుంచి కేసీకి నీరు బంద్ చేయడంతో ఎండిన కాలువ
హామీలతో ముంచారు!
Published Wed, Jan 18 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
– సాగునీటి కాల్వలకు నీరు బంద్ చేసిన ఇంజినీర్లు
– రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ నేతల హామీలు
– దీంతో పంటలు సాగు చేసిన రైతులు
– మల్యాల, ముచ్చుమర్రి నుంచి కేసీకి నీరు బంద్
– నీటి కోసం కార్యాలయల చుట్టూ తిరుగుతున్న ఆయకట్టుదారులు
‘శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉంది. ఒక పంటకే కాదు రెండు పంటలకు సాగునీరు ఇస్తాం. శ్రీశైలం నీటిని ముచ్చుమర్రి, మాల్యాల ఎత్తిపోతల పథ«కం ద్వారా కర్నూలు–కడప కాలువకు అందిస్తాం’ అంటూ సీఎం చంద్రబాబునాయుడు నుంచి కిందిస్థాయి టీడీపీ నేత వరకూ హామీలిచ్చారు. దీంతో అన్నదాతలు రబీలో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అయితే పంట కాల్వలకు నీటి విడుదల ఆగిపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కర్నూలు సిటీ : సాగునీటి కాల్వలకు నీరు బంద్ చేయడంతో ఆయకట్టుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం రెండు తడులకు అయినా నీరు ఇవ్వాలని జలమండలి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నీటి విడుదల విషయంలో తాము ఏ నిర్ణయం తీసుకోలేమని, నీరు ఇస్తామని తాము చెప్పలేదని ఎవరైతై హామీ ఇచ్చారో వారి దగ్గరకే వెళ్లాలని ఇంజినీర్లు చెబుతుండడంతో ఆయకట్టుదారులు ఎక్కడికెళ్లాలో తెలియక సతమతమవతున్నారు. ఈ విషయంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్‌సీ దృష్టికి తీసుకపోయినా ప్రయోజనం లేకపోవడంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నీటి కోసం ప్రతిపాదనలు కోరిన సమయంలో ఇంజినీర్లు తమ జిల్లాకు అవసరం లేదనే «నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంతోనే నేడు ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు ఉన్నాయి.
కృష్ణా జలాలు బంద్
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాలను హంద్రీనీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాకు అందిస్తున్నారు. మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంపుల ద్వారా, సీఎం ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కేసీకి మళ్లించేందుకు చేపట్టిన పథకాల నుంచి కూడా వారం క్రితం నుంచి కృష్ణా జలాలను బంద్ చేశారు. దీంతో కేసీ కాలువ 120 కిమీ వరకు సాగు చేసిన 20 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రశ్నార్థంగా మారింది. అలాగే తెలుగుగంగ కాలువకు నీటిని బంద్ చేయడంతో అక్కడక్కడ వేసిన ఆరుతడి పంటలకు సాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
నీటి క్రమబద్దీకరణ ప్రభుత్వం చేతుల్లోకి..
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నీటి క్రమబద్ధీకరణ ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షక ఇంజినీర్లు ప్రభుత్వ అనుమతి తీసుకుని చేసేవారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి ప్రాజెక్టులు, కాల్వలకు నీటిని విడుదల చేసే అధికారాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. కేసీకి నీరు ఇవ్వాలని కోరినా పెద్దలు, అధికారుల చుట్టూ ఆయకట్టుదారులు తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.
అధికారులెవరూ చెప్పలేదు
శ్రీశైలంలో నీరున్నా కూడా ఆయకట్టుకు మాల్యాల, ముచ్చుమర్రి ద్వారా రబీకి నీరు ఇస్తామని చెప్పలేదు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలకు మాకెలాంటి సంబంధం లేదు. అవసరమయిన సమయంలో తాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఎస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్‌ఈ
Advertisement
Advertisement