కడపకు నీరివ్వండి
Published Mon, Feb 27 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
– జిల్లా కలెక్టర్‌కు కడప కలెక్టర్ లేఖ
కర్నూలు సిటీ: వైఎస్‌ఆర్ కడప జిల్లాకు కేసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్‌కు ఆదివారం లేఖ రాశారు. రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున అలగనూరు నుంచి కాని, వెలుగోడు రిజర్వాయర్ నుంచి కాని నీరు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. లేఖకు స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్.. నీరు ఇచ్చేందుకు సాధ్యమవుతుందో లేదో తెలియజేసేందుకు నోట్ పెట్టాలని కేసీ ఈఈ మల్లికార్జునను ఆదేశించారు. ఎస్‌ఈ చంద్రశేఖర్ రావుతో చర్చించిన అనంతరం.. అలగనూరు నుంచే కేసీకి నీరు ఇవ్వవచ్చని నివేదిక సమర్పిచారు. ప్రస్తుతం అలగనూరులో 2.256 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రోజుకు 400 క్యూసెక్కుల ప్రకారం ఇచ్చేందుకు సాధ్యమవుతుందని కలెక్టర్‌కు పంపిన నోట్‌లో పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో రెండు రోజుల్లో కడపకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్ వర్గాలు చెబుతున్నారు.
తాగు నీటికి అనుమతి ఇవ్వాలని వినతి....
అలగనూరు రిజర్వాయర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, నీరు ఇచ్చి ఆదుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు ఎస్‌ఈ చంద్రశేఖర్ రావుకు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు పరిశీలిస్తామని ఎస్‌ఈ వారికి హామీ ఇచ్చారు.
Advertisement