కేసీ కింద వరి సాగు వద్దు
నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టు రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని కేసీ కెనాల్ సబ్ డివిజనల్ అధికారి ఎంజే రాజశేఖర్ కోరారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ డీఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదికి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదని, దీంతో సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేయడం కష్ట సాధ్యమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుంగభద్ర బోర్డు ద్వారా మూడు టీఎంసీల నీరు కేసీకి విడుదల చేస్తామని, ఆ నీరు తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసులకు చేరుకునేందుకు రెండు రోజులు పడుతుందన్నారు. అక్కడి నుండి కేసీ కెనాల్‌కు వచ్చేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు.