మాట్లాడుతున్న చంద్రమౌళీశ్వరరెడ్డి
మితిమీరిన జల దోపిడీ
Published Wed, Sep 14 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
– ఎగువ రాష్ట్రాల తీరుపై రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఆరోపణ
– నియంత్రనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
నంద్యాలరూరల్: తుంగభద్ర నదిపై కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జలదోపిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల మాజీ ఎంపీ బొజ్జా వెంకటరెడ్డి స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సంఘాల ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నదిపై కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసీ కెనాల్‌కు రావాల్సిన నీరు కూడా తుంగభద్ర నుంచి రాలేదని, ఈ కారణంగా ఆయకట్టులో సాగైన ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆర్‌డీఎస్ ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల దగ్గర మరో ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటికీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈయన తీరువల్లే ఎగువ రాష్ట్రాలు మరింత రెచ్చిపోతున్నాయన్నారు. తక్షణమే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరిపి అక్రమంగా చేపడుతున్న ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి జనవరి నెలాఖరునాటికి కేసీ కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలన్నారు.
శ్రీశైలం జలాశయంలోని 854అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. శంకుస్థాపన దశలో ఉండిపోయిన రాజోళి బండ, జోళదరాశి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కుందూ పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్‌రెడ్డి, సిద్ధేశ్వరం జలసాధన సమితి కన్వీనర్ వైఎన్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి అధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement