నీటి ఇక్కట్లకు చంద్రబాబే కారణం
నీటి ఇక్కట్లకు చంద్రబాబే కారణం
Published Sat, Dec 31 2016 9:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
- ముచ్చుమర్రి పేరుతో జనాన్ని మభ్యపెడుతున్నారు
- విలేకరుల సమావేశంలో బైరెడ్డి
కర్నూలు సిటీ: కర్నూలు- కడప కాలువ పరిధిలో సాగునీటి కష్టాలకు సీఎం చంద్రబాబే కారణమని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కర్నూలులోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. దీనివల్ల తుంగభద్ర డ్యాంకు నీటి సరఫరా తగ్గిపోయి కేసీ ఆయకట్టుకు ఇక్కట్లు మొదలయ్యాయన్నారు. పట్టిసీమను నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సీఎం చుక్కనీరు ఇవ్వకపోగా ప్రస్తుతం ముచ్చుమర్రి ఎత్తిపోతలను తెరపైకి తెచ్చి సీమ జనాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీకి 39.9 టీఎంసీల నికర జలాల వాటాను వదులుకునే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. 35 వేల ఎకరాల కోసం ఏర్పాటు చేసిన పథకంతో రాయల సీమనే సస్యశ్యామలం చేస్తామని చెప్పడం దురదృష్టకరమన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే 69జీఓను రద్దు చేసి, శ్రీశైలంలో 854 అడుగుల కనీన నీటి మట్టాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయల సీమకు కృష్ణా జలాలు, కోస్తాంద్రకు గోదావరి జలాలను ఇవ్వాలని, కృష్ణ పుష్కరాలను ముచ్చుమర్రిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టని సీఎం, కలెక్టర్‌కు ముచ్చుమర్రిలో పర్యటించే అర్హతనే లేదన్నారు.
Advertisement