‘నీరు’గారిన ఆశలు!
‘నీరు’గారిన ఆశలు!
Published Fri, Feb 17 2017 11:42 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
దిగువకే శ్రీశైలం నీరు
- కేసీ కెనాల్‌కు నేటి నుంచి
మళ్లీ నీటి సరఫరా నిలిపివేత
– శ్రీశైలం నీటి విడుదలలో
జిల్లాకు తీరని అన్యాయం
– 48 టీఎంసీలల్లో జిల్లాకు
ఇచ్చింది 3 టీఎంసీలే
– రోజురోజుకు తగ్గిపోతున్న నీటి మట్టం
– ఏపీ జెన్‌కో జల విద్యుత్ ప్లాంట్లలో
విద్యుతుత్పత్తితో దిగువకు నీటి విడుదల
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పట్టిసీమ నీటిని రాయలసీమకు ఇస్తామంటున్న ప్రభుత్వం.. ఇందుకు భిన్నంగా కనీసం శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని కూడా కర్నూలు జిల్లాకు ఇవ్వడంలో మొండిచేయి చూపుతోంది. గడిచిన రెండు నెలల కాలంలో శ్రీశైలం నుంచి నీరు తరలిపోతున్నా జిల్లాకు మాత్రం నీటి కేటాయింపులో వివక్ష కొనసాగుతోంది. గత 60 రోజుల కాలంలో ఏకంగా 48 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలిపోయింది. అయితే, ఇందులో కర్నూలు జిల్లాకు ఇచ్చిన నీరు 3 టీఎంసీలు మాత్రమే. అంటే మిగిలిన 45 టీఎంసీల నీరు ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా డెల్టా అవసరాలకు శ్రీశైలం నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కేసీ కెనాల్‌కు మళ్లించేందుకు ఉద్దేశించిన ముచ్చుమర్రి ప్రాజెక్టును స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించి 40 రోజులకు పైబడింది. అయితే, ఇక్కడి నుంచి కేసీ కెనాల్‌కు నీటిని మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా 50వేల ఎకరాల కేసీ ఆయకట్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నీటిని విడుదల చేస్తున్నామని ప్రకటించి 48 గంటలు గడిచిందో లేదో వెంటనే నీటి విడుదలను నిలిపేశారు. మొత్తం మీద శ్రీశైలం నీటిలో జిల్లాకు దక్కాల్సిన న్యాయమైన వాటా మనకు దక్కకుండా పోతోంది.
20 అడుగులు తగ్గినా..
శ్రీశైలం రిజర్వాయర్‌లో రెండు నెలల క్రితం 862 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం నీటి మట్టం కాస్తా 842 అడుగులకు పడిపోయింది. గతంలో 862 అడుగుల నీటి మట్టం వద్ద రిజర్వాయర్‌లో 112 టీఎంసీల నీరు నిల్వ ఉండింది. అయితే, ప్రస్తుతం నీటి మట్టం 842 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న నీరు 64 టీఎంసీలు మాత్రమే. అంటే ఏకంగా 48 టీఎంసీల నీరు తగ్గిపోయింది. ఈ మొత్తం నీటిలో కర్నూలుకు ఇచ్చింది 3 టీఎంసీలు మాత్రమే. మిగిలిన నీటిని మొత్తం విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కిందకు తరలిస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరగకపోయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లు మాత్రం రాత్రిపగలు ఎడతెరపి లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. తద్వారా శ్రీశైలం నీరు కిందకు తరలిపోతోంది. పట్టిసీమ నీళ్లు రాయలసీమకు మళ్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇందుకు భిన్నంగా శ్రీశైలంలోని నీటినే కింది డెల్టా అవసరాలకు మళ్లిస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది.
మొదటి నుంచీ ఇదే తీరు
వాస్తవానికి హంద్రీనీవా కాలువల ద్వారా కేసీ కెనాల్‌తో పాటు గాజులదిన్నె ప్రాజెక్టుకు కూడా నీళ్లు సరఫరా చేసే అవకాశం ఉండింది. అంతేకాకుండా పందికోన ప్రాజెక్టును కూడా నింపే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఇవేవీ చేయలేదు. ఫలితంగా కేసీ కెనాల్ కింద ఉన్న 50వేల ఎకరాల ఆయకట్టుతో పాటు గాజులదిన్నె కింద ఉన్న 7వేల ఎకరాల ఆయకట్టుకు కూడా ప్రస్తుతం నీరు అందని పరిస్థితి. ఇప్పటికే పంట వేసుకున్న రైతులకు రెండు తడుల నీరు అందింది. మరో రెండు తడుల నీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీరు రోజురోజుకు తగ్గిపోతోంది.
మరో పది రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గిపోయి.. హంద్రీనీవా ద్వారా నీటిని మళ్లించే అవకాశం లేకుండా పోనుంది. ఇదే జరిగితే పంటలు వేసుకున్న రైతులకు తిప్పలు తప్పేలా లేవు. తమకు నీరు విడుదల చేయాలంటూ గాజులదిన్నె ప్రాజెక్టు ఆయకట్టు రైతులు జల మండలిని శుక్రవారం ముట్టడించారు. అయితే, తామేమీ చేయలేమని.. కలెక్టర్ నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడు నీరు వస్తుందో తెలియక.. కేసీ, గాజులదిన్నె ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా మారింది.
Advertisement