‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు | Srisailam water capacity has decreased by 102.11 TMC | Sakshi
Sakshi News home page

‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు

Published Mon, Oct 7 2024 8:58 AM | Last Updated on Mon, Oct 7 2024 8:58 AM

Srisailam water capacity has decreased by 102.11 TMC

ప్రాజెక్టులో నానాటికీ పేరుకుపోతున్న పూడిక

జలాశయ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు 

తాజా సర్వేలో 205.95 టీఎంసీలకు తగ్గిందన్న సీడబ్ల్యూసీ నివేదిక 

కృష్ణా పరీవాహక ప్రాంతంలో భారీగా అడవుల నరికివేత

వర్షాలు కురిసినప్పుడు భూమి కోతకు గురై.. వరదతోపాటు మట్టి ప్రవాహం 

ఇదే శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక పేరుకుపోవడానికి కారణం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్‌ స్టోరేజీ సామర్థ్యం 72.77 టీఎంసీలు.. డెడ్‌ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందన్నది రాష్ట్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలో వెల్లడైంది. 

బేసిన్‌లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వే చేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలో 548 జలాశయాలలో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది. 

45 ఏళ్లలో కొండలా పూడిక 
కృష్ణానదిపై నంద్యాల జిల్లాలో శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు.. సాగు, తాగునీటి అవసరాలకు ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని తేల్చింది. జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.

ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే..
శ్రీశైలం జలాశయంపై తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం.. లైవ్‌ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ ఎత్తున వ్యయంతో కూడిన పని.. పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్‌ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.  

ఇదీ శ్రీశైలం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం

👉తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976
👉 కనీస నీటిమట్టం: 854 అడుగులు
👉 గరిష్ట నీటిమట్టం: 885 అడుగులు
👉 క్యాచ్‌మెంట్‌ ఏరియా: 60,350 చదరపు కిలోమీటర్లు
👉  గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం: 615.18 చదరపు కిలోమీటర్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement