విరుద్ధ ప్రకటనలతో అయోమయం
నంద్యాలరూరల్: జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు.. విరుద్ధ ప్రకటనలు చేస్తూ కేసీ కెనాల్ ఆయకట్టు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, సకాలంలో నీరు వచ్చే అవకాశం లేదు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, కేసీ కెనాల్ అధికారులు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎం చేయాలో అర్థం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశమై నెల రోజులు కావస్తున్నా నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పది టీఎంసీలను విడతల వారిగా విడదల చేసి ఆయకట్టు రైతులను కాపాడాలన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854అడుగులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిద్దేశ్వరం అలుగు సాధన కన్వీనర్ వైఎన్‌రెడ్డి, కుందూ పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జల సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.