aayakat
-
సాగు ప్రశ్నార్థకమే !
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ఇప్పట్లో లేనట్టే - శ్రీశైలం నీటి మట్టం 70.7 అడుగులు దాటితేనే ఆశలు - రెండుపంటలను కోల్పోనున్న ఆయకట్టు రైతులు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ కాల్వ, తెలుగుగంగ, కేసీ ఆయకట్టు కాల్వ కిందనున్న ఆయకట్టులో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్న రైతులు రబీకి నీరందుతుందా లేదానని ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు చుక్కనీరు అందాలన్నా పోతిరెడ్డిపాడు ద్వారానే కృష్ణానది నీరు విడుదల కావాలి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల సాధ్యమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం జలాశయంలోకి ఆగస్టు పూర్తయినా వరద నీరు చేరక పోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిధిలోని 5,03,288 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఏటా ఆగస్టు మొదటి వారంలోనే నీటి విడుదలై రెండు పంటలు సాగు చేసేవారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు డ్యామ్‌లో ఆశించిన మేర నీరు లేకపోవడంతో రబీపై కూడా ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. తప్పని కన్నీటిసేద్యం: పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ కాల్వ కింద 1,88,788 ఎకరాలు, తెలుగుగంగ కాల్వ కింద 1,14,500 ఎకరాలు, కేసీ ఎస్కేప్ కాల్వ కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటివిడుదల జరిగితేనే కాల్వల కిందున్న ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 783.30 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 70.7అడుగుల నీటిమట్టం పెరిగితేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పట్లో శ్రీశైలం జలాశయంలో ఏ కోసాన నీటిమట్టం పెరిగే అవకాశాల్లేవు. గత రెండేళ్లుగా ఆగస్టు మొదటి వారంలోనే నీటి విడుదల అవుతోంది. 2015లో ఆగస్టు 1 నాటికి శ్రీశైలం జలాశయంలో 802.70 అడుగుల నీటిమట్టం ఉండగానే ఆగష్టు 5న పోతిరెడ్డిపాడు నుంచరి నీటిని విడుదల చేశారు. 2016 ఆగస్టు 1న శ్రీశైలం జలాశయంలో 822 అడుగుల నీటిమట్టం ఉండగా ఆగస్టు 2న పోతిరెడ్డిపాడు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు మాసం ముగుస్తున్నా ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కేవలం 783.30 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. రబీకి నీరందేనా: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. వర్షాలు లేక, కాల్వకు నీరు లేక భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. మరో వైపు శ్రీశైలం జలాశయంలోకి ఆశించిన స్థాయిలో వరదనీరు చేరక పోవటంతో రబీ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించి సంవృద్ధిగా వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయం త్వరగా నిండితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ ఎస్కేప్ కాల్వల రబీపంటలనైనా సాగుచేసుకోవచ్చుననే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. -
ఆయకట్టుదారులు ఆందోళన బాట
సాగునీటి కోసం కేసీ కెనాల్ ఈఈ కార్యాలయం ముట్టడి - పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన – అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంపై ఆగ్రహం నంద్యాలరూరల్: సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే కర్నూలు–కడప ప్రధాన కాల్వకు నీరు విడుదల చేయాలని బుధవారం ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లోనే వివిధ మండలాల రైతులు నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయాన్ని ముట్టడించారు. కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమతో మిగులు జలాలు, శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పారించి కరువును పారదోలుతున్నామన్న ముఖ్యమంత్రికి కేసీ చివరి ఆయకట్టు ఎండుతున్నా స్పందించకపోవడం బాధాకరమన్నారు. కెనాల్ నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ముచ్చుమర్రి, ఎత్తిపోతల పథకం ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి రెండుకార్లు నీరందిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు కెనాల్‌కు నీరు నిలుపుదల చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల హామీతో కేసీ రైతులు పత్తి, మిరప, వేరుశనగ, కంది, మినుము తదితర పంటలు సాగు చేశారనా్నరు. ఇప్పుడు ఆ పంటలు ఎండుతుంటే హామీచ్చిన వారు నోరెత్తకపోవడం దారుణమనా్నరు. ఇప్పటికైనా కేసీ కెనాల్‌కు శ్రీశైల జలాశయంలోని నీటిని విడుదల చేసి ఎండుతున్న చివరి ఆయకట్టు పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జునకు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, సిద్దేశ్వరం అలుగు సాధన సమితి కన్వీనర్ వైఎన్‌రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎరబోలు ఉమామహేశ్వరరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు బెక్కెం రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, బంగారురెడ్డి, రామసుబ్బారెడ్డి, గుర్రప్ప, పార్థసారథిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోండి
– ఎస్ఈని కలిసి విన్నవించిన ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు సిటీ: పాములపాడు మండలం మద్దూరు, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఐజయ్య మంగళవారం జల మండలిలో ఎస్ఈని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాల్వ విస్తరణ కోసం కేసీ కాలువ అక్విడక్ కూల్చి వేశారన్నారు. దీంతో సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందడం లేదన్నారు. ఎస్ఆర్బీసీ కాల్వ నుంచి కాంట్రాక్టర్ రెండు మోటర్లు జనరేటర్ పెట్టి నీటిని ఆయకట్టుకు అందించే వారని, అయితే రెండు రోజుల నుంచి జన రేటర్ తీసేసి ఒక మోటర్ ద్వారానే నీటిని పంపు చేస్తుండడంతో పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉన్నాయని, ఎలాగైనా నీరు ఇచ్చి పంటలకు కాపాడాలని ఎమ్మెల్యే కోరారు. కేసీ కాల్వకు సుంకేసుల నుంచి నీరు బంద్ చేయడంలో పంటలకు నీరు అందక ఎండుతున్నాయని, టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయించాలన్నారు. ఎస్ఈ స్పందించి డ్యామ్ నుంచి 1.55 టీఎంసీలకు ఇండెంట్ పెట్టామని, నీటి విడుదలకు ఈఎన్సీ అనుమతులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో ఫోన్ మాట్లాడి టీబీ డ్యామ్ నుంచి కేసీ ఆయకట్టుకు నీరు విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హంద్రీనీవా నుంచి దామగట్ల చెరువుకు శ్రీశైలం నీటిని నింపితే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు, బొల్లవరం, నాగటూరు చెరువులకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందఽన్నారు. ఎస్ఈ .. చిన్న నీటిపారుదల శాఖ నంద్యాల ఈఈ బాల చంద్రారెడ్డితో ఫోన్లో మాట్లాడి హంద్రీనీవా నీరు దామగట్ల చెరువు నింపేందుకు అవకాశం ఉంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కేసీ ఆయకట్టుకు నీటి కొరత లేదు
కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టుకు నీటి కొరత రానివ్వబోమని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున తెలిపారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కర్నూలు–కడప జిల్లాల్లో మొత్తం కేసీ ఆయకట్టు 2.65లక్షల ఎకరాలు ఉండగా.. 2.05లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారన్నారు. తుంగభద్ర డ్యాం కేసీకి నీటివాటా రావడం లేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇప్పటికే కేసీ కెనాల్‌కు 8 టీఎంసీల నీటిని విడుదలకు చర్యలు చేపట్టామన్నారు. రబీలో ఆయకట్టు రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారుల సమన్వయంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. -
విరుద్ధ ప్రకటనలతో అయోమయం
నంద్యాలరూరల్: జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు.. విరుద్ధ ప్రకటనలు చేస్తూ కేసీ కెనాల్ ఆయకట్టు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. రెండు పంటలకు నీరిస్తామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, సకాలంలో నీరు వచ్చే అవకాశం లేదు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, కేసీ కెనాల్ అధికారులు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎం చేయాలో అర్థం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశమై నెల రోజులు కావస్తున్నా నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పది టీఎంసీలను విడతల వారిగా విడదల చేసి ఆయకట్టు రైతులను కాపాడాలన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854అడుగులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిద్దేశ్వరం అలుగు సాధన కన్వీనర్ వైఎన్‌రెడ్డి, కుందూ పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జల సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.