ఆయకట్టుదారులు ఆందోళన బాట
ఆయకట్టుదారులు ఆందోళన బాట
Published Wed, Feb 1 2017 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
సాగునీటి కోసం కేసీ కెనాల్ ఈఈ కార్యాలయం ముట్టడి
- పంటలు ఎండిపోతున్నాయని
రైతన్నలు ఆవేదన
– అధికారులు, ప్రజా ప్రతినిధులు
స్పందించకపోవడంపై ఆగ్రహం
నంద్యాలరూరల్: సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే కర్నూలు–కడప ప్రధాన కాల్వకు నీరు విడుదల చేయాలని బుధవారం ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లోనే వివిధ మండలాల రైతులు నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయాన్ని ముట్టడించారు. కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమతో మిగులు జలాలు, శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పారించి కరువును పారదోలుతున్నామన్న ముఖ్యమంత్రికి కేసీ చివరి ఆయకట్టు ఎండుతున్నా స్పందించకపోవడం బాధాకరమన్నారు.
కెనాల్ నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ముచ్చుమర్రి, ఎత్తిపోతల పథకం ప్రారంభించేటప్పుడు ముఖ్యమంత్రి రెండుకార్లు నీరందిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు కెనాల్‌కు నీరు నిలుపుదల చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల హామీతో కేసీ రైతులు పత్తి, మిరప, వేరుశనగ, కంది, మినుము తదితర పంటలు సాగు చేశారనా్నరు. ఇప్పుడు ఆ పంటలు ఎండుతుంటే హామీచ్చిన వారు నోరెత్తకపోవడం దారుణమనా్నరు.
ఇప్పటికైనా కేసీ కెనాల్‌కు శ్రీశైల జలాశయంలోని నీటిని విడుదల చేసి ఎండుతున్న చివరి ఆయకట్టు పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జునకు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, సిద్దేశ్వరం అలుగు సాధన సమితి కన్వీనర్ వైఎన్‌రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎరబోలు ఉమామహేశ్వరరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు బెక్కెం రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, బంగారురెడ్డి, రామసుబ్బారెడ్డి, గుర్రప్ప, పార్థసారథిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement