సాగు ప్రశ్నార్థకమే !
సాగు ప్రశ్నార్థకమే !
Published Mon, Aug 28 2017 10:18 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
పోతిరెడ్డిపాడు నుంచి
నీటి విడుదల ఇప్పట్లో లేనట్టే
- శ్రీశైలం నీటి మట్టం 70.7 అడుగులు
దాటితేనే ఆశలు
- రెండుపంటలను కోల్పోనున్న
ఆయకట్టు రైతులు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ కాల్వ, తెలుగుగంగ, కేసీ ఆయకట్టు కాల్వ కిందనున్న ఆయకట్టులో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్న రైతులు రబీకి నీరందుతుందా లేదానని ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు చుక్కనీరు అందాలన్నా పోతిరెడ్డిపాడు ద్వారానే కృష్ణానది నీరు విడుదల కావాలి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల సాధ్యమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం జలాశయంలోకి ఆగస్టు పూర్తయినా వరద నీరు చేరక పోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిధిలోని 5,03,288 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఏటా ఆగస్టు మొదటి వారంలోనే నీటి విడుదలై రెండు పంటలు సాగు చేసేవారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు డ్యామ్‌లో ఆశించిన మేర నీరు లేకపోవడంతో రబీపై కూడా ఆశలు వదులుకోవాల్సి వస్తోంది.
తప్పని కన్నీటిసేద్యం:
పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ కాల్వ కింద 1,88,788 ఎకరాలు, తెలుగుగంగ కాల్వ కింద 1,14,500 ఎకరాలు, కేసీ ఎస్కేప్ కాల్వ కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటివిడుదల జరిగితేనే కాల్వల కిందున్న ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 783.30 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 70.7అడుగుల నీటిమట్టం పెరిగితేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పట్లో శ్రీశైలం జలాశయంలో ఏ కోసాన నీటిమట్టం పెరిగే అవకాశాల్లేవు.
గత రెండేళ్లుగా ఆగస్టు మొదటి వారంలోనే నీటి విడుదల అవుతోంది. 2015లో ఆగస్టు 1 నాటికి శ్రీశైలం జలాశయంలో 802.70 అడుగుల నీటిమట్టం ఉండగానే ఆగష్టు 5న పోతిరెడ్డిపాడు నుంచరి నీటిని విడుదల చేశారు. 2016 ఆగస్టు 1న శ్రీశైలం జలాశయంలో 822 అడుగుల నీటిమట్టం ఉండగా ఆగస్టు 2న పోతిరెడ్డిపాడు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు మాసం ముగుస్తున్నా ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కేవలం 783.30 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది.
రబీకి నీరందేనా:
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. వర్షాలు లేక, కాల్వకు నీరు లేక భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. మరో వైపు శ్రీశైలం జలాశయంలోకి ఆశించిన స్థాయిలో వరదనీరు చేరక పోవటంతో రబీ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించి సంవృద్ధిగా వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయం త్వరగా నిండితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ ఎస్కేప్ కాల్వల రబీపంటలనైనా సాగుచేసుకోవచ్చుననే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement