కేసీ ఆయకట్టుకు నీటి కొరత లేదు
కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున
నంద్యాలరూరల్: కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టుకు నీటి కొరత రానివ్వబోమని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున తెలిపారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కర్నూలు–కడప జిల్లాల్లో మొత్తం కేసీ ఆయకట్టు 2.65లక్షల ఎకరాలు ఉండగా.. 2.05లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారన్నారు. తుంగభద్ర డ్యాం కేసీకి నీటివాటా రావడం లేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇప్పటికే కేసీ కెనాల్‌కు 8 టీఎంసీల నీటిని విడుదలకు చర్యలు చేపట్టామన్నారు. రబీలో ఆయకట్టు రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారుల సమన్వయంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.