ఇచ్చినమాట నిలబెట్టుకోండి
– ఆగస్టులోగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను పూర్తిచేయండి
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కోరిన ఎమ్మెల్యే ఐజయ్య
పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఆగష్టులోగా పూర్తి చేసి కేసీ కాలువ కింద రెండో పంటకు నీరు విడుదల చేయించి జాతీకి అంకితం చేస్తామన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో భవన సముదాయాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈసందర్భంగా నూతనంగా నిర్మించిన మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ముచ్చుమర్రి వద్ద చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు 30 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగష్టులోగా పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని రైతులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారే తప్పా.. పనుల్లో పురోభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. రాయలసీమ రైతుల అభివృద్ధిని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ, అమరావతి అంటారే తప్పా.. పెండింగ్‌లో ఉండే సిద్ధాపురం, జూపాడుబంగ్లా, సెలిమిల్ల, లింగాల ఎత్తిపోతల పథకాలను పూర్తిచేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమ రైతులకు 80 టీఎంసీల నీరు లభిస్తుందని, దీంతో సీమ సస్యశ్యామలంగా మారుతుందని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ రమాదేవి, నాయకులు చిట్టిరెడ్డి, డీలర్ నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.