ఒట్టి సీమ..ముచ్చుమర్రి | empty seema.. muchumarri | Sakshi
Sakshi News home page

ఒట్టి సీమ..ముచ్చుమర్రి

Published Tue, Feb 21 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

ఒట్టి సీమ..ముచ్చుమర్రి

ఒట్టి సీమ..ముచ్చుమర్రి

- మరో కోన సీమ అంటూ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి
- పంప్‌హౌస్‌లో అడుగంటిన నీటి నిల్వలు
- ఒక మోటర్‌కు కూడా సరఫరా కాని వైనం
- అప్రోచ్‌ చానెల్‌ మధ్యలో అడ్డుకట్ట(తండ్‌)
- అడ్డుకట్ట తొలగిస్తేనే పంప్‌హౌస్‌లోకి
  సరఫరా కానున్న బ్యాక్‌వాటర్‌
- ఆందోళనలో కేసీ రైతులు
పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో రాయలసీమ మరో కోనసీమగా మారనుందని మూడు పంటలు పండించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మరో సారి మోసం చేశారు. కోస్తాకు పట్టిసీమ అయితే రాయలసీమకు మరో పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల అంటూ నమ్మబలకడంతో రైతులు కేసీ కాలువ కింద మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగు చేసి నిలువునా నష్టపోయారు. ఒక్క పంటకు కూడా నీరివ్వలేని దుస్థితికి చేరుకున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం భవిష్యత్‌లో ఒట్టి సీమగా మారుతుందని అన్నదాత ఆవేదన చెందుతున్నారు. 
 
జనవరి 2న జాతికి అంకితమైన ఈ ప్రాజెక్ట్‌ రైతుల ఆశలకు గండికొట్టింది. నెల రోజులు తిరగక ముందే పంప్‌హౌస్‌ అడుగంటిపోయి ఒక మోటర్‌కు కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్‌ ఆగమేఘాలపై కేసీ కాలువకు సాగునీరు ఇవ్వాలని, రబీ పంటలను కాపాడాలని రెండు పంప్‌లను సిద్ధం చేయించినా విమర్శకుల నోళ్లలో నానాల్సి వస్తోంది. శ్రీశైలం డ్యాంలోని నీటిని విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ముఖ్యమంత్రి దిగువన ఉండే నాగార్జునసాగర్‌కు తరలించి జలదోపిడీకి పాల్పడి రాయలసీమ ప్రాంత భూములను ఎడారిగా మార్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
నది లో లెవెల్‌ నీరు పంప్‌హౌస్‌లోకి రావాలంటే అప్రోచ్‌ చానెల్‌ మధ్యలో ఉండే అడ్డుకట్ట(తండ్‌)కు అడుగున్నర దిగువకు ఉన్నాయి. ఈ అడ్డుకట్టను తొలగించకపోతే బ్యాక్‌వాటర్‌ పంప్‌హౌస్‌ దరికి చేరదు. ఇప్పటికే నీటి తడులు అందక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు రేయింబవళ్లు స్లూయిస్‌ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. పంప్‌హౌస్‌ నుంచి కేసీలోకి సరఫరా చేసిన నీటిని స్థానిక క్రాస్‌ రెగ్యులేటర్‌లను బంద్‌ చేసి ఎగువన అల్లూరు వైపుకు మళ్లించి అక్కడి నుంచి కర్నూలు పట్టణానికి తాగునీటికి తరలించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో దిగువకు నీటిని బంద్‌ చేశారు. దీంతో ముచ్చుమర్రి క్రాస్‌రెగ్యులేటర్‌ల వద్ద రైతులు నీటిపారుదల శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగి ఆందోళనలు చేశారు. 
 
ఎమ్మెల్యే చొరవతో​నీటి విడుదల
కేసీకి నీటి విడుదల నిలిచిన ప్రతిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వై. ఐజయ్య రైతుల పక్షాన అధికారులతో పోరాడాల్సి వస్తోంది. అందులో భాగంగానే సోమవారం రైతులతో కలిసి ఎమ్మెల్యే వై. ఐజయ్య ముచ్చుమర్రికి చేరుకుని కేసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిపించారు. కృష్ణా జలాలను దిగువకు తరలిస్తున్నందున శ్రీశైలంలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయి. పంప్‌హౌస్‌ నుంచి సిద్ధేశ్వరం వరకు చేపట్టిన అప్రోచ్‌ చానెల్‌ పనులు అసంపూర్తిగా మిగిలిపోయి నీటి సరఫరాకు అడ్డంకిగా తయారైంది. దీంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు  వాయిదా పడుతూ వస్తున్నాయి. గోదావరి జలాలలను పట్టిసీమ ద్వారా శ్రీశైలం డ్యాంకు మళ్లిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీశైలం డ్యాం నీటిని దిగువకు ఎందకు పంపిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. 
 
నీళ్లివ్వలేమని చెప్పి ఉంటే పంటలను వేసుకునే వాళ్లం కాదు: రాంబాబు, ముచ్చుమర్రి
రబీ సాగుకు నీళ్లివ్వలేమని చెప్పి ఉంటే పంటలను వేసుకునే వాళ్లం కాదు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రోజున మూడు పంటలకు నీరిస్తామని, ఇప్పుడు రబీలో వేసిన పంటలు చేతికి వచ్చే వరకు నీరిస్తామని చెప్పడంతో మోసపోయాం. నీటి తడులు అందక పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేశాం. వాటిని ఎలా తీర్చాలి.
 
కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నాం: నాగలక్ష్మమ్మ, కొత్తముచ్చుమర్రి
పంప్‌హౌస్‌లో నీరు అడుగంటిపోయిందని చెబుతున్నారు. మోటార్లకు నీరందడం లేదని మరో గంటకల్లా మోటార్లు బంద్‌ చేస్తారని తెలిసింది. పంటలకు నీరిందక రేయింబవళ్లు కాలువల వద్ద మడువలు వేసుకోవడానికి పడిగాపులు కాస్తున్నాం. ప్రస్తుతం పైర్లు నెల రోజులకు పైగా అవుతోంది. మినుములు పూత దశలో ఉండి సట్ట పడుతున్నాయి. నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం.
 
అడ్డుకట్ట పనులను వెంటనే చేపడతాం: రెడ్డిశేఖర్‌రెడ్డి, జలవనురులశాఖ ఈఈ
పంప్‌హౌస్‌లోకి బ్యాక్‌వాటర్‌ రావడం నిలిచిపోయాయి. అప్రోచ్‌ చానెల్‌ కాలువ మధ్యలో అడ్డుకట్ట ఉంది. ఆ పనులను వెంటనే చేపట్టి బ్యాక్‌వాటర్‌ పంప్‌హౌస్‌లోకి సరఫరా అయ్యేలా చూస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement