ఏప్రిల్ చివరిలోపు ‘ముచ్చుమర్రి’పూర్తి
ఏప్రిల్ చివరిలోపు ‘ముచ్చుమర్రి’పూర్తి
Published Mon, Feb 6 2017 10:27 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
- ఇంజినీరింగ్ అధికారులను
ఆదేశించిన కలెక్టర్
- పనుల్లో అలసత్వం
ప్రదర్శించ రాదని హెచ్చరిక
- కేసీ కాలువకు రెండు పంప్‌ల
ద్వారా నీటి విడుదల
ముచ్చుమర్రి(పగిడ్యాల): రాయలసీమకు వరదాయిని అయిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఆయన కేసీ కాలువకు రెండు పంప్‌ల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పెండింగ్ పనులపై ఆరా తీశారు. హంద్రీనీవా కాలువకు డిజైన్ చేసిన 12 పంప్‌ల పనుల్లో ఆరు పంప్‌లను అమర్చేందుకు అర్త్‌వర్క్ పనులు పూర్తి చేశామని త్వరలోనే మోటర్లను కూర్చోబెట్టుతామని ఎస్‌ఈ సూర్య నారాయణస్వామి కలెక్టర్‌కు వివరించారు.
ఏప్రిల్ చివరి నాటికి పనులు పూర్తి చేసి 16 పంప్‌లతో ప్రాజెక్ట్ అప్పగించాలని కలెక్టర్ఆదేశించారు. అయితే హంద్రీనీవా కాలువ తవ్వకం పనుల్లో రైతులు బ్రిడ్జిలను నిర్మించాలని, పొలాలకు నీరు కట్టుకునేందుకు అండర్ టన్నెల్ కాలువలు నిర్మించాలని కోరుతున్నారని ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ వాటి నిర్మాణాలకు ఎంత వ్యయం అవుతుందో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నుంచి కేసీ కాలువకు 4 పంప్‌ల ద్వారా 1300 క్యూసెక్కుల నీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. రబీ సీజన్‌లో కేసీ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ఫిబ్రవరి చివరి వరకు నీరిస్తామన్నారు. సిద్దాపురం పనులు 80 శాతం పూర్తయ్యాయని ఏప్రిల్‌లోపు పెండింగ్ పనులు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జలవనురుల శాఖ ఎస్‌ఈ సూర్యనారాయణ, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈ బాలాజీ, తహసీల్దార్ కుమారస్వామి, ఆర్‌ఐ అరుణ, వీఆర్వో వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement