నీటి మాటలే!
నీటి మాటలే!
Published Wed, Sep 13 2017 10:53 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– తాగు నీటి పేరుతో దిగువకు నీరు
– కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది 2 టీఎంసీలు
– మూడు రోజులుగా 30 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్న కృష్ణా జలాలు
– శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి చేరకముందే జలాలు కాజేసే ఎత్తుగడ
– హంద్రీనీవా నీరు సైతం జిల్లాకు అందని పరిస్థితి
– ఈ అన్యాయంపై నోరుమెదపనిఅధికారపార్టీ ప్రజాప్రతినిధులు
కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన ప్రతి చుక్క నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించి సస్యశ్యామలం చేస్తాం. అప్పటి వరకు దిగువకు చుక్క నీరు తరలించాం. ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా కాలువకు వదిలే నీటితో చెరవులన్నీ నింపుతాం. ప్రభుత్వం ఇటీవల చెప్పిన ఈ మాటలకు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదు. ఎప్పటిలాగే తాగునీటి పేరుతో దిగువకు నీటిని తరలిస్తోంది. సీమకు తీరని అన్యాయం చేస్తోంది.
సుమారు 11 నెలల తరువాత కృష్ణమ్మ, తుంగభద్ర నదులకు వరద నీరు వచ్చి శ్రీశైలేశుడి చేంతకు చేరుతోంది. కనీస నీటి మట్టానికి కూడా చేరకముందే ప్రాజెక్టులోకి చేరిన నీటిని తాగు నీటి పేరుతో దిగువకు తీసుకపోయేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎత్తుగడ వేశాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు, నల్గొండ తాగు నీటి అవసరాల పేరుతో 2 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకునేందుకు కృష్ణనది యాజమాన్యా బోర్డు అనుమతి తీసుకుంది. ఈ నెల 12 నుంచి 15 వతేది వరకు రోజుకు 6 వేల క్యుసెక్కుల చొప్పున కుడి (3వేల క్యూసెక్కులు), ఎడమ(3 వేల క్యూసెక్కులు) పవర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేయాలని బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు 30 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇదే అదునుగా ఏపీ ప్రభుత్వం సైతం గుట్టుగా సుమారు 4టీఎంసీలను కాజేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తునా్నయి. అందులో భాగంగానే తెలంగాణకు అనుమతి ఇచ్చిన 2 టీఎంసీల కోటా పూర్తి అయినా కూడా నీటి విడుదలను కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
పట్టని సీమ తాగునీటి గోడు
రాయలసీమ జిల్లాలో ఇప్పటికీ తాగు నీటి సమస్య ఉంది. పలు చోట్ల దాహం కేకలు వినిపిస్తున్నాయి. అయినా, ప్రభుత్వం కరుణించడం లేదు. నీటిని విడుదల చేయడం లేదు. ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా కాలువకు నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కూడా కేవలం ఒక్క మోటార్‌తోనే నీటిని పంప్ చేస్తున్నారు. ఈ నీటితో ముందుగా తాగు నీటి అవసరాలు ఉన్న చోట చెరువులను నింపుకునేందుకు అవకాశం ఉంది. అయితే, ఆ అరకొరనీటిని కూడా అనంతపురం వైపు పంపిస్తున్నారు.
అన్యాయంపై గళం విప్పకుంటే...కన్నీటి కష్టాలే !
రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లురు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటికి శ్రీశైలం జలాశయమే ప్రధాన ఆధారం. వీటి పరిధిలో సుమారు 10.22 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. సీమ జిల్లాలకు నీరు రావాలంటే 854 (శ్రీశైలం కనీస నీటి మట్టం) అడుగులు ఉండాలి. ఈ నీటి మట్టానికి చేరకముందే తాగు నీటి పేరుతో దిగువకు జలాలు తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు 1996లో సీఎంగా ఉన్న సమయంలో రాయల సీమ ప్రాంత ప్రయోజనాలను కాలరాస్తూ శ్రీశైలం కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిసూ జీఓ నెంబరు 69 ఇచ్చారు. ఆ తరువాత దివంగత సీఎం డాక్టర వైఎస్‌ఆర్ ఈ జీఓను సవరించి 854 అడుగుల మట్టం ఉండేలా 107 జీఓ ఇచ్చారు.
గతంలో తను ఇచ్చిన 69 జీఓను సైతం పట్టించుకోకుండా 787 అడుగుల వరకు నీటిని తీసుకుపోయారు. ఇటీవల ఎగువన కురిసిన వర్షాల వల్ల శ్రీశైలానికి ఈ నెల 1వతేది 1250 క్యూసెక్కులతో ఇన్‌ఫ్లో మొదలైంది. ప్రస్తుతం 831 అడుగులకు చేరుకొని 50.6 టీఎంసీల సామర్థ్యానికి జలాశయం చేరింది. దిగువకు నీరు విడుదల చేయకుంటే హంద్రీనీవా మాల్యాల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నీటిని తోడేందుకు అనుకూలంగా ఉండేది. చంద్రబాబు సర్కారు తాగునీటి పేరుతో దిగువకు తరలించి ఆ పరిస్థితి లేకుండా చేసింది. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించకుంటే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది.
Advertisement