చిన్నారుల కోసం గాలింపు ముమ్మరం
చిన్నారుల కోసం గాలింపు ముమ్మరం
Published Tue, Sep 12 2017 9:55 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
రంగంలోకి ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది
– లభించని ఆచూకీ
కర్నూలు (రాజ్‌విహార్): కేసీ కెనాల్‌లో తప్పిపోయిన చిన్నారుల కోసం వివిధ శాఖల అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సప్తగిరి నగర్‌లో నివాసముంటున్న మోనేశాచారి, పద్మవతి దంపతుల కవల పిల్లలు ఆదివారం అదృశ్యమైన విషయం తెలిసిందే. పన్నెండేళ్ల చిన్నారులు ప్రకాష్, మురళి మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా కేసీ కెనాల్‌లో ఈతకు వెళ్లి అదృశ్యం కాగా సోమవారం మధ్యాహ్నం వినాయక్ ఘాట్ వెనుక కేసీ కెనాల్ ఒడ్డున పిల్లలకు సంబంధించిన దుస్తులు కన్పించడంతో వెలుగులోకి వచ్చింది. వాటిని గుర్తించిన తల్లిదండ్రులు పిల్లలు కేసీ కెనాల్‌లో కొట్టుకుపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమివ్వడంతో దుస్తులను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే మంగళవారం కర్నూలు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం. భూపాల్‌రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమారెడ్డి ఆధ్వర్యంలో రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు కర్నూలు వినాయక ఘాట్ నుంచి జూపాడుబంగ్లా వరకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సిబ్బంది ఉధృతంగా ప్రవహిస్తున్న కేసీ కెనాల్‌లో లైఫ్ జాకెట్లు, తాళ్ల సాయంతో వెతికారు. వీరికి పోలీసు, రెవెన్యూ సిబ్బందిలోపాటు నీటి పారుదల శాఖ లస్కర్లు సహకారం అందించారు. రోజంతా గాలించినప్పటికీ చిన్నారుల ఆచూకీ లభించలేదని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కూడా గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు.
Advertisement
Advertisement