ఇక కాకి లెక్కలు చెల్లవ్! | jalamandali alerts on corruption | Sakshi
Sakshi News home page

ఇక కాకి లెక్కలు చెల్లవ్!

Published Thu, Nov 12 2015 7:42 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ఇక కాకి లెక్కలు చెల్లవ్! - Sakshi

ఇక కాకి లెక్కలు చెల్లవ్!

సాక్షి,సిటీబ్యూరో: పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు దండుకుంటున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు జలమండలి సామాజిక తనిఖీలు చేయించాలని నిర్ణయించింది. మహానగరం పరిధిలో ఏటా సుమారు రూ.50 నుంచి రూ.75 కోట్ల విలువ చేసే పైప్‌లైన్ల లీకేజీల నివారణ, మ్యాన్‌హోళ్లు, స్టోరేజీ రిజర్వాయర్ల నిర్వహణ, మరమ్మతు పనులు జరుగుతుంటాయి.

వీటిని తనిఖీ చేసేందుకు జలమండలి.. విజిలెన్స్ విభాగాన్ని త్వరలో రంగంలోకి దింపనుంది. సదరు విభాగం అధికారులు కాంట్రాక్టర్ పూర్తిచేసిన పనుల నాణ్యత, మన్నికను పరిశీలించడంతో పాటు స్థానికంగా ప్రజల నుంచి సదరు పని జరిగిన తీరు, సమస్య పరిష్కారమైందో లేదో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాకే బిల్లులు మంజూరు చేయాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. గతేడాది జరిగిన నిర్వహణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో తనిఖీలకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది.
 అంతా గోప్యమే...
 జలమండలి పరిధిలో రోజూ పలుప్రాంతాల్లో జరిగే కలుషిత జలాల సరఫరా నివారణ, మంచినీరు, డ్రైనేజీ పైప్‌లైన్లకు ఏర్పడే లీకేజీలకు మరమ్మతులు, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్ల పునరుద్ధరణ, స్టోరేజీ రిజర్వాయర్లకు మరమ్మతు పనులను నిర్వహణ, మరమ్మతు పనులుగా పరిగణిస్తారు. నిర్వహణ పనుల్లో సింహభాగం భూమిలోపల జరిగేవి, రాత్రి పూట జరిగేవే ఉంటాయి. దీంతో ఎక్కడ ఏ పైప్‌లైన్‌కు ఎంతమేర మరమ్మతులు చేశారో తెలుసుకోవడం బ్రహ్మరహస్యమే. ఇక క్షేత్రస్థాయి అధికారులతో మిలాఖత్ అవుతున్న కాంట్రాక్టర్లు కొన్నిసార్లు భూమిలోపల జరిగే పైప్‌లైన్ లీకేజీల నివారణ, మ్యాన్‌హోల్ పునరుద్ధరణ వంటి పనులు చేయకుండానే బిల్లులు సమర్పించి బోర్డు ఖజానాకు చిల్లులు పెడుతున్నారు.  కాగితాలపై కాంట్రాక్టర్లు చూపే కాకిలెక్కలకు క్షేత్రస్థాయి మేనేజర్లు తమ వాటా దండుకొని బిల్లులను ధ్రువీకరిస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి చేరవేయడం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు అనివార్యమని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.
 
 అక్రమాలకు చెక్ ఇలా..
     నిర్వహణ పనులు చేపట్టిన ప్రతిసారి కాంట్రాక్టర్ స్థానికుల నుంచి ఈ పనులు చేసినట్టుగా విధిగా సంతకాలు తీసుకోవాలి.
     పనిని పూర్తి చేయకముందున్న పరిస్థితిని, పూర్తై తరవాత పరిస్థితిని క్షేత్రస్థాయి అధికారులు ఫొటోలు తీసి వాట్సప్‌లో అధికారులకు పంపాలి.
     నిర్వహణ, మరమ్మతు పనులు పూర్తయ్యాక విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి వాస్తవంగా పని జరిగిందీ లేనిదీ నిర్ధారిస్తారు. ఈ విషయంలో సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు.
     సామాజిక తనిఖీలో సదరు పని జరగనట్టు తేలితే సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతారు. బోర్డుకు సమర్పించిన బిల్లును తిరస్కరిస్తారు. అక్రమాలు పెద్ద ఎత్తున జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement