సికింద్రాబాద్ స్టేషన్‌లో విమానాశ్రయ తరహా పద్ధతులు
స్టేషన్‌కు రెండు వైపులా రూ.6 కోట్లతో ఆధునిక బ్యాగేజీ స్క్రీనింగ్ వ్యవస్థ ఏర్పాటు
రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్ వచ్చాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి
రైలు వచ్చే వరకు వెయిటింగ్ హాల్‌లో ఉండాల్సిందే
ప్రయాణికులు కాని వారికి ప్లాట్‌ఫామ్ వైపు నో ఎంట్రీ
వేలాదిమంది ప్రయాణికులు... ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఒకటి– పది.. ప్లాట్‌ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశద్వారాల్లో బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పని చేయదు. పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా పట్టించుకోరు.. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో... వెరసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకొంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. వెరసి ఈ స్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్ తరహాలో పటిష్టమైన భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందిన ఘనతను సాధించుకున్నది భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. కానీ, అక్కడ భారీ వ్యయంతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా.. అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు అటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
లగేజీ చెకింగ్ తర్వాతే లోనికి
సికింద్రాబాద్ స్టేషన్‌కు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెకింగ్ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు రైలు బయలుదేరే వేళ కంటే కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి విమానాశ్రయాల్లోనే ఉంటోంది. విమాన ప్రయాణికులకు లగేజీ చెకింగ్ అనేది నిర్బంధ ప్రక్రియ. అది జరక్కుంటే విమానంలోకి అనుమతి ఉండదు. అదే పద్ధతిని సికింద్రాబాద్ స్టేషన్‌లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రైలు అనౌన్స్‌మెంట్ అయ్యాకే ప్లాట్‌ఫామ్ పైకి
ప్రస్తుతం స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌పామ్‌లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతిస్తారు.
ఆలస్యంగా వస్తే అంతే
సరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్‌ఫామ్ మీదకు పరుగెత్తుకు రావటం స్టేషన్‌లలో నిత్యకృత్యం. కానీ, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఇలాంటి వారిని అనుమతించకూడదన్న యోచనలో అధికారులున్నారు. కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకునే ప్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే.
కునుకు కోసం వచ్చే వారికి ఇక నో ఎంట్రీ
ప్రయాణాలతో ప్రమేయం లేకుండా చాలా మంది చీకటిపడగానే స్టేషన్‌లోకి చేరుకుని ఏ ఖాళీ బెంచీనో చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక అలాంటి వారికి లోనికి అనుమతి ఉండదు. టికెట్ ఉన్న వారిని మాత్రమే.. రైలు వచ్చే వేళకు ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతిస్తారు. లేని వారికి నో ఎంట్రీ. వెరసి ఇక ప్లాట్‌ఫామ్ ప్రాంతాలు అడ్డదిడ్డంగా పడుకునేవారితో కనిపించవన్నమాట.
మిగతావాటి సంగతేంటి..?
ప్రపంచస్థాయి స్టేషన్‌లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. ఏపీ పరిధిలో తిరుపతి, నెల్లూరు ఉండగా, తెలంగాణలో ఒక్క సికింద్రాబాద్ మాత్రమే ఉంది. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్‌లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్‌భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇవి ఉన్న భవనాలను మెరుగు పరుస్తారు.
సికింద్రాబాద్ తరహాలో మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించరు. అమృత్‌భారత్ స్టేషన్‌లలో ఈ పద్ధతులు ఉండాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అమృత్‌భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగానే అభివృద్ధి చేస్తున్న నగరంలోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో మాత్రం సికింద్రాబాద్ తరహా విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment