
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాతి నుంచి హోమ్ గార్డెనింగ్‌పై మక్కువ పెరిగింది. ఇంట్లో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగిందనేది నిపుణుల అభిప్రాయం. తక్కువ నిర్వహణ వ్యయం హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత. ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది పెరుగుతుంది. దీని నిర్వహణకు తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది.
► మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.
► గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు.
ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి.