రాబడికి దగ్గరి దారేది! | Trading is better | Sakshi
Sakshi News home page

రాబడికి దగ్గరి దారేది!

Published Fri, Aug 14 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

రాబడికి దగ్గరి దారేది!

రాబడికి దగ్గరి దారేది!

♦ గృహశోభ ఉట్టిపడాలంటే రోజూ గార్డెనింగ్‌కు సమయాన్ని కేటాయించాలి.
♦ మొక్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను గుర్తించాలి. వాతావరణ  పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
♦ పూల మొక్కలు పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్‌లో పెంచుకోవచ్చు.
 
 నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి.. మనలో చాలా మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల గురించి పెద్దగా తెలియకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఫ్లాటా.. ప్లాటా లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేంట్లో పెట్టుబడులు పెడితే మంచి ఆదాయమొస్తుందనే అంశంపై ఈ వారం సాక్షి రియల్టీ ప్రత్యేక కథనం.    
 - సాక్షి, హైదరాబాద్
 
 నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. ముఖ్యంగా విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

 వాణిజ్యమే బెటర్..
 పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. ఎందుకంటే మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం.. కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చ.అ.కు రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి వస్తుంది.

ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులుంటాయి కూడా. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు సుమీ.

 మొదటిసారైతే ఇల్లే ఉత్తమం..
 మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతల వారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. ఇరవై శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది.

ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది. నివాస సముదాయాల రంగంలో ఏటా 12-15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్ట్‌ను సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. కాబట్టి, ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక... నిర్వహణ కూడా మెరుగ్గా జరపాలనే విషయం మరవొద్దు.

 కొత్త పోకడ..
 ప్రమోటర్లు స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా 8-10 శాతం సేవా రుసుము తీసుకుని.. కొనుగోలుదారులకు ‘ప్రాపర్టీ మేనేజ్‌మెంట్’ సేవల్ని అందించే సరికొత్త పోకడకు పలు నిర్మాణ సంస్థలు శ్రీకారం చుట్టాయి. అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు.

దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే.. నిర్మా ణం పూర్తయిన తొలినాళ్లలో అద్దెదారులు ఎక్కువగా రాకపోవచ్చు. ఒక ఐదారు నెలలదాకా ఈ పరిస్థితి ఉండొచ్చు. అయితే అన్నివేళలా ఇలా జరుగుతుందని కాదు. వాణిజ్య భవనమున్న స్థలాన్ని బట్టి.. ముందే అద్దెదారుల్ని స్థలాన్ని తీసుకోవచ్చు.

 ఓ కన్నేయాల్సిందే..
 నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement