ప్రతీకాత్మక చిత్రం
కాజీపేట : గతంలో ఏ పల్లెకు వెళ్లినా పచ్చదనం ఉట్టిపడుతుండేది. అటు పల్లెలతో పాటు ఇటు పట్టణాల్లో సైతం రహదారులు, ప్రధాన కూడళ్లు, ఇళ్లలో సైతం పలు రకాల మొక్కలు కనువిందు చేస్తుండేవి. అయితే పట్టణీకరణ, అధునాతన సౌకర్యాల కల్పన, రహదారుల విస్తరణతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కల పెంపకం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొంత మందికి మొక్కలు పెంచేందుకు సరిపడా స్థలాలు ఉన్నా.. అవగాహన, గైడెన్స్ లేకపోవడంతో మొక్కలు పెంచలేకపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం టెక్నాలజీ పలు రకాల అవకాశాలను కల్పిస్తోంది. ఎక్స్‌క్లూజివ్‌గా మొక్కల పెంపకం కోసమే పలు యాప్‌లు అందుబాటులోకి కూడా వచ్చాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అనేక యాప్‌లు మొక్కల పెంపకం కోసం మనల్ని గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మొక్కల పెంపకం ఓ కళ...
ఇంటి ఆవరణలో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పెంచడం అనేది ఒక అందమైన కళ. అలాంటి వాటిపై ఆసక్తి ఉన్న వారి కోసమే స్మార్ట్ ఫోన్‌లో పలు యాప్‌లు తీర్చిదిద్దబడ్డాయి. ఏ కాలంలో ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎటువం టి మట్టిని ఎంపిక చేసుకోవాలి.. కృత్రిమ, సేంద్రీయ ఎరువులను ఎలా అందించాలి.. తదితర సమాచారాలను ఈ యాప్‌లు సమగ్రంగా వివరిస్తున్నాయి.
గార్డెన్ టిప్స్ యాప్...
కుండీల్లో పెంచుకునే మొక్కల వివరాలు గురించి ఎక్కువగా ఈ యాప్‌లో తెల్సుకునే వీలుంది. ఇంట్లో ఉండే కీటకాలు, బొద్దింకలు, ఈగలు, దోమలను తరిమికొట్టేందుకు ఎలాంటి మొక్కలను పెంచుకోవాలనే అంశాలను ఈ యాప్‌లో పొందుపరిచారు.
రోస్ గార్డెన్ యాప్...
ప్రత్యేకంగా గులాబీ మొక్కలను పెంచుకునే విధానం, అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలిపే యాప్ ఇది. అందుబాటులో ఉన్న మట్టికి అనుగుణంగా ఎటువంటి రోజా మొక్కలు వేసుకోవచ్చు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందమైన రోస్ గార్డెన్ తయారవుతుంది అనే అంశాలను వివరంగా పొందుపరిచారు. పువ్వులు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు ఎలాంటి పద్ధతులు అవలంభించాలో అనే అంశాలు కూడా ఉన్నాయి.
వెజిటబుల్ పాట్ గార్డెనింగ్...
ఇంటి ఆవరణలో కుండీల్లో పలు రకాల కూరగాయల మొక్కలను పెంచుకోవడానికి అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఎటువంటి కుండీలు వినియోగించాలి.. మట్టి రకాలు.. ఏయే కూరగాయలు పెంచుకోవచ్చనే విషయాలు సమగ్రంగా ఉంటాయి.
ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని.. మొక్కల పెంపకాన్ని ప్రారంభించండి..హోమ్ గార్డెనింగ్ యాప్...పెరట్లో కూరగాయలు, ఇంటి ఆవరణలో అందాన్ని ఇచ్చే మొక్కలు పెంపకానికి సంబంధించిన యాప్ ఇది. విత్తనాలు ఎలా ఎంచుకోవాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలన్న ఏడు అంశాలతో కూడిన వివరాలను ఈ యాప్‌లో పొందుపర్చారు.
ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎంత విస్తీర్ణంలో నాటుకోవాలి.. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను ఎలా నాటుకోవచ్చో ఇందులో వివరంగా ఉంటుంది. ఈ యాప్‌లో వీడియోల ద్వారా అవగాహన పెంచుకునే అవకాశం కూడా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment