తోటపని ఆందోళనను దూరం చేస్తుంది.తోటపని ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తోటపని ఏకాగ్రతకు దారి చూపుతుంది.తోటపని ఆరోగ్యాన్నిఇస్తుంది.తోటపని సంతృప్తినీ, సంతోషాన్నీ మూట గట్టి ఇస్తుంది. విశాఖపట్నం వాసి మాధవి గుత్తికొండ పదేళ్లుగా చేస్తున్న డాబాగార్డెన్ ఐదేళ్లుగా ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో యూ ట్యూబ్ ద్వారా కూరగాయల పెంపకాన్నీ ప్రోత్సహిస్తోంది. లక్షలాది వ్యూవర్స్‌కి తనదైన వాణీ వినిపిస్తోంది.
ఇంటికి అవసరమైన కూరగాయల సాగును సొంతంగా తామే ఎలా సాగు చేసుకోవచ్చో చిన్న చిన్న సూచనల ద్వారా వ్యూవర్స్‌ని ఆకట్టుకుంటోంది మాధవి గుత్తికొండ. సాగులో మెలకువలను చెబుతూ నెటిజనులను ప్రోత్సహిస్తున్న మాధవి తాను చేస్తున్న పని గురించి చెబుతూ... ‘‘తోటపని నాకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిరుచి. కుండీల్లో మొక్కలు పెంచేదాన్ని. ఇండోర్, ఔట్‌డోర్ డెకొరేటివ్ మొక్కల పెంపకాన్ని ఇష్టంగా చేసేదాన్ని. పెళ్లి, పిల్లల బాధ్యతల నడుమ రోజులు గడుస్తున్నప్పటికీ మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదు. పదేళ్ల కిందట సొంతంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగుచేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలకు వెళుతున్నారు. నాకు కాస్త తీరిక దొరికింది. దీంతో మేడ పైన కూడా మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకం చేసేదాన్ని.
ఒత్తిడి నుంచి విశ్రాంతి వైపు..
పిల్లలు మేడ పైన చదువుకునేటప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనీ నాతోపాటు వాళ్లూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టారు.
ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్
మా పిల్లలు, వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూ ట్యూబ్‌లో గార్డెన్‌కి సంబంధించిన ఛానెల్స్ సెర్చ్ చేశాను. తెలుగులో ఏవీ కనిపించలేదు. దాంతో నేనే చానెల్ మొదలుపెట్టాను.
ఫోన్‌తోనే షూట్..
ఏ సీజన్‌లో ఏ విత్తనాలు, మట్టి రకాలు, ఎరువు, నీళ్లు ఎంతలా పెట్టాలి.. ఇలా అన్ని సూచనలతో ఫోన్‌లోనే గార్డెనింగ్‌కు సంబంధించిన వన్నీ షూట్ చేస్తుంటాను. తీసిన వీడియోలను మొదట్లో పిల్లలే ఎడిట్ చేసేవారు. ఇప్పుడు నేనే స్వయంగా ఛానెల్ వర్క్ కూడా చేస్తున్నాను.
కాలక్షేపం... పేరు, ఆనందం
టైమ్ పాస్‌కు మొదలుపెట్టిన ఈ తోట పని ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పిల్లలు కూడా కాస్త టైమ్ దొరికితే చాలు తోట పనిలోకి వచ్చేస్తున్నారు. మేం బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా, వాటిని తీసుకురావడం మొదలైంది.
బంగాళదుంప.. పసుపు
నేను ప్రయత్నించని సాగు అంటూ లేదు. బీర, సొరకాయలు, పచ్చిమిరప నాలుగైదు రకాలు, టొమాటో నాలుగు రకాలు, మునగ.. బంగాళదుంపల సాగు కూడా చేశాను. వెల్లుల్లి ట్రై చేశాను. పసుపు కొమ్ములూ పండించాను. అరటిమొక్కలు పెంచుతున్నాం. వీటి పనిలో సాయంగా ఉండటానికి ఒక హెల్పర్‌ని పెట్టుకున్నాను.
ఘనమైన రుచి.. ఆరోగ్యం..
ఖర్చు గురించి ఆలోచన లేదు. ఎందుకంటే, ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. మా అవసరాలకు మించిన కూరగాయలను చుట్టుపక్కలవాళ్లకు, బంధువులకు కూడా పంపిస్తుంటాను. కాలానుగుణంగా మూడు నెలలకు ఒకసారి పంటసాగు పని ఉంటుంది.
ఇప్పటికి నాలుగు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ముందు నుంచీ ఛానెల్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయినవారున్నారు. కొత్తగా జాయినైనవారున్నారు. మా ఛానెల్ ద్వారా మిద్దె తోట గురించి తెలిసినవారు, సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లు కూడా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని మాకు పంపించేవారు, లేదా ఆ వీడియోలు షేర్ చేసేవారు ఉంటారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. కొంతమందైనా స్ఫూర్తిగా తీసుకొని కూరగాయల సాగు చేయడం సంతోషాన్ని ఇస్తుంటుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆ ఆనందం తెలియదు. ఇప్పుడు మా ఇంటిపైన కాసే కూరగాయలతో వంటలు కూడా చేసి, వాటిని పోస్ట్ చేస్తుంటాను. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంతో ఇంతో ఆదాయమూ వస్తోంది’’ అని ఆనందంగా వివరించారు మిద్దె తోటల మాధవి.
– నిర్మలారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment