Mining officers
-
రాగానే మింగేశారు..'ఇసుక బకాసురులు'
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు.. అది మామూలు భోజనం కాదు.. ఇసుక భోజనం.. ఇసుకనెలా తింటారు.. దానిని ఎలా అరిగించుకుంటారా.. అని ఆశ్చర్యపోకండి. ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను ఆరగించారు. ఇసుకను భోంచేయడం అంటే.. ఎక్కడికక్కడ డిమాండ్‌ను బట్టి అడ్డంగా అమ్మేసుకోవడం అన్నమాట.. ఆ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు. స్టాక్ యార్డుల వద్దకెళ్లి ఇసుక కాంట్రాక్టు సంస్థల సిబ్బందిని బెదిరించి తరిమేశారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను వెళ్లగొట్టి అప్పటికప్పుడు స్టాక్ యార్డులను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆ నిల్వలపై పడి ఇసుకను రాత్రింబవళ్లు తరలించేశారు. 5 వారాల తర్వాత తాపీగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన మైనింగ్ అధికారులు స్టాక్ యార్డుల వద్ద నిల్వలు మాయమైనట్లు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు వారి లెక్కల ప్రకారం సుమారు 98 స్టాక్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక మాత్రమే నిల్వ ఉంది. అంటే 70కిపైగా ఇసుక యార్డుల్లో ఇసుక నిల్వలను తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. 70 స్టాక్ యార్డులు ఖాళీ తూర్పు గోదావరి జిల్లా చిడిపి స్టాక్ యార్డుల్లో ఎన్నికలకు ముందు 1.81 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయగా ఇప్పుడు మైనింగ్ అధికారుల లెక్క ప్రకారం 35 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. 1.46 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. నిడదవోలు నియోజకవర్గంలోని పందలపర్రు, ఊసులమర్రు, పెండ్యాల స్టాక్ యార్డుల్లోనూ లక్షన్నర టన్నుల ఇసుకను పచ్చ ముఠాలు మింగేశాయి. రాజమహేంద్రవరం రూరల్ లాలా చెరువు యార్డులో 1.40 లక్షల టన్నుల ఇసుకను మాయం చేసి నామమాత్రంగా 7,500 టన్నుల ఇసుకను అమ్మకానికి పెట్టారు. నెల్లూరు జిల్లా పల్లిపాడు స్టాక్ యార్డులో 2.20 లక్షల టన్నుల ఇసుకకుగానూ 1.25 లక్షల టన్నులు మాత్రమే మిగిలింది. కొన్నిచోట్ల అసలు ఇసుక నిల్వలే లేకుండా చేసేశారు. కృష్ణా జిల్లా అప్పారావుపేట, లంకపల్లి, తోట్లవల్లూరు స్టాక్ పాయింట్లను పూర్తిగా ఎత్తివేశారు. ఎన్నికలకు ముందు అక్కడ లక్ష టన్నులకుపైగా ఇసుక ఉండగా మొత్తం కరిగించేశారు. ఇలా సుమారు 70 స్టాక్ యార్డుల్లో ఇసుక రేణువు లేకుండాపోయింది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్‌లు ఉన్నా స్టాక్‌యార్డులో మాత్రం ఇసుక లేకుండాపోయింది. దీంతో స్థానికులు సుదూరం ప్రాంతాలకు వెళ్లి ఇసుకను కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.గోదావరిని గుల్ల చేసి..రాష్ట్రంలో రీచ్‌లు ఉన్నచోటల్లా టీడీపీ, జనసేన నేతలు అక్రమంగా ఇసుకను తరలించుకుపోయారు. ఓవైపు గోదావరిలో తవ్వకాలపై నిషేధం కొనసాగుతున్నా గుల్ల చేసేశారు. నిల్వలన్నీ దాదాపుగా ఇప్పటికే ఊడ్చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటిని మాయం చేసి ఇసుక ర్యాంపుల్లో గుట్టుచప్పుడు కాకుండా అనధికారిక తవ్వకాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 11 ఇసుక రీచ్‌లలో నామమాత్రంగానే ఇసుక ఉంది. మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో పందలపర్రు, కానూరు, పెండ్యాల, తీపర్రు ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న గుట్టలను తరలించేశారు. రాజమహేంద్రవరం రూరల్ గాయత్రి ర్యాంపులో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచరుడు, మండపేటకు చెందిన ఓ జనసేన నేత కోట్ల విలువ చేసే ఇసుక నిల్వలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. కాతేరు ఇసుక ర్యాంపుల్లో ఎమ్మెల్యే అనుచరుడు దగ్గరుండి వ్యవహారం నడుపుతున్నాడు. కడియపులంక, వేమగిరి ర్యాంపుల్లో రాత్రిళ్లు వందల ట్రాక్టర్లు, లారీల ఇసుక తరలిపోతోంది. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక వద్ద అనధికారిక స్టాక్ పాయింట్ నుంచి 10 రోజుల క్రితం ఇసుకను భారీగా లారీల్లో తరలించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెంలో జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన రెండు స్టాక్ పాయింట్ల నుంచి భారీగా ఇసుకను తరలించారు. ఆత్రేయపురం మండలం పులిదిండిలో రాత్రి వేళల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు రంగం సిద్ధమైంది. కపిలేశ్వరపురం, తాతపూడిలోనూ భారీగా ఇసుకను కొల్లగొట్టారు. బాలయ్య ఇలాకాలో యథేచ్ఛగా..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు చిలమత్తూరు మండల పరిధిలో చిత్రావతి నది నుంచి రోజూ భారీఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కర్ణాటకకు సైతం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొడికొండ, కోడూరు, మరువకొత్తపల్లి, లాలేపల్లి, దిగువపల్లి తండా సమీపంలోని చిత్రావతి నదిలో ఇసుక మేటలపైనా టీడీపీ నేతల కన్ను పడింది. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో జేసీబీలను వినియోగించి ఇసుక తోడేస్తున్నారు. బత్తలపల్లి మండలం నల్లబోయలపల్లి వద్ద నిల్వ ఉంచిన ఇసుకను ఇటీవల అక్రమంగా తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కడనూతల, నరసింహపురం, వెంకటాచలం, మర్రిపాడు, నెల్లూరుపాళెం, సంగం వద్ద ఇసుక డిపోలలో లక్షల టన్నుల ఇసుకను గతంలో నిల్వ చేయగా ప్రస్తుతం దాదాపుగా అడుగంటాయి.సీఎం రమేశ్, ఆది వర్గీయుల పోటాపోటీ..వైఎస్సార్ జిల్లాలోని 11 స్టాకు పాయింట్లలో లక్షలాది టన్నులను టీడీపీ నేతలు అక్రమంగా తరలించేశారు. పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదుల నుంచి గత రెండు వారాలుగా లక్షలాది టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. హనుమాన్‌గుత్తి వద్ద పెన్నాలో అక్రమంగా రోడ్డు ఏర్పాటు చేసి ఎంపీ సీఎం రమేశ్ వర్గీయులు ఇసుక తరలిస్తున్నారు. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పోటీపోటీగా పొక్లెయిన్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక టిప్పర్ల ధాటికి గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ యార్డులో నిల్వ చేసిన దాదాపు రెండు వేల టన్నుల కట్టుబడి ఇసుకను సైతం టీడీపీ నేతలు తరలించేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం స్టాక్ పాయింట్ వద్ద భారీ పరిమాణంలో ఇసుకను టీడీపీ నేతలు మాయం చేశారు. కంకిపాడు మండలం మద్దూరు వద్ద వందలాది వాహనాల్లో ఇసుకను తరలించేశారు. ఎన్టీఆర్ జిల్లా మోగులూరులోని ఇసుక నిల్వలు కూడా మాయమయ్యాయి.ఉత్తరాంధ్రలో నిరాటంకంగా చోరీ విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద నుంచి భారీగా తరలించారు. విశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు లక్షలాది టన్నుల ఇసుకను తరలించేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో, నక్కపల్లి ఇసుక డిపో వద్ద నుంచి పెద్ద పరిమాణంలో ఇసుకను తరలించారు. బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు జువ్వలపాలెం పాయింట్ నుంచి అందినకాడికి అమ్ముకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది టన్నుల ఇసుకను టీడీపీ నేతలు కరిగించేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో వంశధార నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. రాజమార్గంలో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వంశధారలో రోజూ అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లేనే వేలాది లారీల్లో ఇసుకను తరలించారు. -
రాష్ట్రంలో రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా
-
‘ఇసుక సరఫరాపై బాధ్యత జాయింట్ కలెక్టర్లదే’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో నూతన ఇసుక పాలసీపై శనివారం సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్క్ షాప్ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని, దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా వరద పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు సమర్పిస్తున్నారని, తక్షణం ఈ దరఖాస్తులను ఆమోదించి.. ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని మంత్రి పెద్డిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఇసుక సరఫరాపై జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. రీచ్ లకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్లను గుర్తించాలని, ఓపెన్ రీచ్‌లో వరద పరిస్థితి కారణంగా ఇసుక తవ్వకాలు చేయలేకపోతున్నామని అన్నారు. గత మూడు నెలలుగా కృష్ణానదిలో వరద పరిస్థితి కొనసాగుతోందని, జలాశయాల్లో, స్థానిక జలవనరుల్లో మేటవేసిన ఇసుక నిల్వలలను గుర్తించాలని, వీటిని బయటకు తీయడం వల్ల జలాశయాల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుండటంతోపాటు ఇసుక సరఫరా మెరుగవుతుందని మంత్రి తెలిపారు. మెదటి, రెండు, మూడు గ్రేడ్ లలోని రీచ్‌లలో ట్రాక్టర్లకు అనుమతి ఇస్తామని, గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్‌లవద్ద పెట్టి ఆన్లైన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. మైనింగ్ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సమన్వయం చేసుకోవాలని, ఇసుక లభ్యత వున్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న సంబంధిత జిల్లా వాసులకు కొంత వరకు ఇసుకను రిజర్వు చేయాలని, ఇసుక అవసరాల కోసం ఆన్లైన్ లో వస్తున్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. -
బంగారం, వజ్రాల కోసం.. వేట
ఖనిజ ఆదాయంలో దేశంలోనే మూడోస్థానంలో ఉన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో భూగర్భ వనరుల సంపూర్ణ సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది. ఆదాయ పెంపుదలకు బొగ్గు, యురేనియం, సున్నపురాయి, మాంగనీసు, ఇనుము తదితర ఖనిజాలతోపాటు ఇతర ఖనిజాలను వెలికితీయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ మైనింగ్ సంస్థ (ఎన్ఎండీసీ) సహకారంతో బంగారం, వజ్రపు నిల్వల అన్వేషణ, వెలికితీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. వజ్రాల జాడపై ఎన్ఎండీసీ ద్వారా సూర్యాపేట జిల్లాలో ఇదివరకే ప్రాథమిక సర్వే చేయించింది. మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వజ్రాల జాడ కోసం అన్వేషణ ప్రారంభించాలని ప్రతిపాదించింది. బంగారం, వజ్రాల వెలికితీత కోసం కొన్ని ప్రాంతాలను ఎన్ఎండీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సహకారంతో గద్వాల జిల్లాలో బంగారం, వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో తగరం నిల్వల అన్వేషణ, వెలికితీత చేపట్టేందుకు గనులశాఖ సిద్ధమవుతోంది. టూరింగ్ స్పాట్స్‌గా... ఖనిజాల వెలికితీత తర్వాత ఏర్పడుతున్న భారీ గుంతలను టూరిజం కేంద్రాలుగా మార్చాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ ప్రతిపాదిస్తోంది. చైనాలోని షాంఘై, రొమేనియా, పోలాండ్లోని పోర్ట్లాండ్ తరహాలో మైనింగ్ గుంతల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, బోటింగ్ వంటి వాటిని ఎకో టూరిజంలో భాగంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా షూటింగ్ స్పాట్లు, చేపల పెంపకం, సాగు, తాగునీటి వనరులుగా కూడా ఈ గుంతలను ఉపయోగించేలా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నట్లు మైనింగ్ అధికారులు చెప్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
తెలుగు తమ్ముళ్లకు షాక్
అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో ఫైన్ రూ.98లక్షలు చెల్లించాలంటూ టీసులు జారీ కంగుతిన్న అధికార పార్టీ నాయకులు మినహాయింపునకు రాజకీయ పైరవీలు నక్కపల్లి: అధికార పక్ష నాయకుల అండతో జిరాయితీ భూములను లీజుకు తీసుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి రూ. కోట్లు ఆర్జించిన కొందరికి, రైతులకు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 98 లక్షలు జరిమానా విధించడానికి నిర్ణయించారు. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రాథమికంగా వీరందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, తదుపరి డిమాండ్ నోటీసులు ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేస్తామని అనకాపల్లి మైనింగ్ ఏడీ సూర్యచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. పాయకరావుపేట మండలంలోని మాసయ్యపేట, కేశవరం గ్రామాల్లో 4900 క్యూబిక్ మీటర్ల ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తవ్వినట్టు గుర్తించామని తెలిపారు. ఊహించని పరిణామానికి తెలుగుతమ్ముళ్లు షాక్ తిన్నారు. ఇసుకాసురుల అవతారమెత్తిన వీరంతా పరిహారం చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదయి జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం ఇక్కడ జోరందుకుంది. పాయకరావుపేటమండలం మాసయ్యపేట, కేశవరం గ్రామాల పరిధిలో కొందరు టీడీపీ నాయకులు తమ పొలాలకు ఆనుకుని ఉన్న రైతులకు చెందిన జిరాయతీ భూములను లీజుకు తీసుకున్నారు. గతంలో వచ్చిన తుఫాన్లు, భారీ వర్షాలకు ఈ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇసుకను ఉచితంగా తవ్వుకోవచ్చన్న సర్కారు ఆదేశాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. పొక్లెయినర్ల సాయంతో రోజూ లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను తవ్వి లారీలు, ట్రాక్టర్లపై ఇతర జిల్లాలకు తరలించి విక్రయించారు. రూ.కోట్లు ఆర్జించారు. తమవైపు అధికారులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు వారంతా నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరితోపాటు, అతని అనుచరులకు రూ. లక్షలు సమర్పించుకున్నారన్న వాదన ఉంది. ఇలా మేనేజ్ చేసే బాధ్యతను తీసుకున్న వ్యక్తి, ఇసుక తవ్వకాలు జరిపే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ నేత ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. జిరాయితీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీకే చెందిన మరోవర్గం నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పదిహేను రోజుల క్రితం రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టి సుమారు రూ.4కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తర లిపోయిందని నిర్ధారించారు. తవ్వకాల కోసం వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అది తునిపట్ణాణానికి చెందిన వ్యక్తిది కావడంతో, అతను తన పలుకుబడిని ఉపయోగించి సీజ్ చేసిన పొక్లెయినర్‌ను దౌర్జన్యంగా పట్టుకుపోయాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతనిపై నామమాత్రంగా ఫిర్యాదు చేసి ఊరుకున్నారే తప్ప ఇంతవరకు దానిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు. యజమానిపై చర్యలు చేపట్టలేదు. దాడుల్లో గుర్తించిన మేరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపిన తొమ్మిది మందికి మైనింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అపరాధ రుసుం కింద రూ.98లక్షలు చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మొత్తం నుంచి మినహాయింపు ఇవ్వాలని కొందరు నాయకులు రాజకీయ పైరవీలు చేస్తున్నట్లు భోగట్టా. దాడులు జరగకుండా చూస్తామని హమీ ఇచ్చిన అధికారపార్టీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో లీజుకని తీసుకుని తమకు తెలియకుండా టీడీపీ నాయకులు తమ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపారని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చేయని తప్పుకు తమకు నోటీసులు జారీ చేయడం భావ్యం కాదని అంటున్నారు. -
ఇసుక ట్రాక్టర్లు సీజ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కత్లాపూర్ మండలం సిరికొండ శివారులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు మైనింగ్ ఏడీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. -
మైనింగ్ అధికారులకు పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయించిన రాష్ట్రస్థాయి అధికారులకు పోస్టింగ్ ఇస్తూ మైనింగ్ విభాగం డెరైక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మైనింగ్ విభాగం నిజామాబాద్ డిప్యూటీ డెరైక్టర్‌గా బి.భగవంతరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్‌నగర్ ఏడీ (విజిలెన్స్)గా జి.నరసింహాచారి, మెదక్ ఏడీగా ఎం.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ ఏడీగా కె.రామచంద్రయ్య, సంగారెడ్డి విజిలెన్స్ ఏడీగా ఎస్.సాంబయ్య నియమితులయ్యారు. గతంలో ఈ స్థానాల్లో పనిచేసిన మైనింగ్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. -
అక్రమ దందా!
జిల్లాలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం ప్రభుత్వ నిబంధనలను ఆసరాగా చేసుకుని రూ.లక్షలు దండుకుంటున్న వైనం లారీకి రూ.8,100 చొప్పున ప్రభుత్వానికి కట్టి రూ.18వేలకు అమ్మకం హాలియా ఇసుక డంప్‌ల విక్రయాల్లో పెద్దఎత్తున అక్రమాలు ఇద్దరు కాంట్రాక్టర్ల నేతృత్వంలోనే వ్యాపారమంతా రూ. కోటిన్నర వరకు డీడీలు తీసి యథేచ్ఛగా అ‘క్రమ’ రవాణా కలెక్టర్ దృష్టికి విషయం.. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్రమం చట్టబద్ధమైంది... దుర్వినియోగమవుతున్న లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రక్షించేందుకు పాలకులు రూపొందించిన నిబంధనలు జిల్లాలోని ఇసుక కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. ఇన్నాళ్లు దొంగచాటుగా చేసిన వ్యాపారాన్ని ఇప్పుడు బాజాప్తుగా గల్లా ఎగరేసి చేసుకుంటూ అవే లక్షలు మళ్లీ దండుకుంటున్నారు ఇసుకాసురులు. ఇందుకు మైనింగ్ అధికారుల అండదండలూ ఉండడంతో బహిరంగంగానే వారు లారీకి రూ.10వేలకు పైగా లాభాన్ని ఆర్జిస్తూ ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు ఇసుకను కొట్టేసి ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముతున్న ఈ తతంగమంతా హాలియా పరిసరాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దందా విషయం కలెక్టర్ సత్య నారాయణరెడ్డి దృష్టికి వెళ్లింది. కేవలం ఇద్దరు కాంట్రాక్టర్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ అక్రమ దందా గురించి ‘సాక్షి’ ఫోకస్... కాసుల పంటకు ని‘బంధ’నాలా? వాస్తవానికి గతంలో జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు లారీలుగా వర్ధిల్లింది. ఇసుక వ్యాపారులకు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు అధికారంలో ఉన్న వారూ అండగా ఉండడంతో చాలా ఏళ్లుగా ఈ వ్యాపారం అక్రమంగా జరుగుతూనే ఉంది. అయితే, ఈ ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం గతంలో అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో సీజ్ చేసిన ఇసుకను అవసరమైన వారు కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కి డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. అలా తీసిన వారికి ప్రభుత్వ అధికారులే ఇసుకను అందజేస్తారు. అయితే, అవసరాన్ని బట్టి ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు వ్యక్తులు డీడీలు తీసి ఇసుకను తీసుకోవచ్చు. ఈ నిబంధన మేరకు ఇసుక అందుబాటులో ఉన్నదని జిల్లా కలెక్టర్ ప్రకటించిన తర్వాత మొదట ప్రభుత్వ శాఖలకు అవకాశం ఇస్తారు. కలెక్టర్ చెప్పిన 48 గంటల్లోపు అందుబాటులో ఉన్న ఇసుకలో ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసిన ఇసుక పోను మిగిలిన దానిని ప్రైవేటు వ్యక్తులకు కూడా అమ్మవచ్చు. ఈ నిబంధనను జిల్లాలోని హాలియా ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. డీడీ అయితే చెల్లిస్తున్నాం కదా... చట్టబద్ధంగానే ఇసుకను తీసుకెళ్తున్నాం కదా.. అని కొంగొత్త అ‘క్రమ’ దందాకు తెర తీశారు. సీజ్ చేసిన ఇసుక ‘స్వీప్’ చేస్తున్నారు హాలియా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం గత ఏడాది అప్రతిహతంగా కొనసాగింది. వందల మంది ఇసుక వ్యాపారంపై దృష్టి పెట్టి అందినంతా దండుకున్నారు. అయితే, హాలియా నుంచి కుపాసుపల్లి, పులిమామిడి వరకు రోడ్డుకిరువైపులా పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుకరాశులు పోసి అక్రమంగా తరలించారు. ఇందుకు అక్కడి ప్రభుత్వ అధికారులు కూడా సహకరించారు. అయితే, ఈ ఇసుకను ప్రభుత్వం సీజ్ చేసింది. మొత్తం 77,650 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఈ ప్రాంతంలో ప్రభుత్వం సీజ్ చేసింది. కానీ, సీజ్ చేసిన ఇసుకను ఎక్కడ పోసి ఉందో అక్కడే ఉంచింది. దీంతో ఇసుకాసురులు రాత్రివేళల్లో ప్రభుత్వం కళ్లు గప్పి ఇసుకను తరలించేవారు. కానీ, నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వీరి పంథా మారింది. దొంగతనంగా ఇసుకను ఎందుకు తీసుకెళ్లాలి... ప్రభుత్వమే అవకాశం కల్పించింది కదా అని... అక్కడ ఉన్న వ్యాపారులు కొందరు జట్టు కట్టారు. ఇద్దరు పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్ల నేతృత్వంలో అక్కడ ఉన్న ఇసుకనంతా తెగనమ్ముకునే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే దాదాపు రూ. కోటిన్నర వరకు వ్యాపారులే డీడీలు తీసి ఇసుకను యథేచ్ఛగా తీసుకెళుతున్నారు. ప్రభుత్వ రేటుకు వీరి రేటుకు పొంతన లేదు వాస్తవానికి ఎవరైనా ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున చెల్లించి ఇసుకను తీసుకెళ్లవచ్చు.. కానీ దానిని అవసరాల మేరకే వినియోగించుకోవాలి కానీ వ్యాపారం చేయకూడదు. అయితే, వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదు కదా అనే ఆలోచనతో ఇసుక కాంట్రాక్టర్లు దీనిని వ్యాపార సూత్రంగా మార్చుకున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లే లారీకి రూ.8,100 (క్యూబిక్‌మీటర్ రూ.600 చొప్పున 13.5 క్యూబిక్‌మీటర్లకు ఓ లారీ) చొప్పున డీడీ ప్రభుత్వానికి చెల్లించి ఆ లారీని రూ.18వేలకు అమ్ముకుంటున్నారు. అంటే ఒక్కో లారీపై రూ.10వేలు అదనపు లాభమన్నమాట. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న 77వేలకు పైగా క్యూబిక్‌మీటర్లు ఇసుక 5800 లారీల వరకు అవుతుంది. లారీకి 10వేల చొప్పున ఈ ఇసుకను అమ్ముకుంటే వ్యాపారులకు మిగిలేదెంతో తెలుసా...దాదాపు రూ.6 కోట్ల రూపాయలు. అయితే... ఇక్కడ ఇంకో వాస్తవం గమనించాల్సి ఉంది... ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ సీజ్ చేసిన ఇసుక 77వేల క్యూబిక్‌మీటర్లే కానీ అక్కడ ఉన్న ఇసుక దాదాపు లక్ష క్యూబిక్మీటర్లకుపైమాటే. ఒక వ్యాపారి వద్ద సుమారు 70వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను సీజ్ చేయగా, దానిని రికార్డుల్లో చూపించింది మాత్రం 13,500 క్యూబిక్ మీటర్లేననే ఆరోపణలున్నాయి. అంటే ఈ లెక్కన ఎంత ఇసుక అక్కడ అక్రమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్నంతా లెక్కకడితే ఒక్క హాలియా ప్రాంతంలోనే దాదాపు రూ.10 కోట్ల మేర ఇసుకాసురులకు లాభం రానుంది. అదే మేర ప్రజలపై భారం పడనుంది. అయితే, ఉదయం నుంచి సాయంత్రం పనిగంటలను ఫిక్స్ చేసి ఆ సమయంలోనే ఇసుకను తీసుకెళ్లాలన్న నిబంధన ఇక్కడ అమలుకావడం లేదు. లారీకి ఎంత తరలించాలో అంతకన్నా ఎక్కువ తీసుకెళుతున్నా మైనింగ్ అధికారులు కిమ్మనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇసుకను తరలించాలన్న నిబంధన కూడా తుంగలో తొక్కారు. దీంతో ఇసుక కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన ఇసుకను విక్రయిస్తామని అధికారులు చెపుతున్నా ఇద్దరు కాంట్రాక్టర్లే అత్యధికంగా ఇసుకను తీసుకెళ్లేందుకు ఎలా ముందుకొచ్చారన్నదానికి మాత్రం సమాధానం లేదు. వేరే వాళ్లు వస్తే బెదిరింపులే.. అయితే, ఇక్కడ సీజ్ చేసిన ఇసుక ను ఎవరైనా కొనుగోలు చేసి తీసుకెళ్లవచ్చు కానీ ఈ కాంట్రాక్టర్లకు తెలియకుండా ఎవైరె నా డీడీలు తీసి వస్తే వారిని బెదిరించి వెళ్లగొడతారు. అది ప్రభుత్వ సంస్థ అయినా... ప్రైవేటు వ్యక్తులయినా. వాస్తవానికి ఈ ఇసుక తమకు అవసరం ఉందని హైదరాబాద్ వాటర్‌వర్క్స్ అధికారులు 5000 క్యూబిక్‌మీటర్లకు డీడీలు తీసి ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నించారు. అయితే, కాంట్రాక్టర్ల బెదిరింపుల కారణంగా వీరు అతికష్టం మీద ఆ ఇసుకను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఇంకా అవసరం ఉన్నా వాటర్‌వర్క్స్ అధికారులు ఈ ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదంటే అక్కడి దందా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ ఇసుక తరలింపు విషయమై జిల్లా మైనింగ్ ఏడీ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఇసుక కోసం ఇప్పటి వరకు 29 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో ఆరు ప్రభుత్వ శాఖల నుంచి, మరో 23 ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చాయని, ఇప్పటి వరకు 22,150 క్యూబిక్ మీటర్ల ఇసుక కోసం 1.34 కోట్ల రూపాయల డీడీలు వచ్చాయని వెల్లడించారు. -
ఆ గనులు ‘పశ్చిమ’కే
కుకునూరు : రాష్ట్ర విభజనకు ముందు ఖమ్మం జిల్లా పరిధిలో గల కుకునూరు మండలంలోని గనులు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చాయి. అతి విలువైన ఇనుపరాయి, అందమైన స్ఫటిక (క్వార్జ్) నిల్వలు కుకునూరు మండలంలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల విలీనం నేపథ్యంలో విలువైన రాతి నిక్షేపాలు ఇకపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందనున్నాయి. కుకునూరు మం డలం ఉప్పేరు పంచాయతీ పరిధిలోని ఎర్రపాడు, రెడ్డిగూడెం అడవుల్లో అణు విద్యుత్‌కు ఉపయోగపడే ఇనుపరాయి నిల్వలు అపారంగా ఉన్నాయి. బ్రిటిష్ వారు గమనించిన ఆ ఇనుప రాయిని ఇప్పటివరకు మన ప్రభుత్వాలు గాని, అధికారులు గాని గుర్తించకపోవడం గమనార్హం. 2012లో చెన్నైకి చెందిన ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చి సెంటర్, ఖమ్మం జిల్లాకు చెందిన మైనింగ్ అధికారుల సహకారంతో ఈ నిక్షేపాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేశారు. స్థానిక గిరిజనులు, అమరవరం అటవీ రేంజ్ అధికారులు అడ్డుకోవడంతో ఆ ఇనుపరాయి విలువ తెలిసింది. అతివిలువైన, అరుదైన ఆ ఇసుప రాయిని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. అందమైన తెల్లరాయి నిల్వలు కుకునూరు మండల పరిధిలోని కమ్మరిగూడెం గ్రామంలో అందమైన తెల్లరాయి (క్వార్జ్) నిల్వలు అపారంగా ఉన్నాయి. దీనిని స్ఫటిక రాయి అంటారు. కివ్వాక పంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెంలో గల ఈ తెల్లరాయి రసాయనాల తయారీలో ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం ఓ రసాయనాల పరిశ్రమకు చెందిన అక్రమార్కులు ఆ రాయిని తరలించుకుపోతుండగా గిరిజనులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇనుపరాయి, తెల్లరాయి గురించి పట్టించుకున్న వారు లేరు. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పి, గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆదివాసీ సంఘాలు ఎన్నోసార్లు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అతి విలువైన ఖనిజ సంపదను వినియోగించుకోవడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు, కుకునూరు మండలం నవ్యాంధ్ర రాష్ట్రంలో విలీనమైన నేపథ్యంలో ఆ గిరి జన గ్రామాలు ఇకపై పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ దృష్ట్యా కోట్ల విలువచేసే ఖనిజ సంపద కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందనుంది. ఆ సంపదను వెలికితీసి.. వాటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేయూలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఆ గిరిజన గ్రామాలు ఇకనైనా అభివృద్ధికి నోచుకుంటాయో, లేవో వేచి చూడాల్సిందే.