రాగానే మింగేశారు..'ఇసుక బకాసురులు' | TDP Govt Looted Sand 40 lakh tonnes in more than 70 stock yards | Sakshi
Sakshi News home page

రాగానే మింగేశారు..'ఇసుక బకాసురులు'

Published Thu, Jul 11 2024 4:02 AM | Last Updated on Thu, Jul 11 2024 9:03 AM

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఖాళీ చేస్తున్న టీడీపీ నేతలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఖాళీ చేస్తున్న టీడీపీ నేతలు

70కిపైగా స్టాక్‌ యార్డుల్లో 40 లక్షల టన్నులు మాయం

వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత ప్రభుత్వం  

5 వారాల్లోనే సగానికిపైగా విక్రయించేసిన పచ్చ ముఠాలు

ట్రక్కులు, ట్రాక్టర్లలో నింపి భారీగా వసూళ్లు

సామాన్యుల పేర్లతో బయట ప్రాంతాలకు తరలింపు 

కొత్త పథకం రాకముందే తాత్కాలికంలోనే భారీగా లూటీ

సాక్షి, అమరావతి, సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు.. అది మామూలు భోజనం కాదు.. ఇసుక భోజనం.. ఇసుకనెలా తింటారు.. దానిని ఎలా అరిగించుకుంటారా.. అని ఆశ్చర్యపోకండి. ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను ఆరగించారు. ఇసుకను భోంచేయడం అంటే.. ఎక్కడికక్కడ డిమాండ్‌ను బట్టి అడ్డంగా అమ్మేసుకోవడం అన్నమాట.. ఆ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 170 స్టాక్‌ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు. 

స్టాక్‌ యార్డుల వద్దకెళ్లి ఇసుక కాంట్రాక్టు సంస్థల సిబ్బందిని బెదిరించి తరి­మేశారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా ప్రతినిధులను వెళ్లగొట్టి అప్పటి­కప్పుడు స్టాక్‌ యార్డులను స్వాధీనం చేసుకున్నారు.  టీడీపీ నేతలు ఆ నిల్వలపై పడి ఇసుకను రాత్రింబవళ్లు తరలించేశారు. 5 వారాల తర్వాత తాపీగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన మైనింగ్‌ అధికారులు స్టాక్‌ యార్డుల వద్ద నిల్వలు మాయమైనట్లు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు వారి లెక్కల ప్రకారం సుమారు 98 స్టాక్‌ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక మాత్రమే నిల్వ ఉంది. అంటే 70కిపైగా ఇసుక యార్డుల్లో ఇసుక నిల్వలను తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు.     

70 స్టాక్‌ యార్డులు ఖాళీ 
తూర్పు గోదావరి జిల్లా చిడిపి స్టాక్‌ యార్డుల్లో ఎన్నికలకు ముందు 1.81 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయగా ఇప్పుడు మైనింగ్‌ అధికారుల లెక్క ప్రకారం 35 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉంది. 1.46 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. నిడదవోలు నియోజకవర్గంలోని పందలపర్రు, ఊసులమర్రు, పెండ్యాల స్టాక్‌ యార్డుల్లోనూ లక్షన్నర టన్నుల ఇసుకను పచ్చ ముఠాలు మింగేశాయి. రాజమహేంద్రవరం రూరల్‌ లాలా చెరువు యార్డులో 1.40 లక్షల టన్నుల ఇసుకను మాయం చేసి నామమాత్రంగా 7,500 టన్నుల ఇసుకను అమ్మకానికి పెట్టారు. 

నెల్లూరు జిల్లా పల్లిపాడు స్టాక్‌ యార్డులో 2.20 లక్షల టన్నుల ఇసుకకుగానూ 1.25 లక్షల టన్నులు మాత్రమే మిగిలింది. కొన్నిచోట్ల అసలు ఇసుక నిల్వలే లేకుండా చేసేశారు. కృష్ణా జిల్లా అప్పారావుపేట, లంకపల్లి, తోట్లవల్లూరు స్టాక్‌ పాయింట్లను పూర్తిగా ఎత్తివేశారు. ఎన్నికలకు ముందు అక్కడ లక్ష టన్నులకుపైగా ఇసుక ఉండగా మొత్తం కరిగించేశారు. ఇలా సుమారు 70 స్టాక్‌ యార్డుల్లో ఇసుక రేణువు లేకుండాపోయింది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్‌లు ఉన్నా స్టాక్‌యార్డులో మాత్రం ఇసుక లేకుండాపోయింది. దీంతో స్థానికులు సుదూరం ప్రాంతాలకు వెళ్లి ఇసుకను కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

గోదావరిని గుల్ల చేసి..
రాష్ట్రంలో రీచ్‌లు ఉన్నచోటల్లా టీడీపీ, జనసేన నేతలు అక్రమంగా ఇసుకను తరలించుకుపోయారు. ఓవైపు గోదావరిలో తవ్వకాలపై నిషేధం కొనసాగుతున్నా గుల్ల చేసేశారు. నిల్వలన్నీ దాదాపుగా ఇప్పటికే ఊడ్చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటిని మాయం చేసి ఇసుక ర్యాంపుల్లో గుట్టుచప్పుడు కాకుండా అనధికారిక తవ్వకాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 11 ఇసుక రీచ్‌లలో నామమాత్రంగానే ఇసుక ఉంది. 

మంత్రి కందుల దుర్గేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో పందలపర్రు, కానూరు, పెండ్యాల, తీపర్రు ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న గుట్టలను తరలించేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ గాయత్రి ర్యాంపులో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచరుడు, మండపేటకు చెందిన ఓ జనసేన నేత కోట్ల విలువ చేసే ఇసుక నిల్వలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. కాతేరు ఇసుక ర్యాంపుల్లో ఎమ్మెల్యే అనుచరుడు దగ్గరుండి వ్యవహారం నడుపుతున్నాడు. కడియపులంక, వేమగిరి ర్యాంపుల్లో రాత్రిళ్లు వందల ట్రాక్టర్లు, లారీల ఇసుక తరలిపోతోంది. 

కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక వద్ద అనధికారిక స్టాక్‌ పాయింట్‌ నుంచి 10 రోజుల క్రితం ఇసుకను భారీగా లారీల్లో తరలించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెంలో జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన రెండు స్టాక్‌ పాయింట్ల నుంచి భారీగా ఇసుకను తరలించారు. ఆత్రేయపురం మండలం పులిదిండిలో రాత్రి వేళల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలోని మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు రంగం సిద్ధమైంది. కపిలేశ్వరపురం, తాతపూడిలోనూ భారీగా ఇసుకను కొల్లగొట్టారు.  

బాలయ్య ఇలాకాలో యథేచ్ఛగా..
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు చిలమత్తూరు మండల పరిధిలో చిత్రావతి నది నుంచి రోజూ భారీఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కర్ణాటకకు సైతం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొడికొండ, కోడూరు, మరువకొత్తపల్లి, లాలేపల్లి, దిగువపల్లి తండా సమీపంలోని చిత్రావతి నదిలో ఇసుక మేటలపైనా టీడీపీ నేతల కన్ను పడింది. 

నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో జేసీబీలను వినియోగించి ఇసుక తోడేస్తున్నారు. బత్తలపల్లి మండలం నల్లబోయలపల్లి వద్ద నిల్వ ఉంచిన ఇసుకను ఇటీవల అక్రమంగా తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కడనూతల, నరసింహపురం, వెంకటాచలం, మర్రిపాడు, నెల్లూరుపాళెం, సంగం వద్ద ఇసుక డిపోలలో లక్షల టన్నుల ఇసుకను గతంలో నిల్వ చేయగా ప్రస్తుతం దాదాపుగా అడుగంటాయి.

సీఎం రమేశ్, ఆది వర్గీయుల పోటాపోటీ..
వైఎస్సార్‌ జిల్లాలోని 11 స్టాకు పాయింట్లలో లక్షలాది టన్నులను టీడీపీ నేతలు అక్రమంగా తరలించేశారు. పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదుల నుంచి గత రెండు వారాలుగా లక్షలాది టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. హనుమాన్‌గుత్తి వద్ద పెన్నాలో అక్రమంగా రోడ్డు ఏర్పాటు చేసి ఎంపీ సీఎం రమేశ్‌ వర్గీయులు ఇసుక తరలిస్తున్నారు. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పోటీపోటీగా పొక్లెయిన్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. 

ఇసుక టిప్పర్ల ధాటికి గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు.  ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్‌ యార్డులో నిల్వ చేసిన దాదాపు రెండు వేల టన్నుల కట్టుబడి ఇసుకను సైతం టీడీపీ నేతలు తరలించేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం స్టాక్‌ పాయింట్‌ వద్ద భారీ పరిమాణంలో ఇసుకను టీడీపీ నేతలు మాయం చేశారు. కంకిపాడు మండలం మద్దూరు వద్ద వందలాది వాహనాల్లో ఇసుకను తరలించేశారు. ఎన్టీఆర్‌ జిల్లా మోగులూరులోని ఇసుక నిల్వలు కూడా మాయమయ్యాయి.

ఉత్తరాంధ్రలో నిరాటంకంగా చోరీ 
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్ద నుంచి భారీగా తరలించారు. విశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు లక్షలాది టన్నుల ఇసుకను తరలించేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో, నక్కపల్లి ఇసుక డిపో వద్ద నుంచి పెద్ద పరిమాణంలో ఇసుకను తరలించారు. బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు జువ్వలపాలెం పాయింట్‌ నుంచి అందినకాడికి అమ్ముకున్నారు. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది టన్నుల ఇసుకను టీడీపీ నేతలు కరిగించేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో వంశధార నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. రాజమార్గంలో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వంశధారలో రోజూ అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లేనే వేలాది లారీల్లో ఇసుకను తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement