
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో నూతన ఇసుక పాలసీపై శనివారం సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్క్ షాప్ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని, దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా వరద పరిస్థితి కొనసాగుతుండటం వల్ల ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు సమర్పిస్తున్నారని, తక్షణం ఈ దరఖాస్తులను ఆమోదించి.. ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని మంత్రి పెద్డిరెడ్డి ఆదేశించారు.
అదేవిధంగా ఇసుక సరఫరాపై జాయింట్ కలెక్టర్‌లకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. రీచ్ లకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్‌లను గుర్తించాలని, ఓపెన్ రీచ్‌లో వరద పరిస్థితి కారణంగా ఇసుక తవ్వకాలు చేయలేకపోతున్నామని అన్నారు. గత మూడు నెలలుగా కృష్ణానదిలో వరద పరిస్థితి కొనసాగుతోందని, జలాశయాల్లో, స్థానిక జలవనరుల్లో మేటవేసిన ఇసుక నిల్వలలను గుర్తించాలని, వీటిని బయటకు తీయడం వల్ల జలాశయాల నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుండటంతోపాటు ఇసుక సరఫరా మెరుగవుతుందని మంత్రి తెలిపారు.
మెదటి, రెండు, మూడు గ్రేడ్ లలోని రీచ్‌లలో ట్రాక్టర్లకు అనుమతి ఇస్తామని, గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్‌లవద్ద పెట్టి ఆన్‌లైన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. మైనింగ్ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సమన్వయం చేసుకోవాలని, ఇసుక లభ్యత వున్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న సంబంధిత జిల్లా వాసులకు కొంత వరకు ఇసుకను రిజర్వు చేయాలని, ఇసుక అవసరాల కోసం ఆన్‌లైన్ లో వస్తున్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment