తెలుగు తమ్ముళ్లకు షాక్
తెలుగు తమ్ముళ్లకు షాక్
Published Sun, Oct 30 2016 11:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో ఫైన్
రూ.98లక్షలు చెల్లించాలంటూ టీసులు జారీ
కంగుతిన్న అధికార పార్టీ నాయకులు
మినహాయింపునకు రాజకీయ పైరవీలు
నక్కపల్లి: అధికార పక్ష నాయకుల అండతో జిరాయితీ భూములను లీజుకు తీసుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి రూ. కోట్లు ఆర్జించిన కొందరికి, రైతులకు మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 98 లక్షలు జరిమానా విధించడానికి నిర్ణయించారు. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రాథమికంగా వీరందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, తదుపరి డిమాండ్ నోటీసులు ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేస్తామని అనకాపల్లి మైనింగ్ ఏడీ సూర్యచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. పాయకరావుపేట మండలంలోని మాసయ్యపేట, కేశవరం గ్రామాల్లో 4900 క్యూబిక్ మీటర్ల ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తవ్వినట్టు గుర్తించామని తెలిపారు. ఊహించని పరిణామానికి తెలుగుతమ్ముళ్లు షాక్ తిన్నారు. ఇసుకాసురుల అవతారమెత్తిన వీరంతా పరిహారం చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదయి జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం ఇక్కడ జోరందుకుంది.
పాయకరావుపేటమండలం మాసయ్యపేట, కేశవరం గ్రామాల పరిధిలో కొందరు టీడీపీ నాయకులు తమ పొలాలకు ఆనుకుని ఉన్న రైతులకు చెందిన జిరాయతీ భూములను లీజుకు తీసుకున్నారు. గతంలో వచ్చిన తుఫాన్‌లు, భారీ వర్షాలకు ఈ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇసుకను ఉచితంగా తవ్వుకోవచ్చన్న సర్కారు ఆదేశాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. పొక్లెయినర్ల సాయంతో రోజూ లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను తవ్వి లారీలు, ట్రాక్టర్లపై ఇతర జిల్లాలకు తరలించి విక్రయించారు. రూ.కోట్లు ఆర్జించారు. తమవైపు అధికారులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు వారంతా నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరితోపాటు, అతని అనుచరులకు రూ. లక్షలు సమర్పించుకున్నారన్న వాదన ఉంది. ఇలా మేనేజ్ చేసే బాధ్యతను తీసుకున్న వ్యక్తి, ఇసుక తవ్వకాలు జరిపే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ నేత ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. జిరాయితీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీకే చెందిన మరోవర్గం నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పదిహేను రోజుల క్రితం రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టి సుమారు రూ.4కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తర లిపోయిందని నిర్ధారించారు. తవ్వకాల కోసం వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
అది తునిపట్ణాణానికి చెందిన వ్యక్తిది కావడంతో, అతను తన పలుకుబడిని ఉపయోగించి సీజ్ చేసిన పొక్లెయినర్‌ను దౌర్జన్యంగా పట్టుకుపోయాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతనిపై నామమాత్రంగా ఫిర్యాదు చేసి ఊరుకున్నారే తప్ప ఇంతవరకు దానిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు. యజమానిపై చర్యలు చేపట్టలేదు. దాడుల్లో గుర్తించిన మేరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపిన తొమ్మిది మందికి మైనింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అపరాధ రుసుం కింద రూ.98లక్షలు చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మొత్తం నుంచి మినహాయింపు ఇవ్వాలని కొందరు నాయకులు రాజకీయ పైరవీలు చేస్తున్నట్లు భోగట్టా. దాడులు జరగకుండా చూస్తామని హమీ ఇచ్చిన అధికారపార్టీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేశారు. దీంతో లీజుకని తీసుకుని తమకు తెలియకుండా టీడీపీ నాయకులు తమ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపారని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చేయని తప్పుకు తమకు నోటీసులు జారీ చేయడం భావ్యం కాదని అంటున్నారు.
Advertisement
Advertisement