అక్రమ దందా! | Sand smuggling | Sakshi
Sakshi News home page

అక్రమ దందా!

Published Sat, Feb 21 2015 2:36 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Sand smuggling

జిల్లాలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం
 
ప్రభుత్వ నిబంధనలను ఆసరాగా చేసుకుని రూ.లక్షలు దండుకుంటున్న వైనం
లారీకి రూ.8,100 చొప్పున ప్రభుత్వానికి కట్టి రూ.18వేలకు అమ్మకం
హాలియా ఇసుక డంప్‌ల విక్రయాల్లో పెద్దఎత్తున అక్రమాలు
ఇద్దరు కాంట్రాక్టర్ల నేతృత్వంలోనే వ్యాపారమంతా
రూ. కోటిన్నర వరకు డీడీలు తీసి యథేచ్ఛగా అ‘క్రమ’ రవాణా
కలెక్టర్ దృష్టికి విషయం.. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు

 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్రమం చట్టబద్ధమైంది... దుర్వినియోగమవుతున్న లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రక్షించేందుకు పాలకులు రూపొందించిన నిబంధనలు జిల్లాలోని ఇసుక కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. ఇన్నాళ్లు దొంగచాటుగా చేసిన వ్యాపారాన్ని ఇప్పుడు బాజాప్తుగా గల్లా ఎగరేసి చేసుకుంటూ అవే లక్షలు మళ్లీ దండుకుంటున్నారు ఇసుకాసురులు. ఇందుకు మైనింగ్ అధికారుల అండదండలూ ఉండడంతో బహిరంగంగానే వారు లారీకి రూ.10వేలకు పైగా లాభాన్ని ఆర్జిస్తూ ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు ఇసుకను కొట్టేసి ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముతున్న ఈ తతంగమంతా హాలియా పరిసరాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దందా విషయం కలెక్టర్ సత్య నారాయణరెడ్డి దృష్టికి వెళ్లింది. కేవలం ఇద్దరు కాంట్రాక్టర్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ అక్రమ దందా గురించి ‘సాక్షి’ ఫోకస్...

కాసుల పంటకు ని‘బంధ’నాలా?

వాస్తవానికి గతంలో జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు ఆరు లారీలుగా వర్ధిల్లింది. ఇసుక వ్యాపారులకు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు అధికారంలో ఉన్న వారూ అండగా ఉండడంతో చాలా ఏళ్లుగా ఈ వ్యాపారం అక్రమంగా జరుగుతూనే ఉంది. అయితే, ఈ ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం గతంలో అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో సీజ్ చేసిన ఇసుకను అవసరమైన వారు కొనుగోలు చేయవచ్చు.

ఇందుకోసం ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున  తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కి డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. అలా తీసిన వారికి ప్రభుత్వ అధికారులే ఇసుకను అందజేస్తారు. అయితే, అవసరాన్ని బట్టి ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేటు వ్యక్తులు డీడీలు తీసి ఇసుకను తీసుకోవచ్చు. ఈ నిబంధన మేరకు ఇసుక అందుబాటులో ఉన్నదని జిల్లా కలెక్టర్ ప్రకటించిన తర్వాత మొదట ప్రభుత్వ శాఖలకు అవకాశం ఇస్తారు.

కలెక్టర్ చెప్పిన 48 గంటల్లోపు అందుబాటులో ఉన్న ఇసుకలో ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసిన  ఇసుక పోను మిగిలిన దానిని ప్రైవేటు వ్యక్తులకు కూడా అమ్మవచ్చు. ఈ నిబంధనను జిల్లాలోని హాలియా ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. డీడీ అయితే చెల్లిస్తున్నాం కదా... చట్టబద్ధంగానే ఇసుకను తీసుకెళ్తున్నాం కదా.. అని కొంగొత్త అ‘క్రమ’ దందాకు తెర తీశారు.

సీజ్ చేసిన ఇసుక ‘స్వీప్’ చేస్తున్నారు

హాలియా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం గత ఏడాది అప్రతిహతంగా కొనసాగింది. వందల మంది ఇసుక వ్యాపారంపై దృష్టి పెట్టి అందినంతా దండుకున్నారు. అయితే, హాలియా నుంచి కుపాసుపల్లి, పులిమామిడి వరకు రోడ్డుకిరువైపులా పొలాల్లో పెద్ద ఎత్తున ఇసుకరాశులు పోసి అక్రమంగా తరలించారు. ఇందుకు అక్కడి ప్రభుత్వ అధికారులు కూడా సహకరించారు. అయితే, ఈ ఇసుకను ప్రభుత్వం సీజ్ చేసింది. మొత్తం 77,650 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఈ ప్రాంతంలో ప్రభుత్వం సీజ్ చేసింది.

కానీ, సీజ్ చేసిన ఇసుకను ఎక్కడ పోసి ఉందో అక్కడే ఉంచింది. దీంతో ఇసుకాసురులు రాత్రివేళల్లో ప్రభుత్వం కళ్లు గప్పి ఇసుకను తరలించేవారు. కానీ, నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వీరి పంథా మారింది. దొంగతనంగా ఇసుకను ఎందుకు తీసుకెళ్లాలి... ప్రభుత్వమే అవకాశం కల్పించింది కదా అని... అక్కడ ఉన్న వ్యాపారులు కొందరు జట్టు కట్టారు. ఇద్దరు పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్ల నేతృత్వంలో అక్కడ ఉన్న ఇసుకనంతా తెగనమ్ముకునే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే దాదాపు రూ. కోటిన్నర వరకు వ్యాపారులే డీడీలు తీసి ఇసుకను యథేచ్ఛగా తీసుకెళుతున్నారు.

ప్రభుత్వ రేటుకు వీరి రేటుకు పొంతన లేదు

వాస్తవానికి ఎవరైనా ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున చెల్లించి ఇసుకను తీసుకెళ్లవచ్చు.. కానీ దానిని అవసరాల మేరకే వినియోగించుకోవాలి కానీ వ్యాపారం చేయకూడదు. అయితే, వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదు కదా అనే ఆలోచనతో ఇసుక కాంట్రాక్టర్లు దీనిని వ్యాపార సూత్రంగా మార్చుకున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లే లారీకి రూ.8,100 (క్యూబిక్‌మీటర్ రూ.600 చొప్పున 13.5 క్యూబిక్‌మీటర్లకు ఓ లారీ) చొప్పున డీడీ ప్రభుత్వానికి చెల్లించి ఆ లారీని రూ.18వేలకు అమ్ముకుంటున్నారు.

అంటే ఒక్కో లారీపై రూ.10వేలు అదనపు లాభమన్నమాట. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న 77వేలకు పైగా క్యూబిక్‌మీటర్లు ఇసుక 5800 లారీల వరకు అవుతుంది. లారీకి 10వేల చొప్పున ఈ ఇసుకను అమ్ముకుంటే వ్యాపారులకు మిగిలేదెంతో తెలుసా...దాదాపు రూ.6 కోట్ల రూపాయలు. అయితే... ఇక్కడ ఇంకో వాస్తవం గమనించాల్సి ఉంది... ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ సీజ్ చేసిన ఇసుక 77వేల క్యూబిక్‌మీటర్లే కానీ అక్కడ ఉన్న ఇసుక దాదాపు లక్ష క్యూబిక్‌మీటర్లకుపైమాటే.

ఒక వ్యాపారి వద్ద సుమారు 70వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను సీజ్ చేయగా, దానిని రికార్డుల్లో చూపించింది మాత్రం 13,500 క్యూబిక్ మీటర్లేననే ఆరోపణలున్నాయి. అంటే ఈ లెక్కన ఎంత ఇసుక అక్కడ అక్రమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్నంతా లెక్కకడితే ఒక్క హాలియా ప్రాంతంలోనే దాదాపు రూ.10 కోట్ల మేర ఇసుకాసురులకు లాభం రానుంది. అదే మేర ప్రజలపై భారం పడనుంది. అయితే, ఉదయం నుంచి సాయంత్రం పనిగంటలను ఫిక్స్ చేసి ఆ సమయంలోనే ఇసుకను తీసుకెళ్లాలన్న నిబంధన ఇక్కడ అమలుకావడం లేదు. లారీకి ఎంత తరలించాలో అంతకన్నా ఎక్కువ తీసుకెళుతున్నా మైనింగ్ అధికారులు కిమ్మనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇసుకను తరలించాలన్న నిబంధన కూడా తుంగలో తొక్కారు. దీంతో ఇసుక కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన ఇసుకను విక్రయిస్తామని అధికారులు చెపుతున్నా ఇద్దరు కాంట్రాక్టర్లే అత్యధికంగా ఇసుకను తీసుకెళ్లేందుకు ఎలా ముందుకొచ్చారన్నదానికి మాత్రం సమాధానం లేదు.

వేరే వాళ్లు వస్తే బెదిరింపులే..

అయితే, ఇక్కడ సీజ్ చేసిన ఇసుక ను ఎవరైనా కొనుగోలు చేసి తీసుకెళ్లవచ్చు కానీ ఈ కాంట్రాక్టర్లకు తెలియకుండా ఎవైరె నా డీడీలు తీసి వస్తే వారిని బెదిరించి వెళ్లగొడతారు. అది ప్రభుత్వ సంస్థ అయినా... ప్రైవేటు వ్యక్తులయినా. వాస్తవానికి ఈ ఇసుక తమకు అవసరం ఉందని హైదరాబాద్ వాటర్‌వర్క్స్ అధికారులు 5000 క్యూబిక్‌మీటర్లకు డీడీలు తీసి ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నించారు. అయితే, కాంట్రాక్టర్ల బెదిరింపుల కారణంగా వీరు అతికష్టం మీద ఆ ఇసుకను తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఆ తర్వాత వారికి ఇంకా అవసరం ఉన్నా వాటర్‌వర్క్స్ అధికారులు ఈ ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదంటే అక్కడి దందా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ ఇసుక తరలింపు విషయమై జిల్లా మైనింగ్ ఏడీ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఇసుక కోసం ఇప్పటి వరకు 29 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో ఆరు ప్రభుత్వ శాఖల నుంచి, మరో 23 ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చాయని,  ఇప్పటి వరకు 22,150 క్యూబిక్ మీటర్ల ఇసుక కోసం 1.34 కోట్ల రూపాయల డీడీలు వచ్చాయని వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement