తపాలా రెండు ముక్కలు..!
- విభజన ప్రక్రియ ప్రారంభం
- తెలంగాణ సర్కిల్ చీఫ్‌గా చంద్రశేఖర్ నియామకం
- ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాయ్ బదిలీ
- పరిపాలనా సిబ్బందికి ఆప్షన్ అవకాశం
- తపాలా సిబ్బంది ఎక్కడివారక్కడే
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖను విభ జించాలని ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి తపాలా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన 42:58 నిష్పత్తిలో విభజన తంతు పూర్తి చేయాలంటూ తాజాగా హైదరాబాద్‌కు సమాచారం అందింది. తపాలా శాఖ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు రీజినల్ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాల్లోని పరిపాలన విభాగాల్లోని సిబ్బంది, మల్టీ టాస్క్ సర్వీసు సిబ్బందికి, సర్కిల్ కార్యాలయాల్లోని ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి ఎగువ స్థాయి వారికి ఆప్షన్ అవకాశం కల్పించారు. వారు ఏ ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నారో ఆసక్తి వ్యక్తీకరిస్తూ లేఖలు సమర్పించారు. ఇక ఆయా ప్రాంతాల్లో తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి.
తెలంగాణకు కొత్త చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్
విభజనలో భాగంగా తెలంగాణ సర్కిల్‌కు కొత్త పోస్ట్‌మాస్టర్ జనరల్‌ను తపాలా శాఖ నియమించింది. ప్రస్తుతం ఉమ్మడిగా ఏపీ సర్కిల్ చీఫ్‌గా పనిచేస్తున్న రాయ్‌ని ఉత్తరప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్‌గా బదిలీ చేసి, ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను తెలంగాణ సర్కిల్ చీఫ్‌గా నియమించింది. ఆయన ఒకటో తేదీన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ సర్కిల్‌కు మరో అధికారిని నియమించేవరకు చంద్రశేఖరే ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇక ఉన్నత పదవుల్లో ఏ ప్రాంతానికి ఎవరిని నియమించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టులను ఏ రాష్ట్రానికి అవిగా కేటాయించాల్సి ఉన్నందున అందులో స్పష్టత ఇవ్వాలంటూ స్థానిక యంత్రాంగం ఢిల్లీకి లేఖ రాసింది. మరో రెండుమూడు రోజుల్లో అందులో స్పష్టత రానుండటంతో నియామకాలు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం తపాలా శాఖలో 41,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 26 వేల మంది గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉన్నారు. వీరిని రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంది.