ఆర్టీసీ..కేరాఫ్ విజయవాడ
► పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
►సిటీ టెర్మినల్, వై స్క్రీన్స్ థియేటర్లు, యాప్‌ల ప్రారంభోత్సవాలతో
► హైటెక్ హంగామా
విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ పైఅంతస్తులో నిర్మించిన ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయం సీఎం చంద్రబాబు చేతులమీదుగా సోమవారం ప్రారంభమైంది. దీంతో పాటు ఆధునీకరించిన సిటీ బస్సు టెర్మినల్‌ను, వై స్క్రీన్స్ సంస్థ నిర్మించిన మినీ థియేటర్లను, ఆర్టీసీ కొత్త యాప్‌లను సీఎం ప్రారంభించారు.
విజయవాడ (బస్‌స్టేషన్): ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్టాండ్‌లో రెండవదిగా గుర్తింపు పొందిన పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ (పీఎన్‌బీఎస్)కు మరో కీలక స్థానం దక్కింది. ఇకపై ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర పరిపాలన కార్యాలయానికి విజయవాడ కేరాఫ్‌గా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలన్నీ విజయవాడ పీఎన్‌బీఎస్‌పై నిర్మించిన పైఅంతస్తుకు తరలిరానున్నాయి. ఎన్టీ రామారావు నూతన పరిపాలన భవనాన్ని సీఎం చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు.హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన సిటీబస్ టెర్మినల్, వై స్క్రీన్స్ థియేటర్లు, ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లను ప్రారంభించారు. రెండు గంటలపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సందడి నెలకొంది.
బస్టాండ్ సిటీటెర్మినల్‌కు చేరుకున్న సీఎంకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు స్వాగతం పలికారు. రూ.1.2 కోట్లతో నిర్మించిన సిటీ బస్సుపోర్టు (టెర్మినల్)ను ప్రారంభించారు. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు మేలైన రవాణా సౌకర్యాలు కోసం ఆంధ్రాబ్యాంక్ సౌజన్యంతో సిటీబస్సు పోర్టును ఆధునీకరించారు. లైవ్ ట్రాకింగ్ యాప్ ఏర్పాటు చేసిన బస్సులను తిలకించిన సీఎం డ్రైవింగ్ సీటులో కూర్చొని వాటి పనితీరు, ఉపయోగాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సులో డ్రైవర్ పక్కన కూర్చొని సీఎం బస్టాండ్ అవరణలో కొద్దిదూరం ప్రయాణించారు. అనంతరం రూ.10కోట్లతో నిర్మిం చిన ఎన్‌టీ రామారావు పరిపాలన భవనాన్ని ప్రారంభించారు.
రాష్ట్రవిభజన అనంతరం ఆర్టీసీ సొంత పరి పాలన కార్యాలయాన్ని సమకూర్చుకున్నట్టు అయ్యిం ది. 9నెలల వ్యవధిలో దీన్ని నిర్మాణం పూర్తి చేయడంతో హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉన్న 325మంది సిబ్బంది ఇకపై ఇక్కడికి తరలివచ్చి విధులు, ప్రధాన పరిపాలనా కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు. బస్టాండ్‌లో ఏర్పా టు చేసిన వై స్క్రీన్ సంస్థ నిర్మించిన రెండు మినీ ధియేటర్లను ప్రారంభించారు. ప్రయాణ విరామ సమయం లో ప్రయాణికులకు వినోద సౌకర్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు, మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమా, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహనరావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన హ్యాపీ వ్యాలీ నిర్వాహకురాలు
ఆగిరిపల్లిలో రూ.100కోట్లతో వంద ఎకరాల్లో నిర్మించిన హ్యాపీ వ్యాలీ ఫౌండేషన్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో అదే తరహాలో ఉయ్యూరులోనూ ఏర్పాట్లుచేస్తున్నట్టు నిర్వాహకురాలు పొట్లూరి శ్రీలక్ష్మి ఆయనను కలిసి వివరించారు. హ్యాపీ వ్యాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సంస్థ ద్వారా విద్యా, ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా శ్రీలక్ష్మికి సీఎం సూచించారు.
అమరావతికి కార్మికుల ఒక రోజు వేతనం..
ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.కోటి 36 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు, కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జిలానీబాషా, సీహెచ్ సుందరయ్య పాల్గొన్నారు.