Pandit Nehru bus station
-
విజయవాడ ప్రధాన బస్టాండ్‌లో అగ్నిప్రమాదం
విజయవాడ: పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న షిర్డీ క్యాంటీన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కిచెన్‌లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా పొయ్యి నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో క్యాంటీన్లో ఉన్న సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న వారు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ పెద్దగాయాలు కాలేదు. మంటల వ్యాప్తికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ..కేరాఫ్ విజయవాడ
► పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ►సిటీ టెర్మినల్, వై స్క్రీన్స్ థియేటర్లు, యాప్‌ల ప్రారంభోత్సవాలతో ► హైటెక్ హంగామా విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ పైఅంతస్తులో నిర్మించిన ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయం సీఎం చంద్రబాబు చేతులమీదుగా సోమవారం ప్రారంభమైంది. దీంతో పాటు ఆధునీకరించిన సిటీ బస్సు టెర్మినల్‌ను, వై స్క్రీన్స్ సంస్థ నిర్మించిన మినీ థియేటర్లను, ఆర్టీసీ కొత్త యాప్‌లను సీఎం ప్రారంభించారు. విజయవాడ (బస్‌స్టేషన్): ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్టాండ్‌లో రెండవదిగా గుర్తింపు పొందిన పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ (పీఎన్బీఎస్)కు మరో కీలక స్థానం దక్కింది. ఇకపై ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర పరిపాలన కార్యాలయానికి విజయవాడ కేరాఫ్‌గా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలన్నీ విజయవాడ పీఎన్‌బీఎస్‌పై నిర్మించిన పైఅంతస్తుకు తరలిరానున్నాయి. ఎన్టీ రామారావు నూతన పరిపాలన భవనాన్ని సీఎం చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు.హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన సిటీబస్ టెర్మినల్, వై స్క్రీన్స్ థియేటర్లు, ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లను ప్రారంభించారు. రెండు గంటలపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సందడి నెలకొంది. బస్టాండ్ సిటీటెర్మినల్కు చేరుకున్న సీఎంకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు స్వాగతం పలికారు. రూ.1.2 కోట్లతో నిర్మించిన సిటీ బస్సుపోర్టు (టెర్మినల్)ను ప్రారంభించారు. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు మేలైన రవాణా సౌకర్యాలు కోసం ఆంధ్రాబ్యాంక్ సౌజన్యంతో సిటీబస్సు పోర్టును ఆధునీకరించారు. లైవ్ ట్రాకింగ్ యాప్ ఏర్పాటు చేసిన బస్సులను తిలకించిన సీఎం డ్రైవింగ్ సీటులో కూర్చొని వాటి పనితీరు, ఉపయోగాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సులో డ్రైవర్ పక్కన కూర్చొని సీఎం బస్టాండ్ అవరణలో కొద్దిదూరం ప్రయాణించారు. అనంతరం రూ.10కోట్లతో నిర్మిం చిన ఎన్టీ రామారావు పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రవిభజన అనంతరం ఆర్టీసీ సొంత పరి పాలన కార్యాలయాన్ని సమకూర్చుకున్నట్టు అయ్యిం ది. 9నెలల వ్యవధిలో దీన్ని నిర్మాణం పూర్తి చేయడంతో హైదరాబాద్ బస్‌భవన్‌లో ఉన్న 325మంది సిబ్బంది ఇకపై ఇక్కడికి తరలివచ్చి విధులు, ప్రధాన పరిపాలనా కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు. బస్టాండ్‌లో ఏర్పా టు చేసిన వై స్క్రీన్ సంస్థ నిర్మించిన రెండు మినీ ధియేటర్లను ప్రారంభించారు. ప్రయాణ విరామ సమయం లో ప్రయాణికులకు వినోద సౌకర్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు, మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమా, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహనరావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన హ్యాపీ వ్యాలీ నిర్వాహకురాలు ఆగిరిపల్లిలో రూ.100కోట్లతో వంద ఎకరాల్లో నిర్మించిన హ్యాపీ వ్యాలీ ఫౌండేషన్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో అదే తరహాలో ఉయ్యూరులోనూ ఏర్పాట్లుచేస్తున్నట్టు నిర్వాహకురాలు పొట్లూరి శ్రీలక్ష్మి ఆయనను కలిసి వివరించారు. హ్యాపీ వ్యాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సంస్థ ద్వారా విద్యా, ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా శ్రీలక్ష్మికి సీఎం సూచించారు. అమరావతికి కార్మికుల ఒక రోజు వేతనం.. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.కోటి 36 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు, కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే జిలానీబాషా, సీహెచ్ సుందరయ్య పాల్గొన్నారు. -
బెజవాడ బస్టాండ్‌లో సినిమా థియేటర్
విజయవాడ : పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సినిమా థియేటర్ ప్రారంభానికి సిద్ధమైంది. బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్ మినీ థియేటర్ ఏర్పాటు చేయాలని ఎండీ నండూరి సాంబశివరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ అవకాశాన్ని వైస్క్రీన్ సంస్థ దక్కించుకుంది. పనులు పూర్తయి ప్రస్తుతం థియేటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రెండు స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఒక్కో స్క్రీన్‌లో 128 సీట్లతో రోజుకు 5 ఆటలు ప్రదర్శిస్తారు. టిక్కెట్టు రూ.80 ఉంటుంది. రాత్రి వేళలో తక్కువ ధరకు టికెట్టు నిర్ణయించి పలు అంశాల కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. 6న ప్రారంభం.. ఈ నెల 6వ తేదీ సినిమా థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు వైస్క్రీన్ సంస్థ ప్రొప్రయిటర్ వైవీ రత్నం తెలిపారు. ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. -
కష్టాల బస్టాండ్లు
బెజవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మినహా జిల్లాలోని రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణాలన్నింటినీ ఏదో ఒక సమస్య పట్టిపీడిస్తోంది. నిత్యం వివిధ ప్రదేశాలకు ప్రయాణించే నాలుగు లక్షలమంది ప్రయాణికులకు బస్టాండ్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు కరువవుతున్నాయి. ఇక గట్టిగా వాన పడితే మచిలీపట్నం బస్టాండు పెద్ద చెరువును తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం.. వెరసి బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని బస్టాండ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 14 డిపోలు, 37 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు 1419 బస్సులు ఉన్నాయి. వీటిలో 240 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 4 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. ఎక్కడైనా బస్టాండ్‌లో బస్సు ఆగితే దాహం తీర్చుకునేందుకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి. దూరప్రాంతాలకు వెళ్లే వారు బస్సు ఎక్కేందుకు బస్టాండ్‌కు వస్తే కూర్చునేందుకు బల్లలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోని బస్టాండ్ల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు, బాత్రూమ్ల వద్ద పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేయటంతో దుర్గంధం ప్రయాణికులతో సహవాసం చేస్తోంది. జిల్లాలోని వివిధ బస్టాండ్లలో పరిస్థితిపై ‘సాక్షి’ విజిట్ చేయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. -మచిలీపట్నం జగ్గయ్యపేట బస్టాండ్‌లో ఒక లైటు సక్రమంగా వెలగని పరిస్థితి. ఫ్యాన్లు తిరగవు. తాగునీరు అందుబాటులో లేదు. దాతలు ఇచ్చిన కూలర్లు బస్టాండ్ ఆవరణలో ఉన్నా అవి పనిచేయటం లేదు. రాత్రి సమయంలో బస్టాండ్ ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి సమయంలో కంట్రోలర్ అందుబాటులో ఉండకపోవటంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మందుబాబుల గొడవలు నిత్యకృత్యంగా మారాయి. మైలవరం బస్టాండ్ నుంచి పొందుగల, పోరాటనగర్, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేవు. ఎన్నాళ్లుగా సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు స్పందించటం లేదు. జి.కొండూరులో బస్టాప్ కూడా లేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు.తిరువూరు బస్టాండ్‌లో ఆరు సంవత్సరాలుగా క్యాంటీన్ సౌకర్యమే లేదు. వాణిజ్య సముదాయం సగం మాత్రమే నిర్మించి నిలిపివేశారు. మరుగుదొడ్లు మరమ్మతుల నిమిత్తం మూసివేశారు. సెప్టిక్‌ట్యాంక్ మూత పగిలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. లైట్లు, ఫ్యాన్లు లేనేలేవు. మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పామర్రు బస్టాండ్ ఆవరణలో మురుగునీరు నిత్యం నిలిచిపోయి ఉంటుంది. మరుగుదొడ్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కూచిపూడి, మొవ్వ బస్టాండ్ ఆవరణ ఆక్రమణకు గురైంది. తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పెడన బస్టాండ్ రాళ్లు లేచిపోయాయి. నెల రోజుల క్రితమే మరమ్మతులు చేసినా మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. సెప్టిక్‌ట్యాంకు నిండి వ్యర్థాలు రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. మరుగుదొడ్డికి సంబంధించిన పైప్‌ను డ్రెయిన్‌లో కలిపివేయటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆర్టీసీ బస్సుల కన్నా ఆటోవాలాలే ఈ బస్టాండ్‌ను అధికంగా వినియోగించుకుంటున్నారు. బంటుమిల్లి బస్టాండ్ ట్యాక్సీస్టాండ్గా మారింది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మోపిదేవిలో బస్టాండ్ ఉన్నా లోపలకు బస్సులు వెళ్లటం లేదు. రెండు సంవత్సరాల క్రితమే మరుగుదొడ్లు పాడైపోయాయి. అక్కడ ఉన్న చేతిపంపు విరిగిపోయింది. నాగాయలంక బస్టాండ్ గోతులమయంగా మారటంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలబడుతోంది. కోడూరు బస్టాండ్ ఊరికి శివారున ఉండటంతో అక్కడకు ఎవరు వెళ్లలేని పరిస్థితి. అవనిగడ్డ బస్టాండ్‌లో డిపో మేనేజరు కార్యాలయంపై తాగునీటి కుండీని ఏర్పాటు చేశారు. పగలు సమయంలో తాగునీరు వేడిగా వస్తోంది. రెండు కుండలు ఏర్పాటు చేసినా కొద్దిసేపటికే ఈ తాగునీరు అయిపోతోంది.బందరు బస్టాండ్ ఆవరణలోకి అడుగు పెట్టగానే దుర్వాసన ఆహ్వానం పలుకుతోంది. సెప్టిక్ ట్యాంకు సిమెంటు బల్లలు పగిలిపోవటంతో రేక్‌లు అడ్డుగా పెట్టారు. లైట్లు సక్రమంగా వెలగవు. తాగునీటి కోసం కూలర్ ఉన్నా సక్రమంగా పనిచేయదు.కలిదిండిలోని బస్టాండ్ 20 సంవత్సరాలుగా మూతపడింది. ఈ ప్రాంగణం ఆక్రమణలకు గురైంది. లోతట్టుగా ఉండటంతో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతోంది. చెత్త వేసేందుకు ఉపయోగిస్తున్నారు. ముదినేపల్లి, కైకలూరు బస్టాండ్లను నెలరోజుల కిందట రూ. 8 లక్షలతో మరమ్మతులు చేయించటంతో ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. మండవల్లిలో బస్షెల్టరే గతి. గుడివాడ బస్టాండ్ 30 సంవత్సరాలుగా ప్రయాణికులకు సౌకర్యాలు అందించలేకపోతోంది. ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు చేరుతోంది. మహిళల మరుగుదొడ్లు, బాత్రూమ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గన్నవరం బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగవు. మంచినీళ్లు లేవు. వాటర్ కూలర్లు ఉన్నా పక్కనపెట్టేశారు. హనుమాన్‌జంక్షన్ బస్టాండ్‌లో ఆరు నుంచి 11వ ఫ్లాట్‌ఫారం వరకు షెల్టర్ లేకపోవటంతో ప్రయాణికులు ఎండలోనే నిలబడాలి. జాతీయ రహదారికి నాలుగు అడుగులు లోతుగా బస్టాండ్ ఆవరణ ఉండటంతో ఒక మాదిరి వర్షం కురిసినా జలమయంగా మారుతోంది. మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.నందిగామ బస్టాండ్ ఆవరణ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బస్టాండ్‌లో అసౌకర్యాలు అధికమయ్యాయి. ఫ్యాన్లు తిరగవు, ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. రాత్రి పూట కంట్రోలర్ అందుబాటులో లేకపోవటంతో సమాచారం చెప్పేవారే ఉండరు. తాగునీటి కుళాయి ఉన్నా ఆ నీరు తాగేందుకు ప్రయాణికులు సాహసించరు. కూడళ్లు ఏర్పాటు చేసిన అవి పనిచేయటం లేదు.నూజివీడు బస్టాండ్‌లో మంచినీరు లేదు. ఫ్యాన్లు తిరగవు. టీవీలు లేవు. -
విజయవాడ బస్‌స్టేషన్‌లో మూవీ థియేటర్లు
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సంక్రాంతి నుంచి ప్రయాణికులకు వెండితెరలు అందుబాటులోకి రానున్నాయి!. స్టేషన్లోకి బస్సులు వచ్చే ప్లాట్‌ఫామ్‌ల బ్లాక్‌లో రెండు డిజిటల్ మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో థియేటర్లో 134 సీట్లు ఉంటాయి. రూ.1.3 కోట్లతో చేపట్టిన మినీ డిజిటల్ థియేటర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. గడువులోగా నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి సినిమా ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. టిక్కెట్ ధర రూ.80గా నిర్ణయించే అవకాశం ఉంది. -
సేవల్లో హైఫై
- పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు రాజధాని శోభ - దేశంలో వైఫై ఉన్న మొదటి బస్టాండ్ - 25 బస్సు సర్వీసుల్లో ఇంట్రా వైఫై - స్కానియా బస్సు రాకపోకలు సాక్షి, విజయవాడ : పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ రాజధాని శోభను సంతరించుకుంది. క్రమంగా అధునాతన సౌకర్యాలను అందిపుచ్చుకుని వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోంది. సర్వీసుల సంఖ్య మొదలుకుని వైఫై సేవల వరకు అన్నీ దశలవారీగా ఇక్కడ అమల్లోకి తెస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంతోపాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదాయం పెంచే దిశగా కసరత్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం 25 బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం నాలుగు రోజులుగా అందుబాటులోకి వచ్చింది. ప్రతినెలా మూడురోజులు ఆర్టీసీ ఎండీ బస్టాండ్‌లోనే.. గడిచిన ఆరు నెలల్లో జిల్లాకు రెండు విడతల్లో 120కుపైగా కొత్త బస్సులు (వీటిలో 12 ఏసీ సర్వీసులు) వచ్చాయి. మరో మూడు నెలల వ్యవధిలో దశలవారీగా మంజూరైన 50 బస్సులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని 14 డిపోల్లో కలిపి 1,440 వరకు బస్సులు ఉన్నాయి. ఇవికాకుండా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉండటంతో ఎక్కువ సర్వీసులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 2,500 బస్సులు విజయవాడ నుంచి రోజూ వెళ్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చేనెల నుంచి ఆర్టీసీ ఎండీ నగరంలోనే మూడు రోజులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా బస్‌స్టేషన్‌లోని పైఅంతస్తుల్లో మార్పులు చేసి ప్రత్యేక చాంబర్‌తోపాటు కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. టెస్ట్ డ్రైవ్‌లో స్కానియా బస్సు మల్టీయాక్సిల్ సౌకర్యం కలిగిన స్కానియా బస్సు గతనెల 15 నుంచి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి రాకపోకలు మొదలుపెట్టింది. సుమారు రూ.1.20 కోట్ల విలువైన ఈ బస్సును విజయవాడ రీజియన్‌కు కేటాయించారు. దీనిని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు విజయవాడ నుంచి హైదారాబాద్‌కు నడిపి పనితీరును పరిశీలిస్తున్నారు. దీనికోసం పదిమంది డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్కానియా కంపెనీకి చెందిన టెక్నీషియన్ ఒకరు బస్సులోనే ఉండి పనితీరును పరిశీలిస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్, మల్టీయాక్సిల్ సీటింగ్, ఏసీ ఇందులోని ప్రత్యేకతలు. 25 సర్వీసుల్లో ఇంట్రా వైఫై ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై, బెంగళూరు తదితర సర్వీసుల్లోని కొన్ని బస్సులకు ఇంట్రా వైఫై సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. ఇంట్రానెట్‌లో కొన్ని సినిమాలు, కొన్ని రకాల గేమ్స్, వీడియో, ఆడియో సాంగ్స్ మాత్రమే ఉంటాయి. గత నెల 29 నుంచి ఈనెల 31 వరకు 25 బస్సు సర్వీసుల్లో వైఫై అమల్లో ఉంది. బస్టాండ్‌లో వైఫై వీటితోపాటు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సోమవారం నుంచి వైఫై సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకేసారి 8వేల మంది ప్రయాణికులు వినియోగించుకునే సౌకర్యంతో దీనిని అమల్లోకి తెచ్చారు. బస్టాండ్‌లో 17 మాక్సెస్ పాయింట్లు ఏర్పాటుచేసి దీనిని అందిస్తున్నారు. 220 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5జీ వైఫై సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. రోజుకు అరగంట మాత్రమే వైఫై ఉచితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రీచార్జి చేయించుకోవాల్సిందే. ఈ సౌలభ్యంతో దేశంలోనే వైఫై ఉన్న మొదటి బస్టాండ్‌గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌గా నిలిచింది. -
రైట్.. రైట్..
43 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు బుధవారం విజయోత్సవం జరుపుకొన్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.బస్సుల రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలవడంతో బస్‌స్టేషన్ మళ్లీ కళకళలాడింది. విజయవాడ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోర్కెలను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆర్టీసీ యూనియన్లు తన ముందు ఉంచిన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించడంతో బుధవారం మధ్యాహ్నం సమ్మె ముగిసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు బస్‌స్టాండ్‌లో విజయోత్సవాలు జరుపుకొన్నారు. ఎనిమిది రోజు కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో అన్ని సర్వీసులు నడిచాయి.ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె ముగి సింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలి పింది. 2013 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు తక్షణం, సర్వీసుల్లో ఉన్న కార్మికులకు బాండ్ల రూపంలో ఏరియర్స్ ఇస్తామని ప్రకటించింది. జూలై పేస్కేల్ నుంచి ఫిట్మెంట్తో కలిసిన జీతం అమలులోకి రానుంది. ఉదయం నుంచి కొనసాగిన సమ్మె సమ్మెలో భాగంగా ఉదయం నుంచి జిల్లాలో పటుచోట్ల కార్మికుల నిరసన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగాయి. విజయవాడ పాత బస్‌స్టాండ్ నుంచి కొత్త బస్‌స్టాండ్ వరకు సిబ్బంది నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట డిపోలో జరిగిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మద్దతు పలికారు. గుడివాడ, ఇబ్రహీంపట్నం, నూజివీడు, తిరువూరు తదితర డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. విజయోత్సవాలు కార్మికులు సమ్మె విరమణ అనంతరం విజయోత్సవాలు జరుపుకొన్నారు. పాత బస్‌స్టాండ్ నుంచి కొత్త బస్‌స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్‌స్టాండ్‌లో రంగులు చల్లుకొని, స్వీట్లు పంచుకున్నారు. జిల్లాలోని ఇతర డిపోల్లోనూ కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు. రూ.12 కోట్ల నష్టం ఆర్టీసీకి జిల్లాలో 8 రోజుల సమ్మెతో రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. మొదటి మూడు రోజు సమ్మె ప్రభావంతో ఎక్కువ సర్వీసులు నడవలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 950 బస్సు సర్వీసులు నడిచాయి. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ ఇతర దూరప్రాంతాలకు కూడా సర్వీసులు మొదలయ్యాయి. నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆర్టిసీ సర్వీసులు బస్‌స్టేషన్ : ఆర్టీసీ సర్వీసులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని రీజనల్ మేనేజర్ సుదేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె నిర్వహించడంతో ప్రయాణికులకు సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. పలు రూట్లలో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులకు విధులకు హాజరవుతుని తెలిపారు. -
క్రైం సీరియల్స్ స్ఫూర్తితో హత్యకు పథకం
పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంగళవారం వేకువజామున రివాల్వర్ పేలిన ఘటనలో పట్టుబడిన సుదర్శనం రవిదత్తా(29) బుల్లితెరపై వచ్చే క్రైం సీరియల్స్ చూసేవాడు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని తాను ఇష్టపడిన మహిళ భర్తను హత్య చేసేందుకు పథక రచన చేసినట్టు పోలీసుల దర్యాప్తు లో వెలుగు చూసింది. ఆరేళ్లుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టగా, అనూహ్యంగా రివాల్వర్ పేలి పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. విశ్వసనీయ సమాచారం ప్రకా రం.. ఇబ్రహీంపట్నం ఫెర్రి గ్రామానికి చెందిన సుదర్శనం ఆచార్యుడు కుమారులు మారుతీ వరప్రసాద్ (32), రవిదత్తా (25)లు రింగుసెంటర్ వద్ద గల భీమరాజు గుట్టపై ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజారులుగా వ్యహరిస్తున్నారు. రవి దత్తా విజయవాడకు చెందిన యువతిని ఓ శుభకార్యంలో చూసి ఇష్టపడ్డాడు. అప్పటికి తన అన్న వివాహం కాకపోవడంతో ఇష్టపడిన యువతి గురించి కుటుంబ సభ్యులకు తెలపలేదు. తరువాత ఒంగోలుకు చెందిన ఓ యువకునితో 2008లో ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని రవి దత్తా నిశ్చయించుకున్నాడు. భర్త ఉంటుండగా ఎలాగూ దక్కదు. అందువల్ల అతడినే చంపేస్తే.. తరువాత పెళ్లి చేసుకుంటే వితంతువును వివాహమాడిన ఘనత తనకే దక్కుతుందని అనుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి భర్తతో పరిచయం పెంచుకున్నాడు. అతడిని హత్య చేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఆటోడ్రైవర్లు చింతా సతీష్‌బాబు, రమేష్ సాయం కోరాడు. వీరు ముగ్గురూ పలుమా ర్లు ఒంగోలు వెళ్లారు. తొలుత నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తాడును గొంతుకు బిగించి హత్య చేయాలనుకున్నారు. పలుమార్లు వీరు బయటకు పిలిచినా యువతి భర్త రాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మరికొన్నిసార్లు రోడ్డుపై నడుస్తూ వేగంగా వెళ్లే వాహనాల కింద తోసేయాలనుకున్నా సాధ్యం కాలేదు. ఇక దూరం నుంచే రివాల్వర్‌తో కాల్చి చంపాలని నిర్ణయించుకున్నారు. మూడు నెలల కిం దట బీహార్ వెళ్లి రివాల్వర్ తీసుకొచ్చారు. సోమవారం ముగ్గురూ కలి సి ఒంగోలు వెళ్లారు. ఆ యువకుణ్ణి కలిసినప్పటికీ చంపేందుకు ధైర్యం చాలకపోవడంతో రాత్రి తిరుగు ప్ర యాణమయ్యారు. వేకువజామున 2.30 గంటల సమయంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బస్సు దిగి టాయ్‌లెట్స్ వద్దకు వెళ్లారు. సతీష్, రమేష్ మూత్ర విసర్జనకు వెళ్లగా.. రవిదత్తా టాయిలెట్లోకి వెళ్లి లోడ్ చేసి ఉన్న రివాల్వర్‌ను ఆపరేట్ చేస్తుండగా పేలింది. దీంతో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి నిమ్మల వెంకట రమణ తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రవిదత్తా, సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేష్ మాత్రం పరారయ్యాడు. ‘ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఇలాంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు షాక్‌కు గురయ్యాం’ అంటూ టాయ్‌లెట్స్ వద్ద పని చేసే కొండవీటి శ్రీను, వెంకయ్య తెలి పారు. -
బెజవాడ బస్టాండ్‌లో భద్రత కరువు
=నేరస్తులకు నెలవు = అలంకార ప్రాయంగా అవుట్‌పోస్ట్ =మొక్కుబడిగా సీసీ కెమేరాలు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఆసియా ఖండంలో అతిపెద్దదిగా ఖ్యాతి గాంచిన నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేష న్లో ప్రయాణికుల వస్తు సామగ్రికి భద్రత ఉం డటంలేదు. ఇక్కడ తరచూ చోటుచేసుకుం టున్న ఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఇక్కడ భద్రత విషయంలో పోలీసు, ఆర్టీసీ అధికారులు ఎవరికి వారు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇక్క డ దొంగలు, మోసగాళ్లు మకాం పెట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దోచుకుంటున్నారు. గురువారం రాత్రి ఓ మహిళ నుంచి బంగారు, వజ్రాభరణాలను ఓ ముఠా పకడ్బందీ వ్యూహంతో దోచుకోవడం ఇక్కడ భద్రతా లేమిని మరోసారి రుజువు చేసింది. నగరంలో శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు మస్కా కొట్టి ఓ బ్యాచ్ భారీగా బం గారు ఆభరణాలు దోచుకుంది. ఇక్కడ నెలకు 20 వరకు చిన్న, పెద్ద దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు, చిల్లర దొంగలు బస్టాండ్‌లో స్వైరవిహారం చేసి డబ్బు, నగలు, ల్యాప్‌టాప్‌లు అపహరించుకుపోతున్నారు. హైదరాబా ద్, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ముఖ్య నగరాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు లక్షా 70 వేల మంది వచ్చి వెళుతుంటారని అంచనా. పం డుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి 2,750 వరకు ట్రిప్పులు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అంటే వివిధ ప్రాం తాల నుంచి గంటకు 115 బస్సులు ఇక్కడి బ స్టాండ్‌లోకి వచ్చివెళుతుంటాయి. ఇటీవల కాలంలో నగరం వాణిజ్యం, విద్య, వైద్యపరం గా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఆయా రంగాలకు సంబంధించి సేవలు గత పదేళ్లలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ప్రముఖ దేవాల యాల్లో ఒకటైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో నగరంలోని బస్టాం డ్లో రద్దీ అధికంగా ఉంటుంది. అలంకార ప్రాయంగా అవుట్‌పోస్ట్... ఇంత పెద్ద బస్టాండ్‌లో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన అవుట్‌పోస్టు కేవలం అలంకార ప్రాయంగా ఉంది. ఇందులో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉం టారు. బస్టాండ్‌లో ఉన్న అరైవల్, డిపార్చర్ బ్లా కులు, సిటీ టెర్మినల్‌లో సెక్యూరిటీకి ఈ ఐదుగురే దిక్కు. వీరు మూడు షిప్టుల్లో డూటీలు చేస్తుంటారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా వి ధ్వంసకాండ వంటి ఘటనలు చోటుచేసుకున్నపుడు బాంబ్‌స్క్వాడ్ ఇక్కడ తనిఖీలు చేస్తుం టుంది. నగరంలో మరేదైనా సంఘటనలు జరి గితే అవుట్‌పోస్టులో సిబ్బందిని కుదించి అక్కడకు పంపిస్తుంటారు. బస్టాండ్‌లో భద్రతాపరంగా పోలీసులకు సంబంధించి సరైన అజమాయిషీ కనపడటంలేదు. తాగుబోతులు, చిల్లర నేరస్తులు స్వైర విహారం చేస్తుంటారు. వారిని నియంత్రించడంలో ఈ ఐదుగురూ తలమునకలవుతుంటారు. ఈ నేపథ్యంలో దొంగలు, దోపిడీదారులను గుర్తించేందుకు పోలీసుల నిఘా ఉండటంలేదు. దాంతో నేరగాళ్లు బస్టాండ్‌లో మకాం పెట్టి దోపిడీలకు పాల్పడుతున్నారు. మొక్కుబడిగా సీసీ కెమేరాలు ... బస్టాండ్‌లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల పనితీరు నాశిరకంగా ఉంది. 61 ప్లాట్‌ఫారాల్లో కీలకమైనచోట్ల వీటిని ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ అవుట్‌పోస్టుకు అనుసంధానం చేశారు. అయితే ఈ కెమేరాలు సరిగా పనిచే యటం లేదని పోలీసులు చెపుతున్నారు. వీటి ద్వారా నమోదయ్యే దృశ్యాల్లో స్పష్టత ఉండటం లేదు. దీంతో నేరాలు జరిగినపుడు ఈ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించలేకపోతున్నామని పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కొత్త కెమేరాలను అర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. మిగిలిన వాటి స్థానంలో కూడా కొత్తవి ఏర్పాటు చేస్తే నేరాలు జరిగినప్పుడు దొంగలను గుర్తించటానికి వీ లుంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, బస్టాండ్‌లో కూడా పాత నేరస్తుల ఫొటోలు అందరికీ కనపడే ప్రదేశంలో ఏర్పాటు చే యా ల్సి ఉంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నా రు. రద్దీ సమయాల్లో దొంగలకు సంబంధించిన సమాచారాన్ని మైకుల ద్వారా పదేపదే హెచ్చరికలు జారీ చేసే బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, బస్టాండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.