బెజవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మినహా జిల్లాలోని రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణాలన్నింటినీ ఏదో ఒక సమస్య పట్టిపీడిస్తోంది. నిత్యం వివిధ ప్రదేశాలకు ప్రయాణించే నాలుగు లక్షలమంది ప్రయాణికులకు బస్టాండ్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు కరువవుతున్నాయి. ఇక గట్టిగా వాన పడితే మచిలీపట్నం బస్టాండు పెద్ద చెరువును తలపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం.. వెరసి బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు.
జిల్లాలోని బస్టాండ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 14 డిపోలు, 37 బస్టాండ్లు ఉన్నాయి. రోజుకు 1419 బస్సులు ఉన్నాయి. వీటిలో 240 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 4 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాయి. ఎక్కడైనా బస్టాండ్‌లో బస్సు ఆగితే దాహం తీర్చుకునేందుకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి. దూరప్రాంతాలకు వెళ్లే వారు బస్సు ఎక్కేందుకు బస్టాండ్‌కు వస్తే కూర్చునేందుకు బల్లలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోని బస్టాండ్ల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌ల వద్ద పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేయటంతో దుర్గంధం ప్రయాణికులతో సహవాసం చేస్తోంది. జిల్లాలోని వివిధ బస్టాండ్లలో పరిస్థితిపై ‘సాక్షి’ విజిట్ చేయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. -మచిలీపట్నం
జగ్గయ్యపేట బస్టాండ్‌లో ఒక లైటు సక్రమంగా వెలగని పరిస్థితి. ఫ్యాన్లు తిరగవు. తాగునీరు అందుబాటులో లేదు. దాతలు ఇచ్చిన కూలర్లు బస్టాండ్ ఆవరణలో ఉన్నా అవి పనిచేయటం లేదు. రాత్రి సమయంలో బస్టాండ్ ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి సమయంలో కంట్రోలర్ అందుబాటులో ఉండకపోవటంతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మందుబాబుల గొడవలు నిత్యకృత్యంగా మారాయి.
మైలవరం బస్టాండ్ నుంచి పొందుగల, పోరాటనగర్, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేవు. ఎన్నాళ్లుగా సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు స్పందించటం లేదు. జి.కొండూరులో బస్టాప్ కూడా లేదు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు.తిరువూరు బస్టాండ్‌లో ఆరు సంవత్సరాలుగా క్యాంటీన్ సౌకర్యమే లేదు. వాణిజ్య సముదాయం సగం మాత్రమే నిర్మించి నిలిపివేశారు. మరుగుదొడ్లు మరమ్మతుల నిమిత్తం మూసివేశారు. సెప్టిక్‌ట్యాంక్ మూత పగిలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. లైట్లు, ఫ్యాన్లు లేనేలేవు. మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది.
పామర్రు బస్టాండ్ ఆవరణలో మురుగునీరు నిత్యం నిలిచిపోయి ఉంటుంది. మరుగుదొడ్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కూచిపూడి, మొవ్వ బస్టాండ్ ఆవరణ ఆక్రమణకు గురైంది. తాగునీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. పెడన బస్టాండ్ రాళ్లు లేచిపోయాయి. నెల రోజుల క్రితమే మరమ్మతులు చేసినా మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. సెప్టిక్‌ట్యాంకు నిండి వ్యర్థాలు రోడ్డుపైనే ప్రవహిస్తున్నాయి. మరుగుదొడ్డికి సంబంధించిన పైప్‌ను డ్రెయిన్‌లో కలిపివేయటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆర్టీసీ బస్సుల కన్నా ఆటోవాలాలే ఈ బస్టాండ్‌ను అధికంగా వినియోగించుకుంటున్నారు. బంటుమిల్లి బస్టాండ్ ట్యాక్సీస్టాండ్‌గా మారింది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.
మోపిదేవిలో బస్టాండ్ ఉన్నా లోపలకు బస్సులు వెళ్లటం లేదు. రెండు సంవత్సరాల క్రితమే మరుగుదొడ్లు పాడైపోయాయి. అక్కడ ఉన్న చేతిపంపు విరిగిపోయింది. నాగాయలంక బస్టాండ్ గోతులమయంగా మారటంతో కొద్దిపాటి వర్షానికే నీరు నిలబడుతోంది. కోడూరు బస్టాండ్ ఊరికి శివారున ఉండటంతో అక్కడకు ఎవరు వెళ్లలేని పరిస్థితి. అవనిగడ్డ బస్టాండ్‌లో డిపో మేనేజరు కార్యాలయంపై తాగునీటి కుండీని ఏర్పాటు చేశారు. పగలు సమయంలో తాగునీరు వేడిగా వస్తోంది. రెండు కుండలు ఏర్పాటు చేసినా కొద్దిసేపటికే ఈ తాగునీరు అయిపోతోంది.బందరు బస్టాండ్ ఆవరణలోకి అడుగు పెట్టగానే దుర్వాసన ఆహ్వానం పలుకుతోంది. సెప్టిక్ ట్యాంకు సిమెంటు బల్లలు పగిలిపోవటంతో రేక్‌లు అడ్డుగా పెట్టారు. లైట్లు సక్రమంగా వెలగవు. తాగునీటి కోసం కూలర్ ఉన్నా సక్రమంగా పనిచేయదు.కలిదిండిలోని బస్టాండ్ 20 సంవత్సరాలుగా మూతపడింది. ఈ ప్రాంగణం ఆక్రమణలకు గురైంది. లోతట్టుగా ఉండటంతో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతోంది. చెత్త వేసేందుకు ఉపయోగిస్తున్నారు. ముదినేపల్లి, కైకలూరు బస్టాండ్లను నెలరోజుల కిందట రూ. 8 లక్షలతో మరమ్మతులు చేయించటంతో ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. మండవల్లిలో బస్‌షెల్టరే గతి. గుడివాడ బస్టాండ్ 30 సంవత్సరాలుగా ప్రయాణికులకు సౌకర్యాలు అందించలేకపోతోంది. ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు చేరుతోంది. మహిళల మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు అధ్వాన్నంగా ఉన్నాయి.
గన్నవరం బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగవు. మంచినీళ్లు లేవు. వాటర్ కూలర్లు ఉన్నా పక్కనపెట్టేశారు. హనుమాన్‌జంక్షన్ బస్టాండ్‌లో ఆరు నుంచి 11వ ఫ్లాట్‌ఫారం వరకు షెల్టర్ లేకపోవటంతో ప్రయాణికులు ఎండలోనే నిలబడాలి. జాతీయ రహదారికి నాలుగు అడుగులు లోతుగా బస్టాండ్ ఆవరణ ఉండటంతో ఒక మాదిరి వర్షం కురిసినా జలమయంగా మారుతోంది. మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.నందిగామ బస్టాండ్ ఆవరణ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బస్టాండ్‌లో అసౌకర్యాలు అధికమయ్యాయి. ఫ్యాన్లు తిరగవు, ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేవు. రాత్రి పూట కంట్రోలర్ అందుబాటులో లేకపోవటంతో సమాచారం చెప్పేవారే ఉండరు. తాగునీటి కుళాయి ఉన్నా ఆ నీరు తాగేందుకు ప్రయాణికులు సాహసించరు. కూడళ్లు ఏర్పాటు చేసిన అవి పనిచేయటం లేదు.నూజివీడు బస్టాండ్‌లో మంచినీరు లేదు. ఫ్యాన్లు తిరగవు. టీవీలు లేవు.
కష్టాల బస్టాండ్లు
Published Wed, Jan 6 2016 12:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM
Advertisement
Advertisement