ట్రెజరీ ఉద్యోగులు బిజీ..బిజీ | biz biz Treasury employees | Sakshi
Sakshi News home page

ట్రెజరీ ఉద్యోగులు బిజీ..బిజీ

Published Sat, May 24 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

ట్రెజరీ ఉద్యోగులు బిజీ..బిజీ

ట్రెజరీ ఉద్యోగులు బిజీ..బిజీ

కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలోని ట్రెజరీ ఉద్యోగులు బిజీ అయ్యారు.  జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పింఛన్, డీఏ బకాయిల మొత్తాలను చెల్లించేందుకు శనివారంతో గడువు ముగియనుంది. అలాగే ఖజానా శాఖ కూడా రెండుగా విడిపోనుండటంతో ఈ శాఖలో కార్యకలాపాలను శనివారంతో బంద్ చేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను అన్ని ఉపఖజానా కార్యాలయాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా రాష్ట్ర శాఖకు పంపించారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరి వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ ఈనెల 21లో పూర్తి అయ్యింది. బిల్లుల స్వీకరణ మొదట మే 17 నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 19 వరకు అవకాశమిచ్చింది. వెంటనే ఆ తేదీని 21 వరకు పొడిగించింది. ఈ బిల్లుల క్లియరెన్స్‌ను ఈనెల 24లోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుంచి జీఓ నెం.86 రూపంలో ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ట్రెజరీ ఉద్యోగులు, అధికారులు ఆ పనుల్లో తలమునకలయ్యారు.

సాధారణంగా అయితే బిల్లులు క్లియరెన్స్‌కి సుమారు వారం, పది రోజులు పట్టేది.. విభజన నేపథ్యంలో ముందస్తుగా చెల్లించేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే వ్యవధి ఇవ్వడంతో జీతాలు, ఇతర బిల్లులకు సంబంధించిన మొత్తాలు చేతికి అందుతాయో లేదోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడనున్నాయి. ఈలోగా ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం బిల్లుల చెల్లింపులను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది.

ఇప్పటికిప్పుడు చెల్లించాల్సింది రూ. 62 కోట్లు...
ఆర్థిక శాఖ నిర్ణయం ప్రకారం జిల్లాలో 30 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతాలు సుమారు రూ. 40 కోట్లు ప్రతినెలా చెల్లిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు 20 వేల మంది దాకా ఉంటారని, వీరికి రూ.22 కోట్లు పింఛన్ చెల్లిస్తున్నారు. మొత్తం కలిగి రూ. 62 కోట్లను నేటి సాయంత్రం లోపు చెల్లించాల్సి ఉంది. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 14 సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా ఈ మొత్తాలను బట్వాడా చేయాలి.

రాష్ట్ర విభజనకు జూన్ 2వ తేదీని అపాయింటెడ్‌డేగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వారం రోజుల ముందుగానే చెల్లింపు చేయాల్సి ఉంది. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అత్యవసరంగా చేపట్టిన అభివృద్ధి పనులు, ఎన్నికల కోడ్ రాక ముందుకు చేసిన పెండింగ్ బిల్లులు సైతం చెల్లించనున్నారు. కొందరు ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపుకు గడువులోపు కుదరకపోవడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు.

జూన్ 20 తర్వాతే చెల్లింపులు పునఃప్రారంభం...
జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. సీఎం ప్రమా ణ స్వీకారం తర్వాత మంత్రివర్గం కుదురుకునేసరికి మరో వారం రోజులు పట్టవచ్చు. జూన్ 20 తర్వాత గాని ట్రెజరీ బిల్లుల చెల్లింపు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే అది కూడా కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం మీద ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement